Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కష్టకాలంలోనే మనుషుల అసలు నైజాలు బయటపడతాయన్నట్టు నేడు కరోనా కాలంలో పాలకనేతల నిజస్వరూపాలన్నీ బట్టబయలవుతున్నాయి. సంక్షోభ సమయాల్లోనే ప్రభుత్వాల సామర్థ్యాలు స్పష్టమవుతాయని మరోసారి నిరూపిస్తోంది కరోనా. వైరస్ విజృంభణకు దేశం ఊపిరాడక చస్తుంటే చేష్టలుడిగి చూస్తున్న ప్రభుత్వాల తీరుకు, చివరికి కోర్టులు స్పందించి మందలించాల్సిన పరిస్థితి దాపురించింది. ''ఇక్కడేమీ మానవత్వం మిగిలి ఉన్నట్టు లేదు. అడుక్కుతింటారో, అప్పుతెచ్చుకుంటారో తెలియదు. బాధిత ప్రజలకు ఆక్సిజన్ అందించాలి'' - ఇది కేంద్రప్రభుత్వాన్నుద్దేశించి ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్య. ''ఈ నీచ సమాజంలో భాగమైనందుకు సిగ్గుగా ఉంది'' - ఇది బాంబే హైకోర్టు వ్యాఖ్య. ఇలా దేశంలో పలు కోర్టులు కరోనానెదుర్కోవడంలో ప్రభుత్వాల వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సమయంలో... గురువారంనాడు సుప్రీంకోర్టూ స్పందించింది. ఆమేరకు ప్రభుత్వానికి నోటీసులూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఇది జాతీయ ఎమర్సెన్సీ అనీ, దీనినెదుర్కోవడానికి ఓ జాతీయ ప్రణాళిక కావాలనీ దేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన హెచ్చరిక దేనికి సూచిక దేశంలోకి మహమ్మారి ప్రవేశించి 16నెలలు దాటినా ఓ ప్రణాళికంటూ లేని కార్యాచరణ ఎవరి అసమర్థతకు ప్రతీక తిరుగులేని నేతలుగా తమకు తామే భుజకీర్తులు తగిలించుకుని తిరుగుతున్న 'పెద్దమనుషులంతా' సమాధానం చెప్పాలిప్పుడు.
దేశంలో రోజుకు మూడులక్షలకు పైగా కేసులు... బహుశా కరోనా పురుడు పోసుకున్నాక ప్రపంచంలో ఏ రోజూ ఏ దేశంలోనూ ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కాలేదు. విపత్తు ఈ స్థాయిలో విరుచుకుపడుతుంటే, ప్రాణవాయువుకోసం హాహాకారాలను, పడకలకోసం పడిగాపులనూ, బాధితుల ఆఖరిచూపుకోసం బంధువుల ఆర్తనాదాలనూ మనం వింటున్నాం, చూస్తున్నాం. చావు వాకిట్లోకొచ్చి తలుపు తడుతుంటే జనం భయంతో వణికిపోతున్నారు. ఈ దుస్థితికి కారకులెవరు? మొదటి దశ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోకపోగా, అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాలన్నీ అతి భయంకరమైన రెండో దశ ప్రమాదాన్ని చవిచూస్తున్న సంగతి నెలలుగా గమనిస్తూ కూడా, కనీస ముందస్తు చర్యలు చేపట్టని మోడీ సర్కార్ నిర్లిప్తతని ఏమనాలి? పైగా దీనికి పౌరుల బాధ్యతారాహిత్యమే కారణమని ఆరోపించడం న్యాయమేనా? అన్నిటికీ ప్రజలదే బాధ్యతైతే మరి ప్రభుత్వం ఎందుకు? అసలు రెండోదశ విరుచుకు పడితే పరిస్థితి ఎలా ఉంటుందన్న అంచనాలే లేకుండా, అంచనాలకు తగ్గ ప్రణాళికలు లేకుండా నేరం ప్రజలమీద మోపడమేనా సర్కారు సమర్థత? ఎంతసేపటికీ ఊకదంపుడు ఉపన్యాసాలూ, ప్రచార విన్యాసాలే తప్ప నిర్ధిష్టమైన చర్యలేవీ? అందుకే ఆక్సిజన్ కొరత మొదలు ఔషధాల పంపిణీ వరకూ ఈ ప్రభుత్వానికి ఓ విధానమంటూ ఉందా? అని సుప్రీంకోర్టు తనకు తానుగా కల్పించుకుని కేంద్రాన్ని ప్రశ్నించాల్సి వచ్చింది.
