Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ''కనిపించడంలేదు
- పేరు: భారత ప్రభుత్వం
- వయస్సు: 7సంవత్సరాలు
తెలిపినవారు: భారత పౌరులు''... ప్రఖ్యాత ఇంగ్లీషు వారపత్రిక ''అవుట్‌లుక్'' ప్రచురించిన ఈ వారం ముఖచిత్ర కథనమిది. ఏ ప్రభుత్వానికైనా ఇంతకు మించిన అభిశంసన ఏముంటుంది? ఇప్పటికే అంతర్జాతీయ మీడియా మోడీ సర్కారు అసమర్థతను ''వేనోళ్ల కొనియాడుతుండ''గా ఇప్పుడీ అవుట్‌లుక్ కవర్‌స్టోరీ ఆ వాస్తవాన్ని మరింత ఎత్తి చూపుతోంది. ఈ పూర్వరంగంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్‌భగవత్ తాజా వ్యాఖ్యలు ఇంతకు మించిన ఆసక్తినీ, ఆశ్చర్యాన్నీ, ఆలోచనలనూ రేకిత్తిస్తున్నాయి. ''ప్రజలు, ప్రభుత్వాలు, పాలనా యంత్రాంగం నిర్లక్ష్య ఫలితమే నేటి ఆరోగ్య సంక్షోభం'' అని సెలవిస్తున్నారాయన. ఆయన నిజమే చెప్పినట్టు అనిపిస్తోంది కదా. అవును, ఆయన అబద్దమేమీ చెప్పలేదు! కాకపోతే....
''వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్
గనికల్ల నిజం దెలసిన మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!'' అంటూ మన సుమతీశతక కర్త బద్దెన చెప్పినట్టు తరచి చూస్తేగానీ ఈ మాటల వెనుక తత్వం బోధపడదు. కొంచెం లోతుగా పరిశీలిస్తే ఆయన తెలివిగా ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరిస్తూనే మరోవైపు నేరం ప్రజలపై మోపుతున్నారా? ప్రభుత్వ పెద్దలకు ముఖం చెల్లని వేళ, దిగజారుతున్న సర్కారు ప్రతిష్టను నిలువరించడానికి ప్రయత్నిస్తున్నారా? అని అనిపించక మానదు.
సంఫ్ుచీఫ్ ప్రజల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపడాన్ని తప్పుపట్టలేం కానీ, ఆ నిర్లక్ష్యానికి కారణాల్ని, కారకుల్నీ విస్మరించడమే అక్షేపణీయం. ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఎవరిది? కరోనా ఫస్ట్ వేవ్ కాస్త మందగించగానే, జనవరిలో ప్రధానమంత్రి విజయఢంకా మోగించారు. కరోనాపై భారత్ విజయం సాధించిందని ప్రకటించారు. భారతదేశం పెద్దఎత్తున వ్యాక్సిన్లను తయారుచేయబోతున్నదనీ, ప్రపంచ దేశాలను కూడా మా వ్యాక్సిన్లతో ఆదుకుంటామని గొప్పలు పోయారు. ఆ వెంటనే ఫిబ్రవరిలో అధికార పార్టీ జాతీయ కార్యవర్గం కూడా కరోనాపై విజయానికి మోడీ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఏకంగా తీర్మానమే చేసింది. మార్చి మొదటివారంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ''ఢిల్లీ మెడికల్ అసోసియేషన్''ను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో కరోనా కాలం ముగిసిపోయిందని ప్రకటించేశారు. సీసీఎంబీ, ఐసీఎంఆర్ లాంటి అత్యున్నత సంస్థలనుంచీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచీ ప్రధానికీ, కేంద్ర ప్రభుత్వానికీ సెకెండ్ వేవ్ ప్రమాదం పొంచివుందన్న ముందస్తు హెచ్చకరికలూ, స్సష్టమైన సంకేతాలూ ఉన్నప్పటికీ పెడచెవిన పెట్టారు. ప్రమాదకరమైన కరోనా సెకెండ్ వేవ్‌ను ఎదర్కోవడానికి ఎటువంటి సన్నాహాలు చేయకపోగా, రాష్ట్రాలనూ అప్రమత్తం చేయలేకపోయారు. పైపెచ్చు, ఐదు రాష్ట్రాల ఎన్నికలను గెలుచుకోవాలని తహతహలాడారు. మూతికి మాస్కులు, చేతికి సానిటైజర్లు, భౌతికదూరాలనే కనీస జాగ్రత్తలు మరిచి భారీ ర్యాలీలు, బహిరంగసభలకు తెగబడ్డారు. హాజరవుతున్న భారీ జనసమూహాలను చూసి మురిసిపోయారు. వచ్చేయేడు జరిగే యూపీ ఎన్నికలను ప్రభావితం చేయడం కోసం యేడాది తరువాత జరగాల్సిన కుంభమేళాకు ఈ యేడాదే తెరతీసారు. ఈ రెండు సందర్భాలూ సెకండ్ వేవ్‌కు కావల్సినంత ఆజ్యం పోశాయి.
