Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశం పదకొండు శాతం వృద్ధి రేటు సాధించబోతున్నదంటూ మోడీ ప్రభుత్వం సాగించిన ప్రచారంలో డొల్లతనం బయటపడింది. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు గత ఆరు దశాబ్దాల్ల్ఱో ఎన్నడూ లేనంత అథోగతికి చేరిందనడానికి ప్రభుత్వ తాజా గణాంకాలే సాక్ష్యం. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అంటే 2021 జనవరి- మార్చి మధ్య వృద్ధి రేటు 1.6శాతం నమోదయింది. ఆ సంవత్సరం మొత్తం మీద వృద్ధి రేటు చూస్తే మైనస్ 7.3శాతానికి పడిపోయింది. 1964-65లో సుమారు 3శాతం, 1979-80లో 5శాతం తగ్గితే, ఇప్పుడు ఏకంగా 7.3శాతం తగ్గింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక దివాళాకోరు విధానాలు, కోవిడ్ సంక్షోభ సమయంలో దాని అసమర్థ నిర్వాకం ఆర్థిక వ్యవస్థ పాలిట పెనుశాపంగా మారాయి. మరో వైపు చైనా ఈ ఏడాది జనవరి- మార్చిలో 18.3శాతం వృద్ధితో పురోగమన పథంలో సాగుతోంది. ప్రపంచ జీడీపీలో 60 శాతానికి చైనా ప్రాతినిధ్యం వహిస్తున్నది. 2021-2022లో చైనా 7.9శాతం వృద్ధి సాధించనున్నట్లు పలు అంతర్జాతీయ సర్వేలు తెలియజేస్తున్నాయి.
ఏడేండ్ల క్రితం 7.4శాతంగా ఉన్న భారత జీడీపీ వృద్ధి రేటు ఇప్పుడు మైనస్ 7.3శాతానికి పడిపోయింది. ప్రపంచ వ్యాపితంగా నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థలు తీవ్ర సంక్షోభంలో కొనసాగుతున్నాయి. కరోనా మహమ్మారి ఈ సంక్షోభాన్ని మరింత పెంచింది. అయితే ఏ ఇతర వర్థమాన దేశంలోనూ జీడీపీ మన దేశంలో మాదిరిగా ఇంత దారుణంగా పడిపోలేదు. మితవాద మోడీ ప్రభుత్వం అనుసరించిన మతిమాలిన విధానాలే ఈ ఘోర వైఫల్యానికి కారణం. ఆర్థిక వ్యవస్థ తిరిగి నిలదొక్కుకుని సాధారణ స్థితికి రావాలంటే ప్రజల చేతిలో కొనుగోలు శక్తి పెంచాల్సిన అవసరముందని ప్రభాత్ పట్నాయక్ వంటి ప్రముఖ ఆర్థిక వేత్తలు చేసిన సూచనలను మోడీ ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వస్తున్నది. లాక్డౌన్లు, కర్ఫ్యూలతో జీవనోపాధి కోల్పోయిన వలస కార్మికులు, అసంఘటితరంగ కార్మికుల కుటుంబాలకు నెలకు 8వేలు చొప్పున మూడు నెలల పాటు నేరుగా నగదు బదిలీ గావించడం, గోదాముల్లో మూలుగుతున