Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే రాజయ్య
నవతెలంగాణ - స్టేషన్ ఘనపూర్
చదువుతోనే అంబేద్కర్ గొప్పస్థాయికి ఎదిగారని మాజీ డిప్యూటీ సీఎం , ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. గురువారం నియోజక వర్గ కేంద్రంలో అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున అంబేద్కర్ 125 అడుగుల ఎత్తు విగ్రహావిష్కరణకు తరలివెళ్ళే క్రమంలో జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఏర్పాటుకు రూ.146 కోట్ల 50 లక్ష ఖర్చు అవుతుందని,మొత్తంగా 11 ఎకరాల 8 గంటల విస్తీర్ణంలో అంబేద్కర్ గారి స్మతి వనాన్ని నిర్మిస్తూ, రెండు ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ స్థూపం , పీఠం 125 అడుగుల విగ్రహం ఏర్పాటైందని అన్నారు. 791 టన్నుల ఉక్కు , 96 మెట్రిక్ టన్నుల ఇత్తడి ఉపయోగించి దేశీయ పరిజ్ఞానంతో నిర్మించడం జరిగిందని తెలిపారు. 1978 నుంచి నియో జకవర్గం 44 ఏండ్లుగా ఎస్సీ రిజర్వుడుగా ఉందని, 1996 వరకు నియోజక వర్గంలో ఎక్కడ కూడా అంబేద్కర్ విగ్రహాలు పెట్టబడలేదనీ అన్నారు. నాడు స్థానిక దళిత నాయకులందరం కలిసి ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన స్ఫూర్తిగా సీఎం కేసీఆర్ అలుపెరుగని పోరాట పటిమతో 36 రాజకీయ పార్టీలను ఒప్పించి, రాజ్యాంగం కల్పించిన అవకాశం మేరకు ఆర్టికల్-3 ద్వారా స్వరాష్ట్రాన్ని సాధించామన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి ఏకగ్రీవ ఆమోదమే గాకుండా, సచివాలయానికి అంబేడ్కర్ పేరుతో పాటు 125అడుగుల విగ్రహం ఏర్పాటు చరిత్రలో నిలుస్తాయని అన్నారు. రాజ్యాంగంలో దళితుల, నిమ్న వర్గాల బహుజనులకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్స్ కల్పించారని తెలిపారు. విద్యను వజ్రాయుధంగా మలుచుకుని ఆర్థిక స్వావలంబన సాధించడం, ఆత్మగౌరవంతో బ్రతకడానికి కషి చేయడమే ఆయనకు సమర్పించే నిజమైన నివాళి అని తెలిపారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు రేఖ, సుదర్శన్, జడ్పీటిసిలు బేబీ శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ గుజ్జరి రాజు, మండల పార్టీ అధ్యక్షులు మాచర్ల గణేష్ , మేజర్ జీపి సర్పంచ్ సురేష్ కుమార్, ఎంపీటీసీలు గన్ను నర్సింహులు, బెల్లపు వెంకటస్వామి, గుర్రం రాజు , మల్లెష్, రాజు, ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.