Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ..'' అనే పాట వింటే నిజంగా రెక్కలు తొడిగి మనమూ ఎగిరిపోతే ఎంత హాయిగా ఉంటుందోననిపిస్తుంది. ఈ మానవ సైకాలజీ సినీగేయ రచయితల కంటే పాలకపార్టీ నాయకులకే మహ భేషుగ్గా తెలుసు.
ఐదురాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయన్న విషయం, అందులో బెంగాల్, కేరళలు ఉన్నాయన్న విషయము మనకెరుకే. బ్రిటిష్ కాలం నుంచే ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి 'కాణాచి' లాంటి తమిళనాడూ ఎన్నికల ముంగిట నిలిచిన సంగతీ తెలిసిందే. అందుకే మోడీ సాబ్ 'కార్మిక కోడ్'ల అమలు తాత్కాలికంగానైనా అటకెక్కించాడు. అప్పుడొక పైసా, ఇప్పుడొక అరపైసా పెట్రోల్ ధరలు తగ్గించాయి సదరు ఆయిల్ కంపెనీలు. ఎన్నికలైన తర్వాత కావల్సినంత పెంచుకోవచ్చనే సౌలతిచ్చినట్టుంది మోడీ సర్కార్! ఆ విషయం తెలియడానికి అట్టే సమయం పట్టదులే! మొన్న రాష్ట్రంలో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో రెంటినీ అధికార టీఆర్ఎస్ పార్టీనే ఎగరేసుకుపోయినా చావుతప్పి కన్ను లొట్టపోయింది. చివరి నిమిషంలో చేసిన జిమ్మిక్కులతో ఉద్యోగుల ఓట్లను ప్రోది చేసుకోగలిగినా నిరుద్యోగ యువతను ప్రసన్నం చేసుకోలేకపోతోందని అర్థమైంది. ''ఉద్యమ కాలం''లో కీలక డిమాండ్ 'నియామకాలు!' కావటంతో వెంట వెంటనే వచ్చే కార్పొరేషన్ల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 50వేల ఖాళీల భర్తీ ప్రకటన వెలువడింది.
వెరసి, ఇవన్నీ చూస్తుంటే పైన పేర్కొన్న పాటలాగే ''ఎప్పటికీ ఎన్నికలు ఉండిపోతే'' బాగుండునని పించట్లేదా? పాలకులు ప్రజల కోసం ఆలోచించేది ఓట్ల పండుగలప్పుడే!
(19) 60వ దశకం చివరి నుంచి మన దేశం ఆర్థిక సంక్షోభ కడలిలో చిక్కుకుంది. 1966లో మొట్టమొదటిసారి రూపాయి విలువ తగ్గించారు. ఈ ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభంగా మారింది. 1967లో జరిగిన ఎన్నికల్లో ఏడు రాష్ట్రాల్లో (ఆనాటి బలమైన బూర్జువా - భూస్వామ్య పార్టీ అయిన) కాంగ్రెస్ ఓడిపోయింది. బెంగాల్, కేరళల్లో వామపక్షాలు అధికారంలోకి రాగా, మిగిలినచోట్ల నేషనల్ కాన్ఫరెన్స్, డీఎంకే, అకాలీదళ్ మొదలైన పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఆ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు 1969లో 14 బ్యాంకుల జాతీయ కరణ, రాజభరణాల రద్దు చేపట్టింది ఇందిరాగాంధీ. కాంగ్రెస్ నిలువునా చీలిపోయింది. సమస్య పరిష్కారం కాలేదు. పరిస్థితి తట్టుకునేందుకు 1975లో ఎమర్జెన్సీ ప్రకటించింది. చివరికి 1977లో కాంగ్రెస్ ఓటమితో రాజకీయంగా ఆ దశ ముగిసింది.
