Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీకా.. టీకా.. టీకా.. దేశంలో ఏ నోటా విన్నా అదే మాట. అన్నీ చోట్లా అదే ముచ్చట. డోసుల కోసం పరుగులు పెట్టే పరిస్థితి. ఈ టీకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రస్తుతం సవాల్ విసిరింది. ప్రపంచవ్యాప్తంగా టీకా ప్రాధాన్యత ఎంతటిదో కరోనా చాటుతున్నది. రాష్ట్రంలోనూ టీకాల కోసం ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వామపక్షాలు చెప్పినట్టు ముందస్తు ప్రణాళికతో సార్వత్రిక టీకా విధానాన్ని చేపడితే నేడు దేశంలో వైరస్ వ్యాప్తి ఇంత దారుణంగా ఉండేది కాదనేది అక్షర సత్యం. అసలు వ్యాక్సిన్ డోసులను సమకూర్చడంలో మోడీ సర్కారు చేతులెత్తేసింది. బీజేపీకి ప్రత్యేక ప్రణాళికే లేదు. అందరికీ టీకాలు వేస్తామనే హడావుడే తప్ప, టీకాలు ఎక్కడి నుంచి తెస్తారనే సంగతిని కేంద్రం మరిచింది. ప్రస్తుతం దేశంలోని గడ్డుపరిస్థితులకు మోడీ ప్రభుత్వ తప్పిదమే ప్రధాన కారణం. కోవిడ్‌ను నిర్మూలించామనే భ్రమలో ఉంది. ఇప్పుడు చేయిదాటి మెడకుచుట్టుకుంది. వ్యాక్సిన్ ఉత్పత్తికి దేశంలో 30 కంపెనీలు ఉన్నా, రెండింటికే అవకాశం ఇవ్వడం ఏమిటి?పైగా నెలకు 60 మిలియన్ల డోసులు అవసరమైతే, కేంద్రం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి తప్పుడు లెక్కలిచ్చింది. ఏడాదికి 70 నుంచి 100 మిలియన్ డోసులు సీరం ఇన్స్టిట్యూట్, మరో 12.5 మిలియన్ డోసులు భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తుందనీ, అవి సరిపోతాయని చెప్పింది. కానీ ప్రస్తుతం వ్యవహారం తలకిందులైంది. ప్రపంచంలోనే అత్యధిక టీకాలు ఉత్పత్తయ్యే మన దేశంలో, వ్యాక్సిన్లు వేసుకోలేని దీనదశకు మోడీ సర్కారు నిష్క్రియాపరత్వమే కారణం. ఆత్మనిర్భర్ భారత్ టీకాలకు పనికిరాకపోవడం గమనార్హం.
రెండేండ్లకు ముందునుంచే ఉన్న ప్రపంచ ఆర్థిక మందగమనం నేడు మన దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. తాజాగా కేంద్రం టీకా భారం మోపడంతో రాష్ట్రాల పరిస్థితి నడిసముద్రంలో నావే అయింది. ఇదిలావుంటే కేంద్రమంత్రి మురళీధరన్ రాష్ట్రాల మీద వివక్షను ప్రదర్శించారు. గుజరాత్, మధ్యప్రదేశ్‌కు అవసరానికి మించి టీకాలు పంపిన కేంద్రం, కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న కేరళకు ఒక్క ఉచిత టీకాను ఇవ్వబోమని బహాటంగానే ప్రకటించారు. ఇది కేరళ ప్రజలను గాయపరిచింది. దీంతో అక్కడి ప్రజలు చైతన్యవంతులై పినరరు విజయన్ ప్రభుత్వానికి రూ.36 కోట్ల విరాళాలను అందజేసి మురళీధరన్‌కు 'టీకా ఛాలెంజ్' విసిరారు. అందులో సామాన్యులైన బీడి కార్మికుడు జనార్థన్, గొర్రెల కాపరి సుబైదా లాంటి వాళ్ల విరాళాలూ ఉండటం కేంద్రానికి చెంపపెట్టు.
ఇక రాష్ట్రంలో 18 ఏండ్లపైబడిన వారందరికీ ఉచితంగా టీకా వేసేందుకు గులాబీ సర్కారు ముందుకొచ్చింది. మంచిదే. కానీ ఎక్కడ్నించితెస్తారు ? ఎలా తెస్తారు ? కేంద్రం నుంచీ అవసరం మేరకు రావడం లేదు. గ్లోబల్ టెండర్లతో వేగంగా వ్యాక్సిన్లు అందుతాయా అనేది మరో ప్రశ్న. వ్యాక్సినేషన్‌తోనే వైరస్‌కు అడ్డుకట్ట పడుతుందన్న వైద్యనిపుణుల మాట ఇప్పుడిప్పుడే జనాల్లోకి ఎక్కుతుండటం, పాజిటివ్ కేసులు, మరణాలు అధికమవడంతో టీకాలకు ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. టీకా లేసుకున్నాక కోవిడ్ సోకినా త్వరగా కోలుకోవడం, ఇప్పటిదాకా మరణాల రేటు చాలా పరిమితంగా ఉండటంతో డిమాండ్ ఎక్కువైంది. 25 లక్షలుగా ఉన్న ఆటో, క్యాబ్, డ్రైవర్లు, రేషన్ డీలర్లు, గ్యాస్ డెలివరీ బార్సు, వంటి సూపర్స్ప్రెడర్లకు టీకాలందిస్తే వైరస్‌కు చెక్ పెట్టవచ్చనేది సర్కారు ఆలోచన.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)తోపాటు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీవో) అనుమతి ఉన్న కంపెనీల టీకాలే ప్రజలకు వేయాలి. అనుమతులు కొవిషీల్డ్‌కు ఉన్నా, కొవాగ్జిన్‌కు లేవు. అన్నీ ఉన్న ఫైజర్, మోడెర్నా, జాన్సన్ కంపెనీలు కేంద్రానికే డోసులిస్తామంటున్నాయి. దీంతో స్పుత్నిక్వైపే రాష్ట్రం చూస్తున్నది. ఇప్పటికే బృహన్ ముంబయి కార్పొరేషన్(బీఎంసీ)కు రెండు నెలల్లో కోటి డోసులిస్తామంటూ బిడ్‌లో స్పుత్నిక్ చెప్పింది. దీంతో ఈనెల 19నే మన రాష్ట్రం గ్లోబల్ టెండర్లను పిలిచింది. జూన్ నాలుగున బిడ్డింగ్ సైతం ఉంది. ఎప్పుడూ లాభాలనే ఆశించే కార్పొరేట్ కంపెనీల నైజం, ఈ ఆపత్కాలంలోనూ బయటపడింది. భారత్ బయోటెక్ కంపెనీ డబ్బు కోసం కోటా మేరకు రాష్ట్రానికి డోసులు ఇవ్వకుండా, విడిగా అమ్ముకుంటున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వరంగం ఎంత అవసరమో ప్రస్తుత పరిస్థితి అద్దంపడుతున్నది. ఇప్పుడు ఐడీపీఎల్ ఉండి ఉంటే, వ్యాక్సిన్ల కొరతకు అవకాశమే ఉండేది కాదు.
ముఖం బాగాలేక అద్దంపగులగొట్టుకునట్టు ముందస్తు జాగ్రత్తల్లేక, ఎన్నికల ప్రచారాలు, బహిరంగసభలతో వైరస్ వ్యాప్తికి కారణమైన బీజేపీ ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నది. అంతేగాక లోపభూయిష్టమైన టీకా విధానాన్ని తీసుకొచ్చింది. రెండో డోసు సమయాన్ని కేంద్రం ఎనిమిది నుంచి 12 వారాలకు, ఆ తర్వాత 16 వారాలకు పెంచడంతో కనీసం 84 రోజులు పూర్తికాలేదంటూ వెనక్కి పంపుతుండటం ప్రజలను అసహానానికి గురిచేస్తున్నది. ఆగ్రహానికి కారణమవుతున్నది. ఇది కేంద్రంలోని బీజేపీ సర్కారు వైఫల్యానికి పరాకాష్ట. ప్రజలకు పెనుశాపం.