Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తౌక్టే' తుఫాను పశ్చిమ తీరంలో పెను విలయం సృష్టించింది. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, గోవా రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. కేంద్ర పాలిత ప్రాంతం డామన్ డయ్యూలోనూ భారీ నష్టం సంభవించింది. ముంబాయి హై ప్రాంతంలో ఓఎన్జీసీ చమురుక్షేత్రం వద్ద లంగరు ఊడిపోయి సముద్రంలో కొట్టుకుపోయిన నౌకల్లో కనీసం 49మంది దుర్మరణం పాలవ్వగా మరో 27మంది గల్లంతవ్వడం అత్యంత విషాదకరం. యుద్ధ నౌకలను రంగంలోకి దింపి సహాయ చర్యలు చేపట్టడం వల్ల పి-305 నౌకలోని 261 మందిలో 188మందిని రక్షించగలిగినా ప్రాణ నష్టం అధికంగానే ఉంది. గుజరాత్లో 53మంది, కర్నాటకలో నలుగురు, మహారాష్ట్రలో 17మంది, గోవాలో ఇద్దరు మరణించారు. సమర్థవంతమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం వల్ల కేరళలో ప్రాణ నష్టాన్ని నివారించగలిగినా ఆస్తి నష్టం సంభవించింది. ఈ తుఫాను వల్ల మరణించినవారి కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడినవారికి రూ.50వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించింది. ఇవి అన్ని రాష్ట్రాలకూ వర్తింపజేయగా తక్షణ సాయంగా గుజరాత్‌కు మాత్రమే వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ప్రకటించడం పక్షపాతానికి పరాకాష్టగా పేర్కొనవచ్చు.
సౌరాష్ట్ర ప్రాంతంలో సోమనాథ్ జిల్లా ఉనా వద్ద తీరం దాటిన తౌక్టే తుఫాన్ ధాటికి అంతకు ముందు నాలుగు రోజులపాటు పశ్చిమతీరంలోని రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోయాయి. చాలా చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. ఈదురుగాలుల ధాటికి లంగరు వేసిన నౌకలు కొట్టుకుపోవడం పెను విషాదానికి కారణమైంది. దేశ వాణిజ్య రాజధాని ముంబయి నగరం లోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కొన్ని గంటలపాటు మూసేశారు. కేరళపై తీవ్ర ప్రభావం చూపింది. అనేక ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తీర ప్రాంత ప్రజలను తరలించడంవల్ల ప్రాణనష్టం నివారించగలిగారు. తౌక్టే ప్రభావిత రాష్ట్రాల్లో ప్రజల తరలింపు, సహాయ చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్ర ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా కృషి చేశాయి. అయితే, ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిన గుజరాత్లో ముందు జాగ్రత్త చర్యలు సమర్థవంతంగా చేపట్టారా లేదా అన్నది ఒక ప్రశ్నగానే ఉంది. లంగరు వేసిన నౌకలు కొట్టుకుపోయిన దుర్ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలి. ఇటువంటి నౌకలకు లంగరు వేసే సందర్భంలో చేపట్టవలసిన రక్షణ చర్యల విషయంలో పాటించవలసిన ప్రమాణాలు అమలు చేశారా? లేదా? అందులో ఒఎన్‌జిసి పాత్ర ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు నిశితమైన దర్యాప్తు ద్వారానే సమాధానం దొరుకుతుంది.
గుజరాత్, డామన్, డయ్యూల్లోని ప్రాంతాలను బుధవారంనాడు ప్రత్యేక విమానంలో నుంచి పరిశీలించిన ప్రధాని గుజరాత్‌కు మాత్రమే తక్షణ సాయంగా వెయ్యి కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించి మిగిలిన రాష్ట్రాలను విస్మరించడం దారుణం. ఈ పెను తుఫాను తాకిడికి గురైన ఇతర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నివేదికలు వచ్చాకనే వాటికి సహాయం అందిస్తామని చెప్పడం వారి వివక్షకు తార్మాణం. మోడీ భారత దేశానికి ప్రధాన మంత్రా? లేక గుజరాత్ రాష్ట్రానికా? అన్న ప్రశ్న ప్రజల మెదళ్లు తొలిచేస్తోంది! తౌక్టే బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన మహారాష్ట్రలో ప్రధాని ఎందుకు ఏరియల్ సర్వే చేయలేదని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ప్రశ్నించడం సబబే కదా! తమ ప్రభుత్వమున్న గుజరాత్లో మాత్రమే సందర్శించి, పొరుగునే ఉన్న మహారాష్ట్రలో పర్యటించకపోవడం, తీవ్రంగా నష్టపోయిన కేరళను పట్టించుకోకపోవడం వివక్ష కాదా అన్న ప్రశ్నకు కమలనాథులేం సమాధానం చెబుతారు? గత ఏడాది తుఫాను నష్టం జరిగినప్పుడు కూడా కర్నాటకకు సహాయం చేసిన కేంద్రం కేరళకు మొండి చెయ్యి చూపిన విషయం తెలిసిందే. బీజేపీ 'సహకార ఫెడరలిజం' నిజ స్వరూపం ఇదన్నమాట. 'ఒకే దేశం - ఒకే పన్ను - ఒకే మతం - ఒకే భాష - ఒకే ఎన్నికలు ...' అని గొంతు చించుకునే పరివార్ శక్తులు కష్టాల్లో ఉన్న అన్ని రాష్ట్రాలను మాత్రం ఒకేలా చూడరు. వారి విద్వేష సిద్ధాంతం వెనుక కుట్రలను జనం అర్థం చేసుకుంటున్నారు. తగిన సమయంలో తగిన బుద్ధి చెబుతారని ఆశిద్దాం !