Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతర్జాతీయ సమాజం హెచ్చరికలను బేఖాతరు చేస్తూ గాజాపై ఇజ్రాయిల్ సాగిస్తున్న ఆటవిక దాడులు ఇరవైఒకటో శతాబ్దంలో మానవ నాగరికతను అపహాస్యం చేసేలా ఉన్నాయి. ఇజ్రాయిల్ ఈ నెల 7 నుంచి ప్రారంభించిన ఈ దాడుల్లో ఇప్పటివరకు 212 మంది పాలస్తీనీయులు చనిపోయారు. వీరిలో 58మంది పిల్లలు, 34మంది మహిళలు ఉన్నారు. మరో 1200 మందికిపైగా గాయపడ్డారు. రెండు వేల మంది పాలస్తీనీయులను ఊచకోత కోసిన 2014 నాటి దాడుల తరువాత ఇజ్రాయిల్ సాగిస్తున్న అత్యంత క్రూరమైన దాడి ఇది. గాజాను నాశనం చేయడమే నెతన్యాహు లక్ష్యంగా పెట్టుకున్నారు. రంజాన్ మాసం చివరి వారంలో జెరూసలెంలోని షేక్‌జరా నుంచి పాలస్తీనీయుల కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయించడంతో దాడులు మొదలయ్యాయి. కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్యసమితితో సహా పలు ప్రపంచ సంస్థలు, దేశాలు చేసిన విజ్ఞప్తులను, నిరసనలను ఏమాత్రం పట్టించుకోకుండా రక్త పిపాసి నెతన్యాహు గాజాలో నెత్తుటేరులు పారిస్తున్నాడు. ఐరాస ఒప్పందాలను, అంతర్జాతీయ చట్టాలను, న్యాయ నియమాలను అన్నిటిని తుంగలో తొక్కి యథేచ్ఛగా పేట్రేగిపోతున్నాడు. నెతన్యాహు ఇంతగా రెచ్చిపోవడానికి అమెరికాయే కారణం. చైనా అధ్యక్షతన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆదివారం అత్యవసర సమావేశం జరిపి ఇజ్రాయిల్‌ను హెచ్చరిస్తూ ఒక ప్రకటన చేయాలని ప్రతిపాదిస్తే దాదాపు అన్ని దేశాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. అమెరికా అడ్డుకోవడంతో ఆ యత్నం విఫలమైంది. గాజాపై నిప్పుల వాన కురుస్తుంటే, దానిని ఖండించలేని దుస్థితిలో ఐక్యరాజ్యసమితి మౌనంగా ఉండిపోవడానికి అగ్రరాజ్య నీతిబాహ్య విధానాలే కారణం.
మానవ హక్కులు గురించి, ప్రజాస్వామ్యం గురించి ప్రపంచానికి సుద్దులు చెప్పే అమెరికా పశ్చిమాసియాలో చేస్తున్నదేమిటి? మానవ హక్కులను బాహాటంగా కాలరాస్తున్న ఇజ్రాయిల్‌కు బాహాటంగా మద్దతు పలుకుతున్నది. అధునాతన ఆయుధాలను ఇజ్రాయిల్ సమకూర్చుకోవడానికి వందలాది కోట్ల డాలర్ల ఆర్థిక సాయం అందిస్తున్నది. గాజాలో రక్తపాతాన్ని ఆపాలని ఇస్లామిక్ దేశాల కూటమి (ఒఐసి), యూరోపియన్ యూనియన్‌లోని తన మిత్ర దేశాలు డిమాండ్ చేస్తున్నా అమెరికా వైఖరిలో మార్పులేదు. చివరికి సొంత పార్టీకి చెందిన కొందరు డెమొక్రాట్లు సైతం గళం విప్పాల్సివచ్చింది. గాజాలో ఊచకోతకు ట్రంప్ విష బీజాలు వేస్తే, బైడెన్ దాని నుంచి విడగొట్టుకోవడానికి బదులు వాటినే కొనసాగిస్తున్నారు.
