Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్ గండం నుంచి గట్టెక్కించేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు చర్యలు నత్తను తలపిస్తున్నాయి. నిధులు, మందుల్లేక, వ్యాక్సిన్లు, ఆక్సిజన్ అందుబాటులో ఉండక వైరస్ ప్రళయ భీభత్సం సృష్టిస్తున్నది. ఓ పక్క టీకోత్సవాల పేరిట కేంద్రం హడావిడి చేస్తుండగా.. క్షేత్రస్థాయిలో సామాన్యులకు ఎదురుచూపులు తప్పట్లేదు. ఇది బీజేపీ ప్రభుత్వ ప్రచార్భాటం తప్ప, మరోకటి కాదని ఆచరణలో తేలిపోయింది. కాగా ప్రజలకు టీకా ఇచ్చే బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నది. ఎప్పటిలాగే ప్రయివేటుకే విందు వడ్డించేందుకు సిద్ధమైంది. మరోసారి రాష్ట్రాలకు అధికారాలను ఇచ్చే పేర ఆర్థిక భారాన్ని మోపింది. ఆపదలో ఆదుకునే బదులు, ఉచిత సలహాలిచ్చి సరిపెట్టడం బాధ్యతారాహిత్యం కాదా? 18 ఏండ్లపైబడిన వారందరూ టీకాకు అర్హులేనన్న కేంద్రం, అందుకు తగిన ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమైంది. రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులు, మరణాలు ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంటే, ప్రభుత్వాల నియంత్రణా చర్యలు మాత్రం గోరంతే. వైద్యపరమైన సౌకర్యాలు మెరుగుపరచడంలో అడుగు ముందుకు పడటం లేదు. సెకండ్‌వేవ్‌లో మూడు రోజుల్లో పాజిటివ్ వస్తున్నది. పిల్లలపై ప్రభావం అధికంగా ఉంటున్నది. విస్ఫోటనంలా కొత్త రూపంలో వైరస్ దూకుడు ప్రదర్శిస్తున్నది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో సామాన్య ప్రజలు, జర్నలిస్టులు పిట్టల్లా రాలిపోతున్నారు. రెమ్‌డెసివిర్ కొరత రోగులకు ప్రాణసంకటంగా మారింది. కేంద్రం వాటిని సరఫరా చేయాల్సి ఉన్నా, ఆ మేరకు ముందస్తు అప్రమత్తతా, ప్రణాళిక అసల్లేదు. ఇప్పుడు దేశంలో అత్యవసర ఇంజెక్షన్లకూ కొరత తప్పటంలేదు. తుఫాన్‌లా విరుచుకుపడుతున్న కరోనా సెకండ్‌వేవ్ ప్రజల మీద దాడి చేస్తుంటే, రెండు ప్రభుత్వాలు రాజకీయ కపట నాటకాలు ఆడుతున్నాయి. టీకాలు వేసుకోవడానికి అందరికి అర్హత కల్పించడం సంతోషమేగానీ, అసలు ఆ డోసులు ప్రభుత్వం దగ్గరగానీ, మార్కెట్లోగానీ దొరకకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశం మొత్తానికి ఆక్సిజన్ అందిస్తానని విశాఖ స్టీల్‌ప్లాంటు మొర పెట్టుకుంటున్నా, కేంద్రం ప్రయివేటుకే ఓటేస్తున్నది. టీకాల బిజినెస్‌కూ పచ్చజెండా ఊపింది. వాస్తవంగా దేశంలో కరోనా వ్యాప్తికి బీజేపీయే కారణమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. నమస్తే ట్రంప్ కార్యక్రమం దగ్గర నుంచి కుంభమేళా వరకు లక్షలాది మందితో భారీ సామూహిక కార్యక్రమాలకు కారణమైన బీజేపీ, వైరస్‌ను దేశవ్యాప్తం చేసింది. తద్వారా పానిక్ సృష్టించింది.
ఇక హైకోర్టు అక్షింతలు వేసాకగానీ తెలంగాణ ప్రభుత్వం కదలకపోవడం గమనార్హం. ''ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదా? వైన్‌షాపులు, పబ్బులు, క్లబ్బులపై వచ్చే ఆదాయమే ముఖ్యమా? అంటూ కరోనా నివారణా చర్యలపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలివి. వైరస్‌పై ప్రభుత్వం ఇచ్చే నివేదికలూ సక్రమంగా లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సభలు, ర్యాలీలపై ఆంక్షలు ఎందుకు పెట్టడం లేదంటూ ప్రశ్నించింది. ఈ మాటలే రాష్ట్రంలో కోవిడ్ దారుణ వ్యాప్తిని, ప్రభుత్వ నిష్క్రీయాపరత్వాన్ని రుజువుచేస్తున్నాయి. స్వయానా సీఎం కేసీఆర్ కరోనా బారినపడటంతో ప్రజలు మరింత భయాందోళనకు లోనయ్యారు. వైరస్ తీవ్రమవుతున్నా మున్సిపల్ ఎన్నికలకు సర్కార్ గ్రీన్‌సిగల్ ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. చివరకు రాష్ట్ర ఎన్నికల సంఘమే 'ఏం చేద్దామంటూ' కేసీఆర్ సర్కారును సలహా అడిగింది. వచ్చే నవంబరులో థర్డ్‌వేవ్ వచ్చే అవకాశాలున్నాయనీ, వచ్చే ఆరునెలల్లో ప్రజలంతా టీకా తీసుకోకపోతే థర్డ్‌వేవ్ తప్పదని వైద్యారోగ్యశాఖ హెచ్చరిస్తున్నది.
గడిచిన 24 గంటల్లో 6542 పాజిటివ్ కేసులు రాగా, అత్యధికంగా 20మంది చనిపోయారు. 46,488 కేసులు యాక్టివ్‌గా ఉండటం తీవ్రతకు అద్దంపడుతున్నది. రోజుకు లక్ష మందికి వ్యాక్సిన్లు, టెస్ట్‌ల వాగ్దానం అటకెక్కింది. తొలిదశ కరోనా అనుభవాలున్నా, సెకండ్ వేవ్ తీవ్ర పరిణామాలను ముందస్తుగా అంచనా వేయడంలో, ఆ మేరకు ఏర్పాట్లు చేయడంలో రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన డోసులను తెప్పించుకునే సత్తా గులాబీ సర్కారుకు లేదా? ఇదిలావుండగా కోవిడ్ టెస్టుల కోసం కిట్లు, మాస్క్‌ల కోనుగోళ్లకు గతంలో ఖర్చుపెట్టిన రూ.500 కోట్లల్లో అక్రమాలు జరిగినట్టుగా విమర్శలొస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనీ, అస్మదీయ కంపెనీకి ఏకంగా రూ.200 కోట్ల టెండర్ కట్టబెట్టారనే ఆరోపణలూ బలంగానే వినిపిస్తున్నాయి. ఈ సంగతీ నిగ్గుతేల్చాలి. టీకాను సార్వజనీనం చేయాలనీ, వివక్ష వద్దనీ, సమానత్వ సూత్రానికి భిన్నంగా బీజేపీ టీకా విధానం ఉందని సీపీఐ(ఎం) మొదటి నుంచీ చెబుతున్నది. ప్రజలందరికీ టీకాను హక్కుగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నది.