Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకునేందుకు, తమకు నచ్చిన భావాలను వ్యక్తీకరించేందుకు అనుసంధాన వేదికలు (ఇంటర్మీడియరీస్)గా వ్యవహరిస్తున్న ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలకు ఇన్నాళ్లూ రక్షణగా ఉన్న ఐ.టి చట్టంలోని పలు నిబంధనలను సవరించి కొత్త నియమావళిని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. వాస్తవానికి ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 25నే ప్రభుత్వం జారీ చేసింది. కొత్త నిబంధనలకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా సామాజిక మాధ్యమాలకు మూడు నెలలు గడువునివ్వడంతో అవి మే 26 నుంచి అమల్లోకి వచ్చాయి. నిజానికి వీటి వల్ల నష్టపోయేది సామాజిక మాధ్యమాలు కాదు.. వాటిని వినియోగిస్తున్న కోట్లాది మంది భారతీయులేనన్నది మనం గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం కూడా ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే తప్ప సామాజిక మాధ్యమాలు కాదన్నది సుస్పష్టం.
మైక్రోబ్లాగింగ్‌లో దిగ్గజ సంస్థ అయిన ట్విట్టర్‌ను ఇదే ఐ.టి చట్టాన్ని బూచిగా చూపి కేంద్ర హౌంమంత్రి అమిత్‌షా కనుసన్నల్లో నడుచుకునే ఢిల్లీ పోలీసుల ద్వారా సోదాలు జరిపి మోడీ సర్కార్ బెదిరింపులకు దిగింది. ఈ గొడవ ఇంకా నడుస్తూనే ఉంది. భారత ప్రభుత్వ నిరంకుశ చర్యల పట్ల నోరు విప్పిన ట్విట్టర్ కొత్త ఐ.టి నిబంధనలు తమ కంటే భారత ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకే ఎక్కువ ముప్పు అని తేల్చి చెప్పింది.
కొత్త నిబంధనల ప్రకారం.. సోషల్ మీడియా కంపెనీలు ఫిర్యాదులను పరిశీలించేందుకు గ్రీవెన్స్ సెల్ ఆఫీసర్లను, ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసేందుకు నోడల్ ఆఫీసర్లను, ఐ.టి నిబంధనలను పాటిస్తున్నదీ లేనిది పర్యవేక్షించేందుకు కాంప్లియన్స్ ఆఫీసర్లను నియమించుకోవాల్సి ఉంటుంది. వాట్పాప్ లాంటి మెసేజింగ్ సంస్థలు అయితే ప్రభుత్వం అడిగిన ప్రతిసారీ ఏదైనా ఒక మెసేజ్ తొలుత ఎక్కడ పోస్టు చేశారనేది.. ఆ తర్వాత అది వ్యాప్తి చెందిన క్రమాన్ని సమగ్రంగా అందజేయాల్సి ఉంటుంది. వాస్తవానికి సందేశాలు అనేవి ప్రజల గోప్యతకు సంబంధించినవి. సామాజిక మాధ్యమాల్లో ఈ గోప్యతకే భంగం వాటిల్లుతోందన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. వాట్సాప్, ఫేస్బుక్ వంటి సంస్థలు ప్రజల సమాచారాన్ని ఎన్నికల అవసరాలకు రాజకీయ పార్టీలకు, వ్యాపార సంస్థలకు అమ్మేస్తున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇప్పుడు దానికి తోడు ప్రభుత్వమే నేరుగా ప్రజల సందేశాల్లోకి తొంగి చూసే ఏర్పాటు ఈ సమాజిక మాధ్యమాలు చేయాలన్నమాట. ఇంతకంటే నీచమైన ఎత్తుగడ ఉంటుందా?
రాజ్యాంగబద్ధమైన భావప్రకటనాస్వేచ్ఛకు సంబంధించిన అత్యంత కీలక చట్టంలోని నిబంధనలు సవరించాలంటే అది మంచికైనా చెడుకైనా పార్లమెంటు ద్వారానే జరగాలి. కానీ మోడీ సర్కార్ దొడ్డిదారిన ఒక నోటిఫికేషన్ జారీ చేసి కొత్త నిబంధనావళిని తీసుకొచ్చేసింది. దీనిద్వారా ప్రభుత్వానికి నిరంకుశ అధికారాలు దఖలు పడతాయి. ఇష్టానుసారం సెన్సార్షిప్ చేయడానికి వీలుంటుంది. విచారణ లేకుండా అనుమానితులను శిక్షించే వ్యవస్థ ఏర్పడుతుంది. సమాచార, సాంకేతిక చట్టం పరిధిలోనే తాము ఈ నిబంధనలు తీసుకొచ్చామని మోడీ సర్కార్ చెబుతున్నా ఐ.టి. చట్టం పరిధికి మించి ఈ నిబంధనలు ఉన్నాయన్నది యథార్థం. ఐ.టి. నిపుణులు, న్యాయ కోవిధులు వ్యక్తం చేస్తున్న ఆందోళన కూడా ఇదే. కొత్త నిబంధనల పరిధి చాలా విస్తృతంగా కనిపిస్తోంది. సామాజిక మాధ్యమాలతో పాటు డిజిటల్ మీడియాకూ ఈ నిబంధనవాళి వర్తించనుంది. అసలు మోడీ సర్కార్ ప్రధాన లక్ష్యం అదే. ద వైర్, న్యూస్ క్లిక్, ఆల్ట్ న్యూస్, స్క్రోల్ ఇన్ వంటి ప్రత్యామ్నాయ వార్తా సంస్థలన్నీ కూడా డిజిటల్ మీడియా వేదికగానే నడుస్తున్నాయి. ప్రజా గళాన్ని వినిపిస్తూ మోడీ సర్కార్‌కు చుక్కలు చూపిస్తున్నాయి. అందుకనే ద వైర్, న్యూస్ క్లిక్ లాంటి సంస్థలపై ఐ.టి దాడులకు కూడా తెగబడిన సంగతి విదితమే.
ఇంటర్నెట్ లోనూ, సామాజిక మాథ్యమాల్లోనూ అశ్లీలత, విద్వేషం వంటి చెత్త చాలానే ఉందనడంలో ఎవ్వరికీ అనుమానం అక్కర్లేదు. వాటిని నియంత్రించే విషయంలో ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కానీ అది ఒక స్వతంత్ర సంస్థ ద్వారా జరగాల్సి ఉంటుందన్న సోయి ప్రభుత్వానికి లేకపోవడమే దుర్మార్గం. ప్రజల భావాలను వ్యక్తీకరించే మాధ్యమాలపై (అది సినిమా అయినా, లేదా కళా రూపమైనా, ప్రింట్, ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ మీడియా ఏదైనా సరే) నేరుగా ప్రభుత్వమే సెన్సార్‌షిప్‌కు దిగి పెత్తనం చెలాయించడమంటే కచ్చితంగా అది భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి చేయడమే. అలాంటి ప్రభుత్వం ఉన్నచోట ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టే. ఐ.టి నిబంధనలు అనేవి సామాజిక మాధ్యమాల నియంత్రణ కోసం తీసుకొచ్చినవి కావని, వాటిలో వ్యక్తమయ్యే ప్రజల భావాలను అణచివేయడమే వాటి అసలు లక్ష్యమన్న సంగతి ప్రజలు గమనంలో ఉంచుకొని ఈ నిరంకుశ నిబంధనలను తిప్పికొట్టాలి.