Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య బుసలు కొడుతున్నది. యువతపై పంజా విసురుతున్నది. కరోనా లాక్డౌన్తో తాండవమాడుతున్నది. ఉద్యోగాల్లేక యువత నిరాశానిస్పృహాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. చేతివృత్తులన్నీ నిర్వీర్యమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని పక్కాగా చెప్పొచ్చు. యువశక్తికి ఉద్యోగాలు, స్వయం ఉపాధి పథకాల ద్వారా బలాన్నిచ్చి ఉపయోగించుకోవడంలో ఆ రెండు సర్కార్లూ విఫలమయ్యాయి. తెలంగాణ ఆవిర్భవించి ఆరున్నరేండ్లు దాటినా, టీఆర్ఎస్ ప్రభుత్వానికి నిరుద్యోగం, నిరుద్యోగులు, వృత్తుల గురించి ప్రత్యేక విధానమంటూ లేకపోవడం నిజంగా బాధాకరం. దీంతో నిరుద్యోగం తీవ్రరూపం దాల్చింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో అర్హులైన వారందరికీ నిరుద్యోగ భృతి ఇస్తామంటూ కేసీఆర్ చేసిన బాస, ఇంకా అలాగే ఉంది. టీఎస్పీఎస్సీ ప్రకారం 20 లక్షల మంది, రాష్ట్ర ఉపాధి కల్పన, శిక్షణా సంస్థ ప్రకారం 10లక్షల మంది అర్హతగల అభ్యర్థులకు సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పుడు తెలంగాణలో కేవలం పీజీ పూర్తిచేసిన వారిలోనే నిరుద్యోగులు 33శాతం ఉన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఇది 7.3శాతమే. దీనిని బట్టి రాష్ట్రంలో నిరుద్యోగ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలు విద్యావంతులు, నిరుద్యోగులు, ఉద్యోగుల్లోని తీవ్ర వ్యతిరేకతను వెల్లగక్కాయి. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతరులకు 30శాతం పీఆర్సీ ఇచ్చి కొంత చల్లార్చే ప్రయత్నం సర్కారు చేసింది. అలాగే లక్షల్లో ఉన్న నిరుద్యోగుల గురించి ఇంతవరకు ఆ తరహా ప్రయత్నమేది? తాజాగా ముగిసిన శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ 'నిరుద్యోగ భృతిని కరోనా పరిస్థితులు మెరుగుపడ్డాక అందజేస్తాం.ఈలోపు విధానాలు ఖరారు చేస్తాం' అని ప్రకటించారు. వాస్తవానికి నిరుద్యోగం అంటే ఏమిటీ? నిరుద్యోగికి ఈ సర్కారు దృష్టిలో నిర్వచనమేంటి? ఎవరికి భృతి ఇవ్వాలనే సంగతిపై ప్రభుత్వానికి ఇంకా స్పష్టత లేదు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని అధికారికంగానే పీఆర్సీ చెప్పింది. ఇంతకాలంగా కేవలం 32 వేల పోస్టులను మాత్రమే ప్రభుత్వం భర్తీ చేయగలిగింది.
గత లాక్డౌన్తో 400కుపైగా భారీ పరిశ్రమలు మూతపడ్డాయని ఇటీవల లోక్సభలో కేంద్రం ప్రకటించింది. ఇందులో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలే ఎక్కువ. వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి పొందుతున్నది ఈరంగంలోనే. వీటి పునరుద్ధరణ చర్యలు లేకపోవడంతో లక్షలాది మంది ఉన్న ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు. అలాగే చేనేతరంగాన్ని అభివృద్ధిచేస్తే ఉపాధి అవకాశాలు మరింత విస్త్రృతంగా ఉండేవి. పవర్లూమ్ పరిశ్రమపైనా సర్కారు శీతకన్నేసింది. గత నాలుగురోజులుగా సిరిసిల్లలో సమ్మె జరుగుతున్నది. స్థానిక యాజమానులు బతుకమ్మ చీరల పనిభారాన్ని పెంచి కార్మికుల వేతనాలు మాత్రం పాతవే కొనసాగించడంతో ఆందోళనకు దిగారు. కల్లుగీతకార్మికులు, ఇతరులకు ఉపాధి అవకాశాలను అధికం చేసే 'నీరా' ప్రాజెక్టు ప్రక్రియ నత్తను తలపిస్తున్నది. లీక్కర్ లాబీ అడ్డొస్తున్నదనే అనుమానాలున్నాయి. చేనేత వృత్తిని ఆధునీకరించలేక పోవడంతో నిరుద్యోగం పెచ్చుమీరిపోయింది. డిగ్రీ, పీజీ చదివిన యువత గ్రామీణ ప్రాంతాల్లో జరిగే జాతీయ ఉపాధి హామీ పనులకు వెళ్లాల్సిన దుస్థితి. దారుణస్థితికి బాధ్యులెవరు? చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్లు, చిరువ్యాపారులతోపాటు నిర్మాణ రంగంలోని కార్మికులు, కూలీలు కరోనాకాలంలో బ్యాక్ టూ పెవిలియన్ అంటూ పల్లెల్లో అడుగుపెట్టారు. వేరే అవకాశాల్లేకపోగా వ్యవసాయమే వారినాదుకుంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల పుణ్యమా అని ఇప్పటికే వ్యవసాయం దివాళా తీయడంతో అక్కడ కూడా లక్షల్లో నిరుద్యోగులు తయారయ్యారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) ప్రకారం రాష్ట్రంలో మొత్తం సాధారణ నిరుద్యోగిత శాతం కేవలం 3.68 శాతమే. ఇది జాతీయ సగటు కంటే తక్కువే అయినా, ఐదు నుంచి ఎనిమిదో తరగతి వాళ్లు 1.5శాతమైతే, నిరక్షరాస్యుల్లో నిరుద్యోగిత 6.72శాతంగా ఉన్నట్టు సీఎంఐఈ చెప్పింది. నిరుద్యోగం పెరగడానికి లోపభూయిష్టమైన విద్యావ్యవస్థ, శతాబ్దాలుగా ఒకే తరహా కోర్సులు, రాష్ట్రంలో ఉన్నత విద్యపట్ల నిర్లక్ష్యమే కారణమనేది మేధావులు, నిపుణుల మాట.
నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడానికి ఇప్పటికీ సరైన విధానాన్ని అవలంభించకపోవడం తీవ్ర పరిణామమే. ప్రశ్నించదగ్గదే. నిరుద్యోగ భృతినీ ఇప్పటిదాకా గాలికొదిలేసింది. ఈ పథకం విషయంలో సర్కారు చిత్తశుద్ధి ప్రశ్నార్థకమవుతున్నది. ఇందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెటే నిదర్శనం. ఒక్కో నిరుద్యోగికి రూ.3016 చొప్పున కనీసం 10లక్షల మందికి చెల్లించినా ఏడాదికి రూ.3600 కోట్లు, 30లక్షల మందికైతే రూ.10,800 కోట్లు అవసరం. కానీ తాజా 2021-22 బడ్జెట్లో నిరుద్యోగ భృతికి కేటాయించింది కేవలం రూ.1000 కోట్లే. వృత్తులకూ అంతంతే. దీంతో నిరుద్యోగ సమస్య పరిష్కారం, వృత్తుల విస్తరణపట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది స్పష్టం.