పాలస్తీనా సమస్యపై భారత ప్రతినిధి ఐరాస భద్రతా మండలిలో ఆదివారంనాడు చేసిన ప్రకటన దీర్ఘకాలంగా మనం అనుసరిస్తూ వస్తున్న వైఖరిని నీరుగార్చేలా ఉన్నది. ఐరాసలో భారత్ శాశ్విత ప్రతినిధి టి.ఎస్. త్రిమూర్తి ఒక ప్రకటన చేస్తూ, పాలస్తీనా సమస్యకు తమ గట్టి మద్దతు ఉంటుందని అంటూనే గాజాపై జరిగిన దాడిని సూటిగా ఖండించకుండా దాటవేశారు. వారం రోజుల క్రితం జెరూసలెంలో అల్ అక్సా మసీదుపై ఇజ్రాయిల్ దళాలు దాడి చేసిన తరువాతే హమాస్ టెల్ అవీవ్ పై రాకెట్ దాడులు చేసింది. అసలు ఈ ఘర్షణలకంతటికీ మూలం మసీదుపై దాడి. కీలకమైన ఈ అంశాన్ని వదిలిపెట్టి హమాస్ రాకెట్ల దాడి గురించి మాత్రమే భారత ప్రతినిధి మాట్లాడడంలో ఔచిత్యమేమిటి? రెండు దేశాల ఏర్పాటులో కీలకమైనది తూర్పు జెరూసలెం రాజధానిగా స్వతంత్ర పాలస్తీనా ఆవిర్భావం. తూర్పు జెరూసలెం గురించి ప్రస్తావన లేకుండా భారత్ ప్రతినిధి ప్రసంగం సాగిపోయింది. 2017 వరకు భారత్ కొనసాగిస్తూ వచ్చిన వైఖరి నుంచి మోడీ ప్రభుత్వం పక్కకు మళ్లుతున్నదనడానికి ఇదొక సంకేతం. 2013లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఐరాసలో ఒక ప్రకటన చేస్తూ, తూర్పు జెరూసలెం రాజధానిగా సార్వభౌమత్వం, స్వతంత్రత, సుస్థిర, ఐక్య పాలస్తీనా ఏర్పాటుకు చర్చల ద్వారా కృషి చేయాలని ఉద్ఘాటించారు. దీనినే 2015 అక్టోబరులో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పునరుద్ఘాటించారు. 2017లో పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ భారత్ పర్యటనకు వచ్చినప్పుడు మోడీ ఒక ప్రకటన చేస్తూ సార్వభౌమాధికార, స్వతంత్ర, సుస్థిర పాలస్తీనా ఏర్పాటు కావాలని, ఇజ్రాయిల్‌తో శాంతియుతంగా అది సహజీవనం సాగించాలని భారత్ ఆశిస్తున్నదని అన్నారు. భవిష్యత్తులో ఏర్పడే పాలస్తీనాకు 'తూర్పు జెరూసలెం రాజధాని' అన్న ప్రస్తావనను ఆయన ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారు. 2018లో ఇజ్రాయిల్‌లో పర్యటించిన మోడీ అక్కడ కూడా ఇదే వైఖరిని పునరుద్ఘాటించారు. పాలస్తీనా పట్ల భారత్ వైఖరిని నీరుగార్చే ఎలాంటి యత్నమైనా అంతర్జాతీయంగా భారత దేశ ప్రతిష్టను అది దెబ్బతీస్తుంది. 1967కి ముందున్న సరిహద్దులతో తూర్పు జెరూసలెం రాజధానిగా పాలస్తీనా ఏర్పాటు చేయాలన్నదానికి భారత్ కట్టుబడి ఉండాలి. పాలస్తీనీయులపై ఇజ్రాయిల్ సాగిస్తున్న అత్యంత క్రూరమైన దాడులపై ప్రజాస్వామ్యవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు, మేథావులు, కళాకారులు అందరూ బిగ్గరగా గొంతెత్తాలి.