Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూతాపం పెరగడం వల్ల వచ్చే విపత్తులను నివారించేందుకు ఉద్దేశించిన పారిస్ ఒప్పందం అమలుకు కృత నిశ్చయంతో ఉన్నట్టు నలభై దేశాల ప్రభుత్వాధినేతలు పునరుద్ఘాటించడం ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే, ఆచరణలో అవి ఎంతవరకు ఫలిస్తాయన్నదే ప్రశ్న. వాతావరణ మార్పులకు సంబంధించిన ఈ అంతర్జాతీయ ఒప్పందంపై అమెరికా ఎప్పుడూ నిలకడగా ఒక వైఖరికి కట్టుబడి లేదు. పారిస్ ఒప్పందం కుదిరి ఆరేండ్లు అయినా దీని అమలు దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడానికి కారణం అమెరికానే. ఐరాస ఆధ్వర్యంలో 2015లో పారిస్‌లో కుదిరిన ఈ ఒప్పందంపై ఒబామా సంతకం చేస్తే, ఆ తరువాత వచ్చిన ట్రంప్ దీనికి వీసమెత్తు విలువ కూడా ఇవ్వలేదు. ఇది వినాశకరమైన ఒప్పందమని, పోటీతత్వాన్ని చంపేస్తుందని, అమెరికాకు శాశ్వత గుదిబండగా మారుతుందంటూ ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగుతుందని ప్రకటించారు. ట్రంప్ తీసుకున్న ఈ ఏకపక్ష వైఖరి వల్ల వాతావరణ మార్పులపై ఐరాస కృషికి నాలుగేండ్ల పాటు తీవ్ర విఘాతమేర్పడింది. బైడెన్ అధికారంలోకి వచ్చీ రాగానే పారిస్ ఒప్పందంలో తిరిగి చేరుతున్నట్టు ప్రకటించారు. ధరిత్రీ దినోత్సవం రోజున చొరవ తీసుకుని వాతావరణ మార్పులపై నలభై దేశాల ప్రభుత్వాధినేతలతో ఈ వర్చువల్ శిఖరాగ్ర సమావేశానికి పూనుకున్నారు. 2005 స్థాయితో పోల్చితే 2030 నాటికి 52శాతం కర్బన ఉద్గారాలను అమెరికా తగ్గించుకుంటుందని బైడెన్ ఈ సదస్సులో ప్రకటించారు. అమెరికన్లలో 80శాతం మంది పారిస్ ఒప్పందానికి అనుకూలంగా ఉన్నట్టు ఓ సర్వేలో తేలింది. అమెరికన్ సెనేట్‌లో డెమొక్రట్లకు తగినంత మెజార్టీ ఉన్నందున బైడెన్ దీనిపై ముందుకెళ్లేందుకు ఎలాంటి అడ్డంకులు ఎదురు కావు. బైడెన్‌కు దీనిని అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఉందా అన్నదే ప్రశ్న. ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఐరాస చీఫ్ ఆంటోని గుటెరస్ సూచించినట్టు అన్ని దేశాల భాగస్వామ్యంతో 'నెట్ జీరో క్లైమేట్ కొయిలేషన్'ను ఏర్పాటు చేసి, కర్బన ఉద్గారాలను దశలవారీగా తగ్గించుకునేందుకు నిర్దిష్ట ప్రణాళికలను ఈ సందర్భంగానే ప్రకటించి ఉండాల్సింది. ఆ పని చేయకుండా ఇది నిర్ణయాత్మక దశాబ్ది, ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలపైనే ప్రపంచ భవిష్యత్తు ఆధారపడి ఉందంటూ ఊకదంపుడు ఉపన్యాసానికే పరిమితమయ్యారు. దేనికైనా ఆచరణే గీటురాయి. అమెరికా తన కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలంటే బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యామ్నాయంగా సౌర, పవన విద్యుత్‌కు మారడం, పారిశ్రామిక కాలుష్యాన్ని తగ్గించడం, అడవుల క్షీణతను అరికట్టేందుకు గట్టిచర్యలు చేపట్టాలి. పారిస్ ఒప్పందంలో పేర్కొన్న విధంగా పేద, వర్థమాన దేశాలకు కాలుష్య రహిత టెక్నాలజీని బేషరతుగా అందించడం, వర్థమాన దేశాల్లో ప్రత్యామ్నాయ ఇంధన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం, కాలుష్య భారాన్ని మోస్తున్న చిన్న పేద దేశాలకు ఉదారంగా నిధులు అందజేయడం వంటివి చేపట్టాలి. అందుకు పారిశ్రామిక దేశాలు చూపే నిబద్ధతపైనే ప్రపంచ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అమెరికా తరువాత అధిక కర్బన ఉద్గారాలను విడుదలజేసే యూరోపియన్ యూనియన్, చైనా, రష్యా, బ్రిటన్ తదితర దేశాలు పారిస్ ఒప్పందం నిర్దేశించినట్టుగా 2030 నాటికి 50శాతం, 2050 నాటికి జీరో స్థాయికి కర్బన ఉద్గారాలను తగ్గించుకుంటామని ప్రకటించాయి. కర్బన ఉద్గారాల్లో 40శాతానికిపైగా వాటా కలిగిన పారిశ్రామిక దేశాలు 'నెట్ జీరో ఎమిషన్' పట్ల నిబద్ధత చూపకుండా ఇతర దేశాలను నిందించడం సరికాదు. గ్రీన్ టెక్నాలజీ బదలాయింపు గురించి కానీ, పేద దేశాలకు ఆర్థిక సాయం అందించడం గురించి కానీ బైడెన్ ఎక్కడా ఒక్కముక్క కూడా ప్రస్తావించలేదు. అమెజాన్‌లో కార్చిచ్చువల్ల కోల్పోయిన విశాలమైన అటవీ ప్రాంతాన్ని తిరిగి పునరుద్ధరించాలని, మైనింగ్ పేరుతో విచ్చల విడిగా అడవులను నాశనం చేయడాన్ని అరికట్టాలని వైట్‌హౌస్ వెలుపల నినాదాలు హౌరెత్తాయి. వాటి గురించి మాట్లాడతారేమోనని ఆశించినవారికి నిరాశే మిగిలింది. వర్థమాన దేశాల తరపున గొంతు వినిపించాల్సిన భారత ప్రధాని మోడీ అమెరికాకు తందాన తాన అన్నట్టుగా వ్యవహరించారు. అమెరికాతో కలసి 'క్లీన్ ఎనర్జీ-2030' ప్రాజెక్టు ప్రారంభించడమే ఘనకార్యమన్నట్టు మాట్లాడారు. పారిశ్రామిక దేశాలు మరీ ముఖ్యంగా అమెరికా పూచీ పడనంతకాలం వాతావరణ మార్పులను దీటుగా ఎదుర్కోవడం సాధ్యం కాదు. ఈ విషయంలో అన్ని దేశాలను కలుపుకుని ముందుకు సాగాల్సిన బాధ్యత ఐరాస పైనే ఉంది. గ్లాస్గో సదస్సులోనైనా అందుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించడం అవసరం.