Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నిదురపో... నిదురపో... నిదురపోరా తమ్ముడా, నిదురపోరా తుమ్ముడా! నిదురలోన గతమునంతా నిముషమైనా మరచిపోరా! కరుణలేని ఈ జగాన కలత నిదురే మేలురా! కలలు పండే కాలమంతా కనుల ముందే కదలిపోయె, లేతమనసున చిగురుటాశ పూతలోనే రాలిపోయె, జాలితలిచి కన్నీరు తుడిచే దాతలే కనరారే..'' అంటూ తన చిన్ని తమ్ముని జోకుడుతూ అక్క పాడే పాట ఇది. 1955లో లతామంగేష్కర్ మొట్టమొదటిసారిగా తెలుగులో పాడిన ఈ పాట నేటి వేలాదిమంది అనాథలైన చిన్న పిల్లల పరిస్థితికి అద్దం పడుతుంది.
ఇంట్లోని పెద్దలను కరోనా బలితీసుకుంటే, తల్లీ తండ్రీ లేక అనాథలుగా మారిన చిన్న పిల్లల పరిస్థితిని గురించి పట్టించుకునే నాథులే లేకుండాపోయారు. సరైన ముందు జాగ్రత్తలు లేకుండా, ప్రభుత్వం నిర్లక్ష్యంగా, ఇక కరోనాను జయించేసామని కాలరెగరేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. దాని పర్యవసానంగా నిరుపేదలు, రోజు కూలీ చేసి బతికేవారు, సాధారణ ప్రజలు ఈ కరోనా సోకి ప్రాణాలొదిలారు. పోనీ అందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారా అంటే అదీలేదు. ఫలితంగా దేశం మొత్తంలో అనేక మంది బలయ్యారు. లక్షలాది కుటుంబాలు చిద్రమైనాయి. కుటుంబాలలోని చిన్న పిల్లలు దిక్కులేనివారుగా దీనమైన బతుకును వెల్లదీస్తున్నారు. ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి మొదలైన కనీస అవసరాలు కూడా లేక ఆదుకునేవారెవరూ కానరాక ఆందోళనకు గురవుతున్నారు. అనుకోని విధంగా అకస్మాత్తుగా అనాథలుగా మారిపోవడం, ఆకలితో అలమటించే పరిస్థితులు ఎంతో దయార్ధ్రంగా కనపడుతున్నాయి.
ఏరకమైన విపత్తులయినా, యుద్ధాలయినా, ప్రకృతి ఉపద్రవాలయినా వచ్చినప్పుడు ఎక్కువగా నష్టపోయేది ఇక్కట్లకు గురయ్యేది పిల్లలు స్త్రీలు మాత్రమే. ఇప్పుడు కరోనా ఉధృతిలో కూడా అదే జరుగుతోంది. కుటుంబ పెద్ద కరోనా బారిన పడి మరణిస్తే ఆ కుటుంబ భారమంతా మహిళల మీదే పడుతోంది. ఆ తర్వాత పిల్లలకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ ఇవేమీ ప్రభుత్వాలకు సమస్యగా కనిపించడం లేదు.
'పాపం పుణ్యం ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం శ్లేషార్థాలూ ఏమీ ఎరుగని పూవుల్లారా! ఐదారేడుల పాపల్లారా! మెరుపు మెరిస్తే వానకురిస్తే ఆకశమున హరివిల్లు విరిస్తే, అవి మాకే అనుకుని ఆనందించే పిట్టల్లారా పిల్లల్లారా!'' అంటూ శ్రీశ్రీ పిల్లల జీవితాన్ని ఎలుగెత్తి చాటారు. రేపటిపౌరుల జీవితాల పట్ల బాధ్యతను గుర్తుచేశారు. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం గురించి దాశరథి ఆవేదన చెందటాన్నీమనం చూస్తాం. అదే విధంగా ''నేను చూశాను నిజంగా తల్లి తండ్రిలేక, తిండిలేక ఏడుస్తూ ఏడుస్తూ, ముంజేతుల కన్నులు తుడుచుకుంటూ మురికి కాల్వ పక్కనే నిద్రించిన మూడేండ్ల పసిబాలుణ్ణి'' అని ఆర్తగీతంలో వాస్తవ పరిస్థితులను ధృశ్యమానం చేశాడు తిలక్.
'ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘనకు గురవుతున్న వారిలో పిల్లలే అధికంగా ఉన్నారు. అనేక రకాల అణచివేతలకు, దోపిడీకి, యుద్ధ వినాశాలకు బలవుతున్నారు. ప్రపంచంలోని బాలలు ఆరోగ్యవంతమైన జీవితాన్ని అనుభవించాలి. పిల్లలకు ఆకలి సమస్య తలెత్తకూడదు. ప్రతి పసికందుకు ఉజ్వల భవిష్యత్తు కల్పించడం కంటే మహత్తరమైన విధి మరోటి లేదు.' అని ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ అన్న మాటలు ఈనాడు ఎవరి చెవులకూ ఎక్కడం లేదు. రేపటి దేశం వాళ్లు. రేపటి దేశ భవిష్యత్తూవాళ్ళ మీదనే ఆధారపడి ఉంది. పిల్లలకు బతికే హక్కును, ఆరోగ్యంగా ఉండే హక్కును, చదువుకునే హక్కును అందివ్వ గలిగిననాడే భావి భారతం మనగలుగుతుంది. పిల్లలే కదా అని చిన్న చూపుతో నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
ప్రస్తుతం మన దేశ పాలకులు నేడు పౌరులుగా ఉన్న వాళ్ళ హక్కుల గురించే ఆలోచించే స్థితిలో లేరు. అందుకనే నిన్న సుప్రీంకోర్టు కలుగజేసుకుని అనాథలుగా మిగిలిన బాలల బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలని, వారికి అవసరమైన తిండి, బట్ట, నివాసం, చదువు ఏర్పాట్లను చేయాలని ఆదేశించింది. ఆయా ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు తగిన ఏర్పాట్లను చేయాలని సూచించింది. అంటే కోర్టులు కలుగజేసుకుని చెప్పేవరకు ఆ సమస్యను పట్టించుకోకపోవడం ఎంత విచారకరం. ఈ తీర్పు కన్నా ముందే కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం కరోనా విధ్వంసం వలన తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు అండగా ఉంటామని ప్రకటించింది. వారికి వెంటనే మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామనీ, నెల నెలా రెండువేల రూపాయలు భృతిని పద్దెనిమిదేండ్లు వచ్చేవరకరూ ఇస్తామని, డిగ్రీ వరకు ఉచిత విద్యను కూడా అందిస్తామని ప్రకటించింది. ఇది ఎంతో సముచితమైన బాధ్యతాయుతమైన నిర్ణయం. మిగతా ప్రభుత్వాలు కూడా ఈ విధమైన భరోసాను ఒంటరిగా మిగిలిన చిన్నారులకు ఇవ్వాలి, ఆదుకోవాలి.
పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడంలోనే భవిష్యత్తు పట్ల ప్రేమను కలిగి ఉన్నామని నిరూపించుకోగలం. వందకోట్లకు పైగా ప్రజలున్న నేలపైన పిల్లలు అనాథలుగా యాతనపడటం కన్నా దుర్మార్గమైనది ఏమున్నది! వాళ్ళ భవిష్యత్తుకు అందరం పూచీపడాలి. ''మీదేమీదే సమస్త విశ్వం, మీరే లోకపు భాగ్యవిధాతలు, మీ హాసంలో మెరుగులు తీరును, వచ్చే నాళ్ళ విభాప్రభాతములు'' అన్న మహాకవి వాక్కులను నిజం చేసే పనిలో నిమగమవుదాం. పిల్లల ప్రేమలు పువ్వులు, పరిమళాలు, మెరుపులు, గెలుపులు, నేతలు జోతలు.