Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సృష్టిస్తున్న విలయానికి నేడు పేదోడికి అరవై గజాల ఇంటిస్థలం కాదు, స్మశానంలో ఆరడుగుల నేల ఓ కలగా మారింది. దేశంలో రెండోదశ కరోనా వ్యాప్తి ప్రకంపనలు సృష్టిస్తున్నది. ప్రమాదఘంటికలు మోగిస్తున్నది. అదే సందర్భంలో మన ప్రభుత్వ పెద్దల పగటి వేషాలనూ, ప్రచార వ్యామోహాలనూ, ఉత్తరకుమార ప్రగల్భాలనూ పట్టి చూపిస్తున్నది. ''వట్టి మాటలు కట్టిపెట్టోరు గట్టిమేల్ తలపెట్టవోరు' అన్నాడు మహాకవి గురజాడ. కానీ ఇప్పుడు గట్టిమేలును కట్టిపెట్టి వట్టిమాటలు పలుకుతున్న పాలక నేతల బండారాన్ని నిట్టనిలువునా బట్టబయలు చేస్తున్నది కరోనా.
''ఏడాది క్రితం కరోనాపై పోరాటంలో భారతదేశం ఏమైపోతుందోనని ప్రపంచం భయపడింది. కానీ నేడు దేశం కరోనాను జయించిన తీరు చూసి ప్రపంచమే స్ఫూర్తి పొందుతోంది.'' సరిగ్గా రెండునెలల క్రితం ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన మాటలివి. ఆరోగ్యమంత్రి హర్షవర్థన్ అయితే ''దేశంలో కరోనా శకం ముగిసింది'' అని ప్రకటించారు. హేమంత్ బిశ్వాస్ శర్మ లాంటి బీజేపీ నేతలనేకులు ''దేశంలో కరోనాలేదు, మాస్కులు ధరించాల్సిన అవసరం అంతకంటే లేదు'' అని సెలవిచ్చారు. మోడీని ''కరోనాను జయించిన వీరుడి''గా కీర్తించారు. రెండునెలలు తిరిగేసరికి ఇవన్నీ వట్టిమాటలే తప్ప వీరు చేసిన గట్టి మేలు ఏమీలేదని కరోనా రెండోదశ దండోరా వేస్తోంది. ఇప్పుడు ప్రపంచం మన దేశం పట్ల సరిగ్గా ప్రధాని చెప్పినదానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. యూకే భారత్‌ను రెడ్‌లిస్టులో పెట్టింది. బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రపంచంలో ఏ దేశానికి చెందినవారైనా గత పది రోజుల్లో భారతదేశంలో ఉండి ఉంటే, వారికి బ్రిటన్‌లో ప్రవేశాన్ని నిషేధించారు. హంగ్‌కాంగ్ కూడా భారత్ నుంచి వచ్చే అన్ని విమానాలపై నిషేధం ప్రకటించింది. ఎందుకంటే... నేడు ప్రపంచంలోనే అత్యధికంగా రోజుకు మూడులక్షలకు చేరువలో కేసులు నమోదవుతున్న దేశం భారతదేశం. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులున్న రెండవ దేశం భారతదేశం. మరి ఈ ''ఘనత''కు కారకులెవరు? ఇంకెవరు ప్రజలేనని ప్రకటించారు క్రేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగారు. ప్రభుత్వ బాధ్యతేమీ లేదట! ప్రజల నిర్లక్ష్యమే కారణమట!! సాఫల్యాలు తమ ఖాతాలో వైఫల్యాలు జనం ఖాతాలో..! ఇదీ ప్రభుత్వ పెద్దల, మోడీ భక్తుల తీరు..!!
