Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలి!' అంటుంటారు. నిజమే కానీ ఆ అప్పుడు ఎప్పుడనేది ఎవరు నిర్ణయించాలి? అసలు జరగాల్సిన ఆ 'ముచ్చట' వయసును బట్టి సహజంగా ఏర్పడే భౌతిక అంశమా? లేక పరిస్థితుల్ని బట్టి నిశ్చయించాల్సిన సామాజిక అంశమా? అనేదీ మరో ప్రశ్న. భారతీయ సమాజంలో ముఖ్యంగా పెండ్లి తంతు ఎప్పుడూ సరైన గాడిలో లేదన్నది చారిత్రాత్మకంగానూ చర్చనీయాంశమే. ఈ తరుణంలో భారత స్త్రీకి వివాహ వయసును 18ఏండ్ల నుంచి 21ఏండ్లకు పెంచుతూ గతేడాదే కొత్తచట్టం వచ్చింది. కానీ దేశంలో అంతకు ముందున్న 18ఏండ్లు రాకుండానే వివాహాలు చేస్తున్నారు. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న మాతృ మరణాలు, పౌష్టికాహార లోపాన్ని సరిచేయడానికితేడాదే జయా జెట్లీ అధ్యక్షతన మహిళా, శిశుఅభివృద్ధి మంత్రిత్వశాఖ ఒక టాస్క్‌ఫోర్స్‌ను నియమించి, ఈ 21ఏండ్ల నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వాలు చట్టాలు చేసి చేతులు దులుపుకుంటే సమాజంలో మార్పురాదు కదా! ఆ చట్టాలను అమలు చేయించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వా ల పైనే ఉంటుందన్నది ఏవరూ కాదనలేని నిజం.
'హలో సారూ.. నా పెళ్లి ఆపరూ!' ఇది వరంగల్ రూరల్ జిల్లాలోని ఓ తండాలో 9వ తరగతి చదివే అమ్మాయి నుంచి మే 26న ఛైల్డ్ హెల్ప్‌లైన్‌కు వచ్చిన ఫోన్ ఇది. 'తనకు ఇంట్లోవాళ్లు బలవంతంగా పెండ్లి చేస్తున్నారని, దయచేసి ఆపాలని' స్వయంగా ఆ చిన్నారి కోరిందంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో ఇది మరింత పెరిగిపోయింది. బాలికలే ధైర్యంగా హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి తమ పెండ్లి సమాచారం ఇచ్చి తామని తాము రక్షించుకున్న ఘటనలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. దీనిని బట్టి రాష్ట్రంలో గుట్టుచప్పుడు కాకుండా బాల్యవివాహాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో స్పష్టం అవుతుంది. అసలు ఏంత మంది బాలికలకు తమ తల్లిదండ్రుల నిర్ణయాన్ని కాదనే ధైర్యం ఉంటుంది. ఎంత మందికి ఈ హెల్ప్‌లైన్ నెంబర్లు తెలుస్తాయి. ఒక వేళ తెలిసినా ఎంత మంది ఆ సాహసం చేస్తారు? అలా అనేక ప్రశ్నలు చుట్టు ముడుతున్నాయి. మన రాష్ట్రంలోనే 1357 పెండ్లీలను అధికారులు పీటల మీద ఆపారు. ఒక్క వికారాబాద్ జిల్లాలోనే 177 పెండ్లీలు ఆగిపోయాయి. పాతబస్తీలాంటి చోట అరబ్ షేకులకు ఆడపిల్లలను అమ్ముకుంటున్న ఘటనలు ఇంకెన్నో...!
తల్లిదండ్రులు ఆడ పిల్లలకు బాల్యంలోనే పెండ్లి చేసి భారాన్ని దింపుకుంటుంటే.. సంసారం, కుటుంబ బాధ్యతలతో లేత ప్రాయం వాడిపోతుంది. తెలిసీతెలియని వయసులో బండెడు కష్టాలు అనుభవిస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నారు. బాల్య వివాహాలు జరగకుండా నివారించాల్సిన ప్రభుత్వాలు ప్రజల్లో చైతన్యం నింపడంలో విఫలమవుతున్నాయి. పెండ్లి జరుగుతుందనగా అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో అప్పుడు వెళ్లి వివాహాలను ఆపడానికే పరిమితమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పిల్లలకు సామాజిక, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా పరిపూర్ణ వ్యక్తులుగా ఎదగడానికి, అభివృద్ధి చెందటానికి రక్షణ పొందే హక్కును రాజ్యాంగం కల్పించింది. బాల్య వివాహం వారి హక్కులను హరిస్తుంది. రాజారామ్మోహన్ రాయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, కందుకూరి వంటివారల కృషి ఫలితం, వివాహ చట్టాల వలన ప్రజల్లో బాల్యవివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై కొంతమేరకు అవగాహన కలిగి బాల్యవివాహాలను నిషేధించి, పునర్వివాహాలను ప్రోత్సహించారు.
కానీ నేడు హిందూత్వ ఎజెండాను బలంగా అమలు చేస్తున్న మనువాదుల పాలనలో ఉన్నాం మనం. ఇప్పటికీ దేశంలో బాల్య వివాహాలు జరగడానికి కారణాలేమిటి? గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహర్ రాష్ట్రాల్లో అయితే ఈ సంఖ్యను ఊహించడం కూడా కష్టమే. అంతరిక్ష్యంలోకి ఆడపిల్లలు వెళ్తున్న కాలంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు వెనుకబడే ఉన్నాయి. కేవలం అభివృద్ధిలోనే కాకుండా ప్రజల ఆలోచనల్లోనూ వెనుకబాటుతనం స్పష్టంగా కనిపిస్తోంది. సమాజం ఎప్పుడో వదిలేసిన అమానుష ఆచారాలు కొనసాగుతున్నంత కాలం ఎన్ని చట్టాలు వచ్చినా నిరూపయోగమే. పాలకులు చట్టాలను అమలు చేయడం కంటే ప్రజలను అశాస్త్రీయత వైపు నడిపించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దాని ఫలితమే చట్ట విరుద్ధం అని తెలిసినా ఇప్పటికీ బాల్య వివాహాలు ఆగడం లేదు. బంధుత్వం మంచిదనో, మంచి సంబంధమనో, కట్నంలేదనో, వృద్ధుల కోరిక మేరకో పెండ్లీలు చేస్తున్నారు. ప్రపంచాన్ని ఆర్థికంగా అతలాకుతలం చేసిన కరోనా బాలికల పాలిట పెనుశాపమైంది. కొవిడ్, బాల్యవివాహాల నిరోధంలో ప్రగతికి ముప్పు పేరుతో ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున యునిసెఫ్ నివేదిక ఆందోళనకర విషయాల్ని వెల్లడించింది. కరోనా కారణంగా పాఠశాలలు మూసివేయడం, కుటుంబాల మీద ఆర్థిక ఒత్తిడి, తల్లి, తండ్రి మరణం లాంటివి బాల్యవివాహాలు పెరగడానికి మరింత కారణమవుతాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా బాల్య వివాహం అయిన బాలికలు, మహిళలు 65కోట్ల మంది ఉండగా వారిలో సగం భారత్, బంగ్లాదేశ్, నైజీరియా, ఇథియోపియా, బ్రెజిల్లలోనే ఉన్నట్టు ఆ నివేదిక చెపుతోంది. దీని కారణంగా రానున్న దశాబ్దంలో కోట్లాది మంది బాలికలు బాల్య వివాహాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఐరాస అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యునిసెఫ్) హెచ్చరించింది.