జనతా పార్టీకి 300పైగా సీట్లు రావడంతో కార్మికచట్టాల సవరణకు శ్రీకారం చుట్టారు. కార్మికోద్యమం దాన్ని ఓడించింది. తిరిగి 1985లో రాజీవ్‌గాంధీకి లభించిన 400పైగా లోక్‌సభ సభ్యుల దన్నుతో 1987లో మళ్ళీ ఆ ప్రయత్నం జరిగింది. కార్మికోద్యమం దాన్నీ ఓడించగలిగింది. సంక్షోభం నుంచి బయటపడాలంటే కార్మికవర్గంపైనా, కార్మికోద్యమం పైనా దాడిచేయడం మినహా పాలక వర్గాలకు మరోదారిలేదు. 1991 తర్వాత సోవియట్ పతనం. నయా ఉదారవాద విధానాలు విశ్వవ్యాపితమైన నేపథ్యంలో దాదాపు దేశంలోని అన్ని పాలకపార్టీలకు ఉదారవాద విధానాలు తలకెక్కిన నేపథ్యంలో నేటి దాడి సాగుతోంది.
మన దేశం లాంటి దేశాల్లో నేడు నెలకొన్నది వ్యవస్థీకృత ఆర్థిక సంక్షోభం. ''వేగంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థ'' అంటూ ఎన్ని భుజకీర్తులు తగిలించుకున్నా ముదురుతున్న ఆర్థిక సంక్షోభ నిప్పుకణికను జేబులో వేసుకోతరమా ఎవరికైనా?! ప్రభుత్వరంగాన్ని అప్పనంగా అంబానీ, అదానీలకు కట్టబెట్టడమైనా, గనులు, అడవులు మొదలైన సహజవనరులు పెట్టుబడి బకాసుర భోజనానికి అర్పించడమైనా, నాలుగు కార్మికకోడ్‌లు, మూడు వ్యవసాయచట్టాలు చేయడమైనా ఈ ఆర్థిక సంక్షోభంలో నుంచి పెట్టుబడిదార్లను బయట పడేసేందుకే!
రైతు ఉద్యమానికి ముండ్లు దించినట్టే, కష్టజీవుల ఐక్యతకు ఎన్నో సవాళ్ళు విసురుతోంది మోడీ సర్కార్. సీఏఏ, ఎన్నార్సీ అంటూ దారితప్పిస్తోంది. ''గో! కరోనా గో!!'' అని చప్పట్లు కొడితే కరోనా ''పారిపోయినట్టే' శ్రీరాముడికి తాము నిర్మించే మరో బృహత్తర ఆలయ నిర్మాణంతో దేశంలో నిరుద్యోగం, పేదరికం వంటివన్నీ ''పారిపోతాయని'' నమ్మించ చూస్తోంది. ఉదారవాద విధానాల పూర్వరంగంలో కార్మికవర్గ ఐక్యతను కంటికి రెప్పలా కాపాడుకోవడం ఈ విధానాలను ఎదిరించాలనుకునే వారి కర్తవ్యం. విభిన్న భాషలు, మతాలు, కులాలు ఉన్న వైవిధ్య భరితమైన భారతావనిని ఒకే మూసలో బంధించాలన్న సంఘ్ పరివార్ లక్ష్యం పగటికలే! గోవధ గురించి తమిళనాడులో ఉపన్యాసాలు దంచిన పరివార్ నేతలు కేరళలో దాని ఊసే ఎత్తలేదు. అసోంలో మొన్న ఒక బీజేపీ అభ్యర్థి ''పశుమాంసం జాతీయ ఆహారం''(నేషనల్ డిష్) అన్నాడు. పైగా ''దాన్ని ఎవరూ బ్యాన్ చేయలేరు'' అని కూడా నొక్కి వక్కాణించాడు. ఓట్ల కోసం ఏరోటికాడ ఆపాట పాడే పార్టీ అది.
ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ పేర్కొన్నట్టు ఉద్యమాల్లో వెల్లివెరిసే ఐక్యత ఇంగ్లీష్ సామ్రాజ్య పునాదుల్నే పెకలించివేసింది. మోడీ ఎంత? మోడీ ''సామ్రాజ్యమెంత''?