ప్రజలకు మార్గదర్శకం చేయాల్సిన ప్రభుత్వ పెద్దలే ఈ తీరున వ్యవహరిస్తే ప్రజలను ఎలా తప్పు పట్టగలం. సంఫ్‌ు నేత ఈ వాస్తవాలన్నీ విస్మరించి గుర్రాన్నీ గాడిదను ఒకే గాటిన కట్టినట్టుగా ప్రజలనూ ప్రభుత్వాన్నీ ఒకేగాటిన కట్టి విమర్శించడంలోని ఆంతర్యమేమిటి? ఇది నేరం ప్రజలపై మోపి ప్రభుత్వ వైఫల్యాలను తక్కువ చేసి చూపడం కాదా?! పొరపాట్లను గుర్తించడానికే భయపడేవారు వాటిని ఎలా సరిచేసుకుంటారూ, ఈ విపత్తును ఎలా ఎదుర్కొంటారూ? ఇప్పటికే ఏలినవారి చేతగానితనానికీ, రాజకీయ స్వార్థానికీ దేశం ప్రపంచం ముందు నవ్వులపాలవుతోంది. వారి అధికార దాహానికీ, అసమర్థ చర్యలకూ ఆరోగ్యవ్యవస్థ కుప్పకూలిపోయింది. ఊపిరి అందని దశలో ఆసుపత్రిలో చోటు దొరకక, ఊపిరి ఆగిపోయాక స్మశానాల్లో చోటు దొరకక ప్రజా జీవితం తీరని దు:ఖంలో మునిగివున్నది. ఇందుకు కారకులు ఏలికలు మాత్రమేనన్న సంగతి సంఫ్‌ు నేతకు తెలియదనుకోగలమా?!
పోనీ ఈ తప్పిదాలన్నింటినీ వదిలేసినా, ఇప్పుడు తక్షణ కర్తవ్యంగా మారిన సార్వత్రిక వ్యాక్సినేషన్ విషయంలోనూ, ఆక్సిజన్ సరఫరాలోనూ, ప్రజలకు వైద్యం అందుబాటులోకి తేవడంలోనూ కేంద్ర ప్రభుత్వ వైఖరిలో పారదర్శకత ఏదీ? వారి చిత్రవిచిత్రమైన నిర్ణయాలు, విధానాల మార్పులు ప్రజలను గందరగోళ పరుస్తున్నాయి. ప్రజా ప్రయోజనాలకంటే కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంటే ప్రజలు తమ ప్రాణాలను మూల్యంగా చెల్లిస్తున్నారు. ఇప్పుడు అంతటా శవాలు కాలుతున్న కమురు వాసనే. క్రమేపీ వాతావరణంలో ఆమ్లజని మందగిస్తుండగా ఆ స్థానాన్ని ఆందోళన ఆక్రమిస్తున్నది. దేశం ఇంతటి విషాదంలో ఉండగా ప్రధాని సహా ప్రభుత్వపెద్దలంతా మౌనవ్రతంలో ఉండటం ప్రభుత్వం ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నది. కాబట్టే 'అవుట్ లుక్' ఆ విధంగా ముఖచిత్రాన్ని ప్రచురించాల్సి వచ్చింది. కానీ ఈ నష్టాన్ని వీలయినమేరకు నివారించడానికే సంఫ్ునేత ప్రజలను నిందించాల్సివచ్చిందా...? లుకౌట్..!