Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఎన్నికల రాష్ట్రాల్లో ఎలక్టోరల్ బాండ్ల విక్రయాలపై నిలిపివేతకు స్టే ఉత్తర్వులివ్వాలని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే స్వచ్ఛంద సంస్థ సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించగా, ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మధ్యంతర స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఎలక్టోరల్ బాండ్ల జారీ పథకాన్ని తీసుకొచ్చింది. ఏ సంస్థ అయినా వ్యక్తి అయినా ఎంత మొత్తానికైనా బ్యాంకుల్లో బాండ్లు కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చవచ్చు. బాండ్లు కొనుగోలు చేసే సంస్థ పేరు గోప్యంగా ఉంటుంది. కార్పొరేట్లకు, అధికారంలో ఉండే పార్టీలకు మధ్య క్విడ్ప్రోకో (నాకు ఇది నీకు అది) ఒప్పందం. తమకు పని చేసి పెడితే అందుకు ప్రతిఫలంగా కార్పొరేట్ కంపెనీలు విధాన నిర్ణేత అయిన అధికార పార్టీకి ముట్టజెప్పే లంచం. ఆ విధంగా పోగేసిన లెక్కకు మించిన నిధులను అధికార పార్టీలు తమ ఎన్నికల ప్రచారంలో ప్రవహింపజేస్తే ఇక ప్రజాస్వామ్య మనుగడ సాధ్యమా? అలాంటి ఎన్నికలు స్వేచ్ఛాయుత ఎన్నికలు అవుతాయా?
ఎలక్టోరల్ బాండ్లు వచ్చాక రాజకీయ పార్టీలకు అందుతున్న నిధులను పరిశీలిస్తే 2019 సార్వత్రిక ఎన్నికలప్పుడు కార్పొరేట్ల నుంచి అందిన నిధుల్లో 95శాతం ఒక్క బీజేపీ ఖాతాలోకే వెళ్లాయని ఎడిఆర్ పరిశోధించి బహిర్గతం చేసింది. 2020లో 52శాతం నిధులు బీజేపీకి అందాయి. అన్ని పార్టీలకూ అందిన దాంట్లో అది చాలా ఎక్కువ మొత్తం. ఈ ఉదాహరణలే ఎలక్టోరల్ బాండ్ల పరమార్ధం ఏమిటో తెలియజేస్తున్నాయి. ఒక్కో పార్లమెంట్ స్థానంలో అవలీలగా రూ.నాలుగైదొందల కోట్లు ఖర్చు చేస్తున్నారంటే నిధులెలా అందుతున్నాయో ఊహించవచ్చు. ప్రభుత్వాల ఏర్పాటు, కూల్చివేతలలో ప్రజాప్రతినిధుల కొనుగోళ్లకు నిధులు కార్పొరేట్ల డొనేషన్ల నుంచే సమకూరుతున్నాయి. గతంలో పార్టీలకు అందే విరాళాలపై ఎన్నికల కమిషన్ (ఈసీ) పర్యవేక్షణ, పారదర్శకత కొంతైనా ఉండేది. ప్రతి ఏటా పార్టీలు రూ.20 వేలకు పైబడిన విరాళాలను ఈసీకి తెలపాలనే రూల్ ఉండేది. ఎలక్టోరల్ బాండ్లలో ఈసీ నియంత్రణ లేదు. బాండ్ల జారీపై ఈసీ, ఆర్బీఐ అభ్యంతరం తెలిపాయి. ఎన్నికల్లో ఇబ్బడిముబ్బడి గుప్త నిధుల ప్రవాహాన్ని నియంత్రించడం సాధ్యం కాదని సుప్రీం కోర్టుకు రెండు తడవలు ఈసీ విన్నవించింది కూడా. సూట్కేస్, బోగస్ సంస్థలను సృష్టించి పార్టీలకు బాండ్ల రూపంలో నిధులిచ్చే అవకాశం ఉంది. విదేశాలకు అక్రమ మార్గాల్లో తరలించిన బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు రాజమార్గంగా ఎలక్టోరల్ బాండ్లు అక్కరకొస్తున్నాయి.
ఏ మాత్రం పారదర్శకం కాని కార్పొరేట్ల ఫండింగ్పై ఈసీ పర్యవేక్షణ అసాధ్యమని నిరూపణ కాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల ముంగిట ఏప్రిల్ 1 నుంచి 10 వరకు తాజా ఎలక్టోరల్ బాండ్ల విక్రయాల నిలిపివేతకు సుప్రీంకోర్టు నో చెప్పడానికి సహేతుకమైన కారణాలు కనిపించట్లేదు. కేసు విచారణ కొనసాగుతుండగా అనుబంధ దరఖాస్తు ఆధారంగా స్టే ఇవ్వడం సాధ్యం కాదన్న న్యాయస్థానం వివరణ అంత సహేతకంగా లేదు. పిటిషనర్ వేసిన ప్రధాన కేసు విచారణ సందర్భంగా 2019లో రాజకీయ పార్టీలు సీల్డ్ కవర్లో విరాళాల వివరాలు ఈసీకి ఇవ్వాలని ఆదేశించింది. బాండ్లను కొనుగోలు చేసేవారి వివరాలు కచ్చితంగా ప్రభుత్వానికి తెలుస్తాయి. ప్రతిపక్షాలకు విరాళాలిచ్చే వారిపై ప్రభుత్వం కక్షపూరితంగా చర్యలు చేపట్టడానికి వీలుందన్న పిటిషనర్ వాదనపై, అదే జరిగితే మొత్తానికే చట్టాన్ని రద్దు చేయాల్సి ఉంటుందన్నారు చీఫ్ జస్టిస్. బాండ్ల విక్రయాలపై మాత్రం స్టే ఇవ్వలేదు. కేసు తుది విచారణ వరకు ఆగాలన్నారు. రాజకీయ పార్టీలకు అందే విరాళాల వివరాలు తెలుసుకునే హక్కు ఓటర్లకు, ప్రజలకు ముమ్మాటికి ఉంటుంది. తెలుసుకునే హక్కును పౌరులకు రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగం కల్పించిన హక్కును ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ప్రభుత్వం కాలరాస్తోంది. ఈ కీలక అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోకపోవడం ఆందోళనకరం.