Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి అప్పయ్య
నవతెలంగాణ - ములుగు
ఈ సంవత్సరం నినాదం, నూతన ఆవిష్కరణ అమలు ద్వారా జీరో మలేరియాను చేరుకొనుటకు సమ యం ఆసన్నమైనదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అల్లెం అప్పయ్య అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్స వం పురస్కరించుకొని కన్నాయగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఆశా వర్కర్లతో ర్యాలీ చేపట్టారు. అనంతరం డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ జ్వరం, చలి, వణుకుతో కూడిన తీవ్రమైన జ్వరం, తలనొప్పి, రోజు విడిచి రోజు జ్వరం రావడం, లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు వచ్చి రక్త పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. మలేరియా అని నిర్ధారణ అయితే చికిత్స పొందాలని కోరారు. ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పనికిరాని పాత్రలు, టైర్లు, బకెట్లు తొట్లు మొదలగునవి ఇంటి పరిసరాలలో లేకుండా చూడాలని, ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించి, నీటి నిల్వలను శుభ్రపరిచి, ఆరబెట్టాలని దోమతెరలను తప్పకుండా వాడాలని, తద్వారా దోమలు కుట్టకుండా చూసుకోవచ్చని తెలిపారు. వీధులను శుభ్రంగా ఉంచి, మురుగు కాలువలు డ్రైనేజీల్లో చెత్తాచెదారం తొలగిం చాలని, మురికి కాలువలో పూడికతీత చేపట్టాలని,గ్రామ నాయకులు పెద్దలు యువకులు సామాజిక కార్యకర్తలు ప్రజలకు వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని తెలి పారు. దోమలు కుట్టకుండా అందరూ దోమతెరలు వా డాలని విజ్ఞప్తి చేశారు. ఏటూరు నాగారం ఐటీడీఏ డిప్యూటీ డిఎంహెచ్ఓ క్రాంతి కుమార్ మాట్లాడుతూ దోమతెరలు వాడాలని, దోమల మందు పిచికారి చేసేందుకు సిబ్బంది వచ్చినప్పుడు వారికి సహకరిం చాలని అన్నారు. జ్వరం వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయ కూడదని, దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించాలని, వైద్యాధికారిచే చికిత్స పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ పవన్ కుమార్, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ అభినయ్, డాక్టర్ అనిమీషియా, డాక్టర్ ప్రణీత్,జిల్లా కార్యాలయం నుండి ఎన్విపిడిసిపి మానిటరింగ్ అధికారి దుర్గారావు, డెమో తిరుపతయ్య, సిహెచ్ఓ సంపత్ రావు,హెచ్ఇ సంపత్, భాస్కర్, సబ్ యూనిట్ ఆఫీసర్ నర్సింగరావు, హెల్త్ అసిస్టెంట్లు లక్ష్మణ్, ఓం ప్రకాష్ ,భాస్కర్ వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.