ఈ విపరీత వ్యాఖ్యానాలు, వికారపు విన్యాసాలు ఇప్పుడు కొత్తగా వింటున్నవీ, చూస్తున్నవేం కాదు. చప్పట్లు కొట్టించి, దీపాలు వెలిగించి, గండదీపాలు మోపించి ''నమో నమో'' అంటూ భజనలు చేసిన బీజేపీ పెద్దల అశాస్త్రీయ పోకడలను మొదటి దశలోనే స్పష్టం చేసింది కరోనా. విపత్తు సమయంలో కూడా విభజన గీతలు గీసిన దుర్మార్గాన్ని అప్పుడే విప్పి చెప్పింది. వలస కార్మికుల నెత్తుటి అడుగులతో ఈ దేశ దౌర్భాగ్యానికి కొలతలు వేసిన దాష్టీకాన్నీ స్పష్టంగానే ఎత్తి చూపింది. విపత్తులో సైతం లాభాల వేటలో తనతో పోటీపడి కోరలు చాపుతున్న పెట్టుబడి వికృతరూపాన్ని బజారుకీడ్చింది. ఆ పెట్టుబడికి వంతపాడుతూ, విపత్తునే ఒక అవకాశంగా తీసుకుని అధికారం సాగించిన హక్కుల హననాన్నీ, ప్రజల ఆస్తుల అమ్మకాన్నీ కండ్లముందుంచింది. మనం కనిపెట్టడంలో వెనుకబడుతున్నాం గానీ, కరోనా మొదటి దశలోనే అనేక కఠోర సత్యాల్ని వెల్లడించింది.
ఇప్పటికీ ప్రజల్ని మభ్యపెట్టి మాయచేయడం తప్ప, కరోనా నివారణకు ప్రభుత్వం పట్టుదలగా పనిచేయడం లేదని రెండవ దశ తెలియజేస్తోంది. ఇచ్చేందుకు టీకాలే లేకున్నా ఉత్సవాలకు పిలుపునివ్వడం ఇందుకో తాజా ఉదాహరణ. నిన్నటిదాకా ప్రపంచానికీ టీకాలను అందిస్తున్నామని జబ్బలు చరుచుకున్న నేతలు ఇప్పుడు విదేశీ టీకాల కోసం ఎదురుచూపులు చూస్తుండటం వైచిత్రి! సరిపడా నిధులు కేటాయించమని దేశీయ ఉత్పత్తి సంస్థలు మొదటి నుంచీ మొరపెట్టుకుంటున్నా పట్టించుకోని ప్రభుత్వం, ఇప్పుడు ''చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు'' సీరంకు మూడువేల కోట్లు, భారత్ బయోటెక్‌కు పదిహేను వందల కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల సభలు, కుంభమేళాలకు అనుమతించింది. ప్రజల ప్రాణాలను మాత్రం గాలిలో దీపాలు చేసింది. హర్యానాకు చెందిన సాక్షాత్తూ ఒక కేంద్రమంత్రే తన తమ్ముడికి బెడ్ ఇప్పించి ప్రాణాలు కాపాడండి అని వేడుకుంటున్నాడంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సెకండ్ వేవ్ వస్తుందని తెలిసీ, మొదటి వేవ్ అనుభవం ఉండి కూడా తగిన విధంగా ఆరోగ్యవ్యవస్థను చక్కదిద్దుకోని పెద్ద మనుషులను ఏమనాలి? ఆక్సిజన్ మొదలు వ్యాక్సిన్ వరకూ అన్నీ కొరతలే..! పరీక్ష నుంచి చికిత్స వరకూ అందని ద్రాక్షలే..!! ఎంతసేపటికీ రాష్ట్రాలకు సలహాలివ్వడమే తప్ప సహాయమందించని కేంద్ర ప్రభుత్వం, ఇంతటి నేరపూరిత నిర్లక్ష్యానికి పాల్పడుతూ కూడా ప్రజల్నే నిందించజూడటం జవాబుదారీతనం అనిపించుకోదు. చివరికి విషమిస్తున్న ప్రజల పరిస్థితులకు స్పందించి కోర్టులు అక్షింతలు వేస్తే తప్ప ప్రభుత్వాలు కదలనిస్థితి బహుశా ప్రపంచంలో మరేదేశంలోనూ ఉండదేమో..!