Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఎవరు రాయగలరు 'అమ్మ' అను మాట కన్న కమ్మని కావ్యం.. ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయ్యని రాగం' అనే సినిమా పాట అమ్మ గొప్పతనాన్ని వర్ణిస్తుంది. ఇంకా అనేక పాటలు అమ్మ సెంటిమెంట్‌ను అద్భుతంగా పండిస్తాయి. కానీ నూటాపదిహేనేండ్ల క్రితం మాక్సిం గోర్కీ రాసిన 'అమ్మ' నవల నిజమైన అమ్మను సృజించింది. గోర్కీ తాను నవలకు ఆ పేరు పెట్టటంలోనే ఓ పెద్ద ధ్వని ఉంది. అమ్మ నొప్పులు పడి రక్తాన్ని చిందించయినా కొత్త సృష్టికి పురుడుపోస్తుంది. ఈ సమాజాన్నుంచి మరో ప్రపంచాన్ని కలగని నిజం చేసుకునే వాళ్ళందరూ అమ్మ పాత్రలే. ప్రపంచ సాహిత్యంలో అమ్మలాంటి రచనతో పోల్చదగినది మరో రచన లేదంటే అతిశయోక్తి కాదు. కాలాలను, స్థలాలను, తరాల అంతరాలను అధిగమించి ఎందరికో ప్రేరణనిస్తున్న గొప్ప రచన అమ్మ. సమాజ మార్పుకు మూలవిరాట్టులైన శ్రామికవర్గ చైతన్యాన్ని, సామ్యవాద వాస్తవికతను ప్రతిబింబించిన అద్భుత రచన అమ్మ. అందుకే ఆనాడు రష్యన్ విప్లవ సమూహాలలోని ప్రతిహస్తంలోను ఆ పుస్తకం ఆయుధంలా, ధైర్యంలా ఉండింది. ప్రపంచ విప్లవ సైన్యానికీ ప్రేరణగా నిలిచింది.
మార్చి మాసంలోనే గోర్కీ జయంతి. ఆయనను తలచుకున్నాం. రెండేండ్ల కంటే ఎక్కువగా 'బడి' చదువులేని గోర్కీ సమాజాన్ని చదువుతూపొందిన జ్ఞాన సంపదతో, భాష, భావగాఢతలతో ప్రపంచ ప్రభావశీల రచయితగా ఎదగడం, ఇప్పటికీ అతని రచనల ద్వారా చిరస్మరణీయుడుగా ఉండటం ఆయన సాధించిన విజయం. వాస్తవిక సామాజిక జీవితాన్ని కళాత్మకం చేయడంతో పాటు, సమతా భవితను కలగనడంలోనే ఆయన రచన సార్వజనీనతను సాధించింది. గోర్కీ మరణించినప్పుడు రష్యా దేశాధినేతలందరూ వీడ్కోలు చెబుతూ భౌతికకాయాన్ని మోయడం మరే రచయితకూ దక్కని గొప్ప గౌరవం.
అలాంటి మహా ప్రజారచయిత సృష్టించిన అమ్మ నవలలోని ప్రతి పాత్రా, సంఘటనలూ, సన్నివేశాలు అన్నీ వాస్తవ జీవితంలోంచి పరిశీలించి తెలుసుకున్న విషయాలే. ఏ రచయితకైనా మానవ జీవితపు అధ్యయనం అవగాహన ఎంత అవసరమో గోర్కీ రచన రుజువు చేస్తుంది. ప్రపంచంలోనే ప్రప్రథమంగా ఆధునిక కార్మికవర్గ చైతన్యాన్ని అందుకున్న రచయిత కావడమే గోర్కీ విశిష్టత.
'అమ్మ'లో ఏముంది అంటే, రష్యన్ విప్లవానికి ముందున్న కార్మిక వర్గ జీవితమూ, పోరాటాల సాధారణ చిత్రణ. 1905లోనే రెండు లక్షల మంది ప్రజలు జార్ చక్రవర్తికి తమ బాధల్ని విన్నవించుకోవడానికి మహాజరు తీసుకుని వెళతారు. నిరాయుధులైన ప్రజలపై సైనికుల కాల్పులతో ఆ ఆదివారం రక్తసిక్త ఆదివారంగా పేరొందింది. ప్రజలు ఎదురుతిరిగారు. గోర్కీ బహిరంగ తిరుగుబాటుకు పిలుపునిచ్చాడు. నిర్బంధానికి జార్ పూనుకోగా విదేశాలకు వెళ్ళి అక్కడే అమ్మ నవలను రచించాడు గోర్కీ. ఆ ప్రదర్శనకు నాయకత్వం వహించిన పోత్ జలమోల్తో గోర్కీకి చాలా సన్నిహిత పరిచయం. అతన్ని దృష్టిలో పెట్టుకునే కథానాయకుడు పావెల్ పాత్రను రూపొందించారు. అతనితల్లే అమ్మ నీలోవ్నా. మరో కార్మికుడు కొడొమోత్సెవ్ తల్లి లక్షణాలనూ కూడా గోర్కీ ఆ పాత్రకే జోడించాడు. ఆనాడు అనేక మంది తల్లులు, తమ పిల్లలను విప్లవోద్యమానికి పంపారు. వారి లక్షణాలనూ 'అమ్మ'లో చూపించారు. అంటే అనేక మంది తల్లుల సమూహం ఈ ''అమ్మ''.
ఫ్యాక్టరీ యజమానులు కార్మికుల శ్రమను దోచుకోవడాన్ని వర్ణించే వాక్యాలతో అమ్మ రచన ప్రారంభమవుతుంది. జీవన దృశ్యాలనూ చిత్రిస్తుంది. కథానాయకుడు పావెల్ తండ్రి మిహలారు వ్లాసోవ్ దాష్టీకాన్ని భరిస్తూ బతికే తల్లి నీలోవ్నా. రోజంతా చాకిరీ చేసే కార్మికుడి ప్రవర్తనను ఖండిస్తూనే, దానికి కారణాలను విశ్లేషించడంలో గోర్కీ వర్గ చైతన్యాన్ని ప్రదర్శిస్తాడు. తల్లితో పావెల్ చక్రవర్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నామని చెబుతాడు. ఈ పుస్తకాలు చూస్తే జైళ్లో పెడతారనీ అంటాడు. 'మరి ఆ పనెందుకు చేస్తావు' అని అమ్మ అడుగుతుంది. 'ఎందుకంటే నేను నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నాను గనక' అంటాడు పావెల్. వాళ్ళకు ఆపద రాకుండా చూడాలని అమ్మ ప్రభువును ప్రార్థిస్తుంది. 'అమ్మ' గత తరం ప్రతినిధే. కానీ కొత్తతరం ఆలోచనకు, ఆశయానికి స్వాగతం పలుకుతుంది. తను నిత్యం పూజించే క్రీస్తు బోధనలను ముందుతరం చేస్తున్న కార్యాచరణలోనే చూసుకుంటుంది. చివరకు ఆధ్యాత్మికత కన్నా ఈ పోరాటాలే గొప్పవన్న నిశ్చయానికి వచ్చి విప్లవ సాహిత్య ప్రచారంలో భాగం పంచుకుంటుంది.
పావెల్ విప్లవమార్గం, నీలోవ్నా దయామయ హృదయం, కరుణాభావన గోర్కీ రచనకు నైతికతను సమకూర్చాయి. ఒక విధంగా అమ్మ అంటే సమాజమే. మేమంతా ఒక తల్లి బిడ్డలం, ప్రపంచంలోని కార్మికులంతా సోదరులనే అకుంఠిత విశ్వాసమే మా తల్లి అని అన్న పావెల్ స్నేహితుని మాట అక్షర సత్యం. పోరాటాలలో జన బాహుళ్యం ఎలా రాటుదేలుతారో అమ్మ వివరిస్తుంది. మనిషి భవితవ్యం ప్రజారాశుల భవితవ్యంతో విప్లవాత్మక పరివర్తనతో ముడిపడి ఉందనే సత్యాన్ని చెబుతుంది. మనిషి జన్మతః దుష్టుడు కాదనీ వర్గ వ్యవస్థ జుగుప్సాకర సామాజిక ప్రభావం వల్లే మనిషి భ్రష్టుడవుతున్నాడనీ గుర్తించాలని బోధిస్తుంది.
నవల ముగింపులో పోలీసులు దౌర్జన్యం చేసినప్పుడు ''రక్తపుటేర్లు పారించినా సత్యాన్ని ముంచేయలేరు, మనమంతా కామ్రేడ్‌లం, ఆత్మీయులైన బంధువులం, అందరమూ సత్యమనే తల్లిబిడ్డలం. కామ్రేడ్స్ అన్న మాట నాలో స్మరించగానే వాళ్ళంతా నా హృదయంలోంచి పొంగి వస్తుండడం నేను వినగలుగుతున్నా'' అని అమ్మ చివరగా అంటుంది. అవును నేటి ప్రజా వ్యతిరేక శక్తుల విజృంభణకాలంలోనూ అమ్మ మనకు కొండంత చైతన్యాన్ని నింపుతుంది.