ప్రమాదం పొంచివుందని తెలిసికూడా ఆక్సిజన్ ఉత్పత్తికి ప్లాన్ చేయలేకపోయారు. తీరా అపాయం ముంచుకొచ్చాక కొత్త ప్లాంట్లకు అనుమతులిచ్చారు. దేశ జనాభాకు అవసరమయిన స్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తినీ చేపట్టలేకపోయారు. రోజూ లక్షల్లో నమోదవుతున్న కరోనా కేసులకు అవసరమైన పడకలు సిద్ధం చేయలేకపోయారు. ఔషధాల కొరతను నివారించలేకపోయారు. ఫార్మా మాఫియా మందులూ, వైద్యపరికరాల ధరలను విపరీతంగా పెంచడాన్ని నియంత్రించలేకపోయారు. విచ్చలవిడిగా సాగుతున్న ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీని అడ్డుకోలేకపోయారు. ఇలా ఏదీ తమ బాధ్యత కాదన్నట్టుగా కేంద్రం వ్యవహరించబట్టే నేడు స్మశానాల ముందు శవాలు బారులు తీరుతున్నాయి. సాక్షాత్తూ ప్రధాని నియోజకవర్గం వారణాసిలోనే శవాలను గుట్టలుగా పోసి తగులబెట్టాల్సిన దుస్థితి చోటుచేసుకుంది. 'దేశభక్తు'ల పాలనలో దేశపౌరులకు మరణంలో కూడా కనీస గౌరవం దక్కని దౌర్భాగ్యం దాపురించింది. అందుకే చివరికి కోర్టులు జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. ఈ ప్రభుత్వ వైఫల్యాలకు ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి?
ఈ విలయానికి ముందు ఈ ప్రభుత్వ పెద్దలూ, ఔషధ కంపెనీల అధినేతలూ ఏం చెప్పి మురిపించారు? ''130 కోట్లమంది భారతీయులకూ ఉచితంగా వ్యాక్సిన్ అందించే పూచీ నాది'' అనికదా! ప్రధాని అభయమిచ్చారు. వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరకే వ్యాక్సిన్ అందిస్తామని కదా భారత్ బయోటెక్ బాసచేసింది. అంతేనా, ''పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతతో సహా అందరికీ మే ఒకటి నుంచి వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నామహౌ'' అంటూ ఢంకా బజాయించారు. మరి ఇంతలోనే ఏమయిందో ఏమో! వ్యాక్సిన్ అందించే బాధ్యత తమది కాదని చేతులు దులిపేసుకుంది కేంద్ర ప్రభుత్వం. వ్యాక్సిన్ను ఎవరికీ ఉచితంగా ఇచ్చే ప్రసక్తేలేదంటూ, ఆ వ్యాక్సిన్ అందించే బాధ్యతను కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేస్తున్నామంటూ చావుకబురు చల్లగా చెప్పింది. అంతటితో ఆగకుండా ప్రయివేటుగా వ్యాక్సిన్ అమ్ముకునే స్వేచ్ఛను ఆయా కంపెనీలకు రాసిచ్చేసింది. సాయంకోసం ఎదురుచూస్తున్న బాధితుల్ని చావుకు వదేలేసి, మందుల కంపెనీల వ్యాపారాలకు దారులు తెరిచింది. ప్రజారోగ్యం ఎంతటి సంక్షోభంలో ఉన్నా ప్రయివేటుకు లాభాలు ప్రొదిచేయడమే ఈ ప్రభుత్వ ఇంగితమన్నది ఇప్పుడు కూడా గుర్తించకపోతే ఆ నేరం మాత్రం తమదికాదని ప్రభుత్వ పెద్దలు చెప్పకనే చెప్పేశారు! ఇక అర్థంచేసుకోవాల్సింది ప్రజలే...