Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన జీవించే హక్కును ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రులు ప్రశ్నార్థకం చేస్తున్నాయి. నీరు పల్లమెరుగు అన్నట్టు పెట్టుబడి ఎల్లవేళలా లాభాన్నే ఆశిస్తుంది. మంచిని, మానవత్వాన్ని దరిదాపుల్లోకి రానీయదు. కాసులే పరమావధి. ప్రజాసేవకు అక్కడ చోటుండదు. దేశంలోగానీ, రాష్ట్రంలోగానీ ప్రయివేటు ఆస్పత్రుల ఆగడాలు మితిమీరాయి. ప్రజల రక్తమాంసాలను కరోనా మంటమీద కాల్చుకు తింటున్నాయి. సర్కారీ ప్రజారోగ్య వ్యవస్థ విఫలమే ఇందుకు ప్రధానకారణం. నేటి భారతం సినిమాలో 'అత్తో పోదం రావే మన ఊరి దవాఖానకు..' అనే పాట అప్పట్లో ఫేమస్. సర్కారీ ఆస్పత్రుల బండారాన్ని అది కండ్లకు కట్టింది. 21వ శతాబ్ధంలో భౌతికంగా కొంత మార్పొచ్చినా, పేదల ఆర్థిక స్థితిగతులు అంతంతే. దీంతో ఇటు ప్రభుత్వాసు పత్రులకుపోలేక, అటు ప్రయివేటు వైద్యం చేయించుకోలేక నిత్యం పేదలకు అష్టకష్టాలే. అవస్థలే.
ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ డొల్లతనాన్ని కరోనా నిగ్గుతేల్చింది. బలోపేతానికి సంకేతాలిచ్చింది. అలాగే ప్రయివేటు ఆస్పత్రులపై నియంత్రణా అవసరమేనంది. ఇటీవలి వైద్యరంగంలో పరిణామాలు ప్రజలకు శాపమే. చికిత్స పేర లక్షలకు లక్షలు అక్రమంగా ప్రయివేటు ఆస్పత్రులు గుంజుతూ కాసులకు క్షేత్రాలయ్యాయి. హైదరాబాద్‌లోని ఒక ఆస్పత్రి రూ.23 లక్షలు మెక్కి, ఆ తర్వాత శవాన్ని అప్పగించింది. ఈ తరహా కేసులు రాష్ట్రంలో బోలెడున్నాయి. బడా రాజకీయ నేతలు, ప్రభుత్వాల అండదండలతో వైద్యాన్ని వ్యాపారంగా మార్చేశారు. ఇటు రాష్ట్రం, అటు కేంద్రం నీమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నాయి. ప్రేక్షకపాత్రను పోషిస్తున్నాయి. తాము ఇచ్చిన ఉత్తర్వులనే అమలుచేయని సంబంధిత ఆస్పత్రులపై కొరడా ఝులిపించలేని నిస్సహాయస్థితిలో ఉన్నాయి. ఫిర్యాదుల కోసం వాట్సాప్ నెంబరు కేటాయించడం, ఆ తర్వాత షోకాజ్ నోటీసులు జారీచేయడం రాష్ట్రవైద్యశాఖకు పరిపాటే. 1200కుపైగా ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రులు ఉంటే, అందులో 64 ఆస్పత్రులపై 88 ఫిర్యాదులు రాగా, కేవలం 16 దవాఖానలపై టీఆర్స్ సర్కారు తాత్కాలిక చర్యలు తీసుకోవడం దారుణం. కేటీఆర్ ట్విట్టర్‌కు ఫిర్యాదు వచ్చిందనో, ఒకటి రెండు చోట్లా గొడవలు అయ్యాయనో నామమాత్రపు చర్యలతోనే సరిపెట్టింది.
ప్రజారోగ్య వ్యవస్థలోని లోపాలను సరిచేయకుండా, ప్రయివేటుకు వెళ్లొద్దు అని సీఎం చెప్పడం సబబేనా? వైరస్ నిర్మూలనకు ప్రభుత్వ, ప్రయివేటు రంగం సమన్వయం చేసుకుంటూ రోగులకు సేవలందించాలి. ఆమేరకు ప్రభుత్వమే చొరవ చూపాలి. అవసరమైతే చట్టాలను కఠినంగా అమలు చేయాలి. రాష్ట్రంలో ఎక్కడుంది ఈ తరహా పరిస్థితి? ఖజానా కక్కుర్తి తప్ప. ఫిర్యాదులు వచ్చినప్పుడు కొవిడ్ ట్రిట్మెంట్ పర్మిషన్ను తాత్కాళికంగా రద్దుచేయడం, ఆ తర్వాత కొన్ని రోజులకే మళ్లీ పునరుద్ధరించడం. అంతా తమాషానే. మీడియాలో వార్తలు వచ్చినప్పుడో, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తినప్పుడో ఇందుకు పూనుకుంటున్నారు. ఒక కార్పొరేట్ ఆస్పత్రికి సర్కారే కొమ్ముకాస్తున్నట్టుగా ఇప్పటికే ఆరోపణలున్నాయి. దీంతో ఆ యాజమాన్యం ధీమాగా ఉందనేది నగసత్యం. ప్రయివేటు ఆస్పత్రుల్లో వైద్యసేవలకు రేట్లు ఫిక్స్ చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 248ని యాజమాన్యాలు తుంగలో తొక్కాయి. వాటిలో సర్కారు హెల్త్‌కార్డులు చెల్లుబాటుకావు. బీమా పాలసీలు పనికిరావు. నగదు కడితేగానీ ఆస్పత్రుల్లో అడుగుపెట్టనీయరు.
కొవిడ్ వచ్చి సంవత్సరమైనా ప్రభుత్వ రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బలోపేతం చేయలేకపోయాయి. రోగులకు మెడికల్ ఆక్సిజన్ సైతం దొరకక విలువైన ప్రాణాలు కోల్పోయారు. చివరకు సినిమా యాక్టర్ సోనూసూద్ లాంటివారు ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టేదాకా ప్రభుత్వాలకు సోయిలేని అత్యంత దయనీయస్థితి. రాష్ట్రంలో స్మశానాలు విరామం లేకుండా మండుతూనే ఉన్నాయి. హైకోర్టు అనేక విషయాల్లో చీవాట్లు పెట్టినా, మొట్టికాయలేసినా చెవిటోడి ముందు శంఖమూదినట్టే ఉంది. పేదలనుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కార్పొరేట్ ఆస్పత్రులపై తాటాకుచప్పుళ్లకే పరిమితమవడం గమనార్హం. ప్రజారోగ్య వ్యవస్థను స్థానిక సంస్థలకు అప్పగించిన కేరళ సర్కారు భారీ విజయాని సాధించింది. అందుకే భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) పినరరు విజయన్ సర్కారును పలుమార్లు ప్రశంసించక తప్పలేదు. ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరాలోనూ కేరళ ముందుంది. కరోనా రోగుల శవాలను ఏకంగా నదిలోనే పారేసిన ఘనత యూపీ యోగీది. డబ్ల్యూహెచ్‌వో చెప్పినట్టు ట్రేస్, టెస్ట్, ట్రీట్ విధానానికి స్వస్తిచెప్పి కుంభమేళాకు అనుమతిచ్చిన మోడీ సర్కారు, ప్రజల ఉసురు తీసింది. ఇప్పుడేమో మొసలికన్నీరు కారుస్తూ పేద ప్రజల ప్రాణాలను గాల్లో దీపం చేసింది.