Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దాదాపు 15 జిల్లాల్లో అకాల వర్షాలకు ధాన్యం దెబ్బతిన్నది. కొన్ని జిల్లాల్లో మామిడి తోటలు, మిర్చి, మొక్కజొన్న పంట కూడా వానలకు వేలాది ఎకరాల్లో తడిసింది. సర్కారు తాజా పంటల నష్టం వివరాలను లెక్కతీస్తున్న దాఖలాలు లేవు. అహర్నిశలు కష్టపడి చేసినా, ప్రకృతివైపరీత్యాలతో కొంత నష్టం జరుగుతుంటే, సర్కారీ జాప్యం రైతులను మరింత కుంగదీస్తున్నది. నష్టాల పాల్జేస్తున్నది. అన్ని పంటలకు కనీసమద్దతు ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిందీ సర్కారేననే సంగతిని గుర్తించాలి.
రైతే రాజు అంటుంటాం. కానీ, అతను ఎప్పుడూ దెబ్బతింటూనే ఉంటాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్లోకి తెస్తే అక్కడా దోపిడీ. నాటి మహాభారతంలో కర్ణుడి చావుకున్నన్ని కారణాలు నేటి భారతంలో రైతుకూ ఉన్నాయి. అంతా బావుంది ..ఇక మార్కెట్‌కు తీసుకుపోదాం అనుకున్నంతలోనే ఏదో ఒక పిడుగు మీద పడుతోంది. సమాజానికి పట్టెడన్నం పెట్టే రైతన్న కష్టాలను తీర్చడంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు చాలా స్వల్పం. రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఆశించినస్థాయిలో లేవు. వేగం అసలే లేదు. సర్కారు అత్తెసరు కొనుగోళ్లే ఇప్పుడు రైతుల కొంప ముంచాయి. అకాలవర్షాలకు మార్కెట్లోకి వచ్చిన పంట సైతం నీటమునిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి ధాన్యం కోనుగోళ్ల కోసం నెల క్రితం హడావుడి చేశారు. సమీక్షల మీద సమీక్షలు చేశారు. జోరుగా పత్రికా ప్రకటనలూ గుప్పించారు. కనీస మద్ధతు ధర రూ. 1888ని కచ్చితంగా అమలుచేయాలంటూ హుంకరించారు. అయినా ధాన్యం కోనుగోళ్లు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కిలా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3650 కేందాలు ప్రారంభిస్తామని చెప్పిన గులాబీ సర్కారు, అందులో సగం కూడా చేపట్టలేదనే విమర్శలను మూటకట్టుకున్నది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సింది పోయి, మీనమేషాలు లెక్కిస్తుండటం ఆందోళనకరం. కేంద్రం వద్దన్నా మనరాష్ట్రంలో ధాన్యం సేకరణ చేస్తామని బల్లగుద్ది మరీ చెప్పిన కేసీఆర్ సర్కార్, చివరికి రైతులను మోసం చేస్తోందా ? యాసంగి కొనుగోళ్లు చూస్తే సందేహం రాకమానదు!
ధాన్యం కొనుగోళ్లపై తొలుత సర్కారు ఆర్భాటమే చేసింది. వీటి కోసం బ్యాంకులకు రూ. 20 వేల కోట్ల మేరకు గ్యారంటీ ఇచ్చింది. అయినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నత్తను తలపిస్తున్నాయి. ఈలోపు అకాల వర్షాలు రానేవచ్చాయి. రైతుల చెమట కష్టాన్ని కబళించాయి. రాష్ట్రంలో 52 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేశారు. దాదాపు 1.40 కోట్ల టన్నుల ఉత్పత్తి అవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ ఏడాది ఆ లెక్క ఇంకా తేలనప్పటికీ అకాల వర్షాలు మాత్రం రైతన్నలకు అరిగోస చూపిస్తున్నాయి. ఇందులో రైతుల నిస్సహాయత ఒకవైపైతే, సర్కారు అలక్ష్యం మరోవైపు. ఈ సమయానికి దాదాపు కోటి టన్నుల ధాన్యాన్ని కోనుగోలు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 25 లక్షల టన్నులకే పరిమితమవడం రైతులకు అన్యాయం చేయడమే. ఆదిలోనే హంసపాదులా ప్రభుత్వం సుమారు 15 నుంచి 20 రోజుల ఆలస్యంగా ధాన్యం కోనుగోళ్లకు శ్రీకారం చుట్టింది. పౌరసరఫరాల శాఖ పర్యవేక్షణలో ఐకేపీ, సహకార సంస్థలు కొనుగోళ్లు చేస్తున్నాయి. లాక్డౌన్ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలకు మినహాయింపు ఇచ్చినా, రైతులకు తిప్పలు తప్పడం లేదు. అలాగే గోనే సంచుల కొరతా మళ్లీ వేధిస్తున్నది.
ఇది ఎప్పుడూ ఉండే సమస్యే కదా అనుకుంటే త(ప)ప్పులో కాలేసినట్టే. కొనుగోళ్ల సీజన్‌కు ముందే ఏర్పాట్లు చేసుకోవడంలో వ్యవసాయ శాఖ వెనుకబడింది. ప్రతియేటా ఇదో తంతులా మారుతున్నది. సర్కారు మాత్రం చేతులు ముడుచుకు కూర్చున్నది. ఇదిలావుంటే కొనుగోళ్లల్లోనూ తమాషాలు చోటుచేసుకుంటున్నాయి. తరుగు, తేమ పేర క్వింటాల్ ధాన్యంలో 10 నుంచి 12 కిలోలు రైతుల నుంచి అక్రమంగా లాక్కుంటున్నారు. దీన్ని తక్షణం ఆపాల్సిందే. ఇకపోతే సాధ్యమైనంత తొందరగా కొనుగోళ్లు పూర్తిచేయాలి. నెల రోజుల క్రితం మార్కెట్లోకి తెచ్చిన ధాన్యం ఇంకా ఖరీదు చేయకపోవడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా నకిరేకల్ మార్కెట్‌యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. కోనుగోలు చేసిన ధాన్యానికి వారంలోపే బిల్లులు చెల్లించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కోనుగోళ్లల్లో ఆలస్యమే భారీ నష్టానికి కారణం. అంతేగాక ప్రస్తుతమున్న మార్కెట్ కమిటీలు వ్యాపారుల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయి. రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఈనేపథ్యంలో రైతులు, వ్యాపారులు, మార్కెట్ అధికారులతో ప్రత్యేక కమిటీలు వేసి, ఆ కమిటీలతో కొనుగోలు చేయించాలనే డిమాండ్ రైతు సంఘాల నుంచి వస్తున్నది. దాదాపు 15 జిల్లాల్లో అకాల వర్షాలకు ధాన్యం దెబ్బతిన్నది. కొన్ని జిల్లాల్లో మామిడి తోటలు, మిర్చి, మొక్కజొన్న పంట కూడా వానలకు వేలాది ఎకరాల్లో తడిసింది. సర్కారు తాజా పంటల నష్టం వివరాలను లెక్కతీస్తున్న దాఖలాలు లేవు. అహర్నిశలు కష్టపడి చేసినా, ప్రకృతివైపరీత్యాలతో కొంత నష్టం జరుగుతుంటే, సర్కారీ జాప్యం రైతులను మరింత కుంగదీస్తున్నది. నష్టాల పాల్జేస్తున్నది. అన్ని పంటలకు కనీసమద్దతు ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిందీ సర్కారేననే సంగతిని గుర్తించాలి.