Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైరస్ విధ్వంసం ఆగలేదు. సామాన్యుడిపై పంజా విసురుతూనే ఉంది. రోజురోజుకీ మరణాలు కలవరపెడుతున్నాయి. గోరుచుట్టుపై రోకటి పోటులా బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ పట్టిపీడిస్తున్నాయి. దురదష్టవశాత్తు ప్రజల కష్టాలు పాలకులకు వినోదాన్ని కల్గిస్తుంటే, పెట్టుబడిదారులు లాభాలు మూటకడుతున్నారు. ఆస్పత్రుల నుంచి మొదలుపెడితే బెడ్లు, ఆక్సిజన్, టీకాలు, ఆఖరికి మందుల వరకూ అన్నింటికీ కొరతే. రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు చోటు చేసుకుంటుంటే ప్రధాని మొసలి కన్నీరు కారుస్తున్నారు. కానీ కమ్యూనిస్టులు కష్టాల్లో ప్రజలకు బాసటగా నిలుస్తున్నారు. ఈ విపత్తు కాలంలో ప్రభుత్వాలపై రాజకీయ విమర్శలు చేయడం ఒక్కటే కమ్యూనిస్టుల పని కాదు. ప్రజల కష్టంలో భాగం పంచుకోవడమే వారి నిజమైన కర్తవ్యం. నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సీపీఐ(ఎం) పిలుపు మేరకు మార్క్సిస్టు పార్టీ కార్యాలయాలన్ని కరోనా కేర్ సెంటర్స్‌గా మారిపోవడమే అందుకు నిదర్శనం
'వొట్టి మాటలు కట్టిపెట్టోయ్ / గట్టి మేల్ తలపెట్టవోయ్' అన్న గురజాడ అడుగుజాడల్లో సీపీఐ(ఎం) శేణ్రుల పిలుపుతో అభ్యుదయ శక్తులు, ఎన్నో సామాజిక సంస్థలు ముందుకు వచ్చాయి. వాటి సహకారంతో మార్క్సిస్టు పార్టీ కార్యకర్తలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఐసోలేషన్ కేంద్రాల్లో సేవలు అందిస్తున్నారు. కరోనా వచ్చిందంటే సొంతవారే పరాయిగా చూస్తున్న సందర్భంలో ''మీకు మేమున్నామంటూ'' బాధితులకు చేయూతనిస్తున్నారు. కొవిడ్ నిర్ధారణ అయిందంటే ఏం జరుగుతుందోన్న ఆందోళనతో మానసికంగా కుంగిపోతున్న వారున్నారు. అద్దె ఇండ్లల్లో, ఒకే గదిలో కుటుంబాలతో ఉంటున్న వారిలో ఒకరికి పాజిటివ్ వచ్చినా కష్టంగా మారుతున్న రోజులు. హౌం ఐసోలేషన్‌లో ఉండలేని కుటుంబాలు అనేకం. వైరస్ ప్రభావం నుంచి త్వరగా కోలుకునేందుకు పౌష్టికాహరం తీసుకోలేని ఆర్థిక ఇబ్బందులు మరో వైపు. చుట్టూ చీకట్లు అలుముకున్న వారికి సీపీఐ(ఎం) ఐసోలేషన్ కేంద్రాలు దారి దీపం అవుతున్నాయి. ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను గాల్లో దీపం చేశాయి. కండ్ల ముందు ఘోరాలు జరుగుతున్నా చేష్టలుడిగి చూస్తున్న సర్కారు వారు ఇంకెప్పుడు మేల్కొంటారు? ప్రభుత్వ, ప్రయివేటు బడులు, కళాశాలలను కమ్యూనిటీ ఐసోలేషన్ కేంద్రాలుగా మారిస్తే కోవిడ్‌ను అంతమొందించే అవకాశమెక్కువ. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి. కేరళ ప్రభుత్వం ఆవిధమైన నిర్ణయం తీసుకుంది. కమ్యూనిస్టు పార్టీలు, కేరళ ప్రభుత్వం సమిష్టిగా పని చేస్తున్నాయి. ప్రతిపక్షాలను కూడా కలిసి రమ్మంటున్నాయి. గడ్డుపరిస్థితుల్లో కూడా బెంగాల్లో ఆ పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. కానీ దేశంలో అందుకు భిన్నమైన పరిస్థితులున్నాయి. ప్రజలను కంటి పాపలా కాపాడాల్సిన పాలకులు చేతులు ఎత్తివేసిన తరుణంలో సీపీఐ(ఎం), ప్రజాసంఘాలు శక్తికి మించి కృషిచేస్తున్నాయి. తమ శాఖల ద్వారా గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో అత్యధికంగా కమ్యూనిటీ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి పేదలను ఆదుకోంటున్నాయి. వారికి అండగా నిలబడుతున్నాయి. ఈ ఐసోలేషన్ కేంద్రాల్లో భోజనం, వైద్యంతో పాటు కార్యకర్తల సేవలు, నేతలు అందించే మానసిక స్థైర్యంతో రోగులు కరోనాపై విజయబావుటా ఎగరేస్తున్నారు.
'అంతా శ్మశానమై పోయింది.. ఓ రాజా బతికించే వాళ్లు లేరు, శవాలను మోసే వాళ్లు లేరు, అంతా కోల్పోయిన దు:ఖితులు మాత్రం మిగిలారు/ మాటలు లేక బరువెక్కిన మా హృదయాలు శోకగీతాలైనాయి/ ప్రతి ఇంట్లో మృత్యుదేవత తాండవమాడుతోంది/ ఓ రాజా నీ రామరాజ్యంలో గంగశవమయమై శవగంగా ప్రవాహమైంది' పరుల్ ఖక్కర్ అన్నట్టు దేశంలో చావుల వరద పారుతున్నది. కానీ 'అంతా బాగుంది...' అని సర్కారు జబ్బలు చరుచుకుంటుంటే, వాస్తవాలు మరోలా ఉన్నాయి. వైరస్‌కు గురైన సామాన్యుల గుండెలు పగులుతున్నాయి. ఏ ఆస్పత్రికి వెళ్లినా పడకలు అందుబాటులో లేవు. ప్రయివేటు దోపిడి వైరస్ కంటే ప్రమాదకరంగా మారింది. వీటికి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వాలు టచ్ మీ నాట్ అన్నట్టు ఉండిపోయాయి. కనీసం చనిపోయిన వారి మృతుదేహాలను కూడా స్మశానానికి తీసుకువెళ్లే వారు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. అటువంటి అభాగ్యు లకు అండగా నిలుస్తున్నాయి సీపీఐ(ఎం) శ్రేణులు. మంచికంటి హెల్ప్ లైన్ పేరుతో కరోనా మృతుల అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామశాఖల వరకు విరివిగా కమ్యూనిటి ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి వైద్య సదుపాయాలు కల్పిస్తూ సేవా దక్పథంతో పని చేస్తున్నాయి. పలు స్వచ్ఛంద సంస్థలు, దాతల తోడ్పాటుతో పాటు ఆ పార్టీ శాఖలన్నీ స్వయంగా తమ శక్తి మేరకు విరాళాలు అందిస్తున్నాయి.ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోనేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంలో రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలను విశ్వాసంలోకి తీసుకుంటే ఫలితం ఎలా ఉంటుందో నిరూపిస్తున్నాయి. ఆ పార్టీ శ్రేణులు మహానేత సుందరయ్య అడుగుజాడల్లో నడుస్తున్నాయి. నిజమైన ప్రజాసేవకులుగా నిలుస్తున్నారు.