Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలస్తీనా అంటే నిత్య యుద్ధం.. కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. మందుగుండు వాసన. పాలస్తీనా అంటే నిత్యం ఖైదు, ముగింపు కనపడని హింస. పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతున్నది. 28మంది పాలస్తీనియన్లు మృత్యవాతపడ్డారు. జెరూసలేంలో ఈ దారుణ హింస జరిగింది. ఇజ్రాయిల్ ఆక్రమించుకున్న తూర్పు ప్రాంతంలో నివాసముంటున్న పాలస్తీనియన్లను బలవంతంగా ఖాళీ చేయించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అల్ అక్సా మసీదు ఆవరణపై ఇజ్రాయిల్ పోలీసులు విరుచుకుపడ్డారు. స్టన్ గ్రెనెడ్లు, బాష్పవాయు గోళాలు, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. చనిపోయిన వారిలో మహిళలు పిల్లలు కూడా ఉన్నారు.
యూదుల నివాస ప్రాంతాలకు మార్గం కల్పించేందుకు పాలస్తీనియన్లపై దాడులు చేసింది. తద్వారా తూర్పు జెరూసలేంను పూర్తిగా ఆక్రమించే దిశగా ఇజ్రాయిల్ అడుగులు వేస్తోంది. ముస్లింలకు మూడో పవిత్ర ప్రాంతమైన అల్‌అక్సా మసీదు ఆవరణపై ఇజ్రాయిల్ బలగాలు దాడిచేశాయి. రంజాన్ మాసంలో మసీదు లోపల ప్రార్థనలు చేసుకుంటున్న వందలాది మంది ముస్లింలు గాయపడ్డారు.
ఆ దేశ అధ్యక్షుడు నెతన్యాహు తన సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ దాడులకు పాల్పడుతున్నాడు. ఇజ్రాయిల్ ఎన్నికలలో మెజారిటీ సాధించడంలో నెతన్యాహు పదేపదే విఫలమవుతున్నాడు. కోవిడ్ మహమ్మారి నుంచి ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈ తరహా చర్యలకు దిగుతున్నాడు. పాలస్తీనీయ్లకు వ్యాక్సిన్లు కూడా అందడం లేదు. అతని వర్ణవివక్ష విధానాలు బట్టబయలు అవుతున్నాయి.
రంజాన్ మాసం ప్రారంభం నుంచే ఇజ్రాయిల్ జెరూసలేం ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వాటిని నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. తూర్పు జెరూసలంలో ప్రతి ఏటా జెరూసలేంను ఆక్రమించుకున్న విజయోత్సవాన్ని జెరూసలేం దినోత్సవంగా జరుపుకుంటారు. ఆరోజును జెండాలతో ఊరేగింపు నిర్వహిస్తారు, మితవాద యూదు యువకుల వల్ల హింసచెలరేగుతుంటుంది. ముస్లింల నివాస ప్రాంతాల గుండా సాగడమే దానికి కారణం. ఊరేగింపునకు అనుమతి ఇవ్వాల్సినది కాదు. అయినా ఉద్దేశపూర్వకంగానే ఇజ్రాయిల్ అధికారులు అనుమతించి హింసాకాండను ప్రోత్సహించారని అర్థం అవుతున్నది.
జెరూసలేం అనేది ఇజ్రాయిల్ - పాలస్తీనా ఘర్షణలో కీలకమైన ప్రాంతం. ఇజ్రాయిల్ ఈ పట్టణంలోని పడమర ప్రాంతాన్ని 1948లో తూర్పు భాగాన్ని 1967లో ఆరు రోజుల యుద్ధంలో వశపర్చు కున్నది. తద్వారా పూర్తి నగరంపై తన సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకున్నది.
జెరూసలేంపై ఇజ్రాయిల్ ఆధిపత్యాన్ని చాలా దేశాలు అంగీకరించడం లేదు. ఇజ్రాయిల్ యుద్ధ వాతావరణాన్ని రావణకాష్టంలా ఉంచి పాలస్తీనీయన్లపై హింసను కొనసాగించాలని చూస్తున్నది. ట్రంప్ హయాంలో అందిన అండతో ఇజ్రాయిల్ తన ఆధీనంలోని భూభాగాన్ని విస్తరించుకున్నది. తన స్వాధీనంలోని ప్రాంతాలలో పాలస్తీనీయన్లపై దౌర్జన్యాన్ని పెంచింది. నగరంలోని తూర్పు ప్రాంతంలో 2,20,000 మంది యూదులు నివాసం ఉంటారు. అక్కడ నుంచి పాలస్తీనీయన్లను బలవంతంగా తరిమివేసి యూదుల నివాస ప్రాంతాలను పెంచుకోవాలనే ప్రయత్నంలో భాగమే ఈ హింస.
శాంతి ప్రక్రియ చురుకుగా సాగడం లేదు. జరుగుతున్న పరిణామాలను వివిధ దేశాలు ఖండిస్తున్నా.. ఇజ్రాయిల్ ధోరణిలో మార్పు మాత్రం కనబడటం లేదు. మరింత పెచ్చరిల్లిపోతున్నది. పాలస్తీనీయన్లను కనీసం మనుషులుగా కూడా గుర్తించే పరిస్థితి లేదు. అంతర్జాతీయ సమాజం విమర్శిస్తుంటే ఆ దేశ ప్రధాని నెతన్యూ హూ ఎదురుదాడి చేస్తూ దాన్ని ఒక శాంతిభద్రతల సమస్య మాత్రమే అని అంటున్నారు. అందరికీ పవిత్రమాసంలో ప్రార్థనలకు స్వేచ్ఛ ఉండాలని ప్రభోదిస్తున్నాడు. అందుకే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని తన చర్యలను సమర్థించు కుంటున్నాడు. దాడి జరిగిన రోజు మసీద్‌లో 400మంది పాలస్తీనీయన్లు ప్రార్థనలు చేస్తుంటే, బయట రోడ్డుపై ఉన్న ఇజ్రాయిలీ యూదులపై మసీద్‌లో ఉన్నవారే రాళ్ళు విసిరారని తప్పుడు ప్రచారం జరుగుతున్నది. అందుకే నెతన్యాహు ప్రార్థనలు చేసే స్వేచ్ఛ అందరికీ ఉండాలని అంటున్నారు. కానీ పాలస్తీ నీయనులకు బతికే స్వేచ్ఛ మాత్రం ఉండకూడదా అనేది కీలక ప్రశ్న.
ఇక్కడో కీలకాశం మరువరాదు. మధ్య ఆసియా ప్రాంతంలో అమెరికా ప్రయోజనాల రక్షణ కోసం 2వ ప్రపంచ యుద్ధనంతరం ఇజ్రాయిల్ ఏర్పాటు చేయబడింది. అప్పటినుంచి 2,3 తరాలు యుద్ధంలోనే పుట్టి యుద్ధంలోనే చనిపోతున్నారు. మొదటి నుంచీ ఉన్న రాజధాని టెల్ అవీవ్ కాక జెరూసెలేంను ఇజ్రాయిల్ రాజధానిగా గుర్తిస్తున్నట్టు ట్రంప్ సర్కార్ ప్రకటనతో అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. ఈ నేపథ్యంలో బైడెన్ ప్రభుత్వానికి స్పష్టమైన స్టాండ్ లేకపోవడం నెతన్యాహు వంటి వారిని రెచ్చిపోయేలా చేసింది.
యాసర్ అరాఫత్ నాయకత్వంలో వీరోచిత పోరాటం జరిగి మూడు ఒప్పందాలు కూడా జరిగి పాలస్తీనీయన్లు నివాసం ఉన్న ప్రాంతాలకు సార్వభౌమత్వం లభించి, స్వయంపాలన ఏర్పడింది. ఐక్యరాజ్యసమితిలో గుర్తింపు వచ్చింది. గత స్ఫూర్తితో పాలస్తీనీయన్ల పోరాడటమే వారి ముందున్న మార్గం. ఇజ్రాయిల్ చర్యలు మానవహక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి ఆమోదించిన పలు తీర్మానాలకు విరుద్ధంగా ఇజ్రాయిల్ వ్యవహరిస్తున్నది. ఇజ్రాయిల్ చర్యలను ఖండించాలి. పాలస్తీనా ప్రజలకు మన సంపూర్ణ మద్దతును ఇవ్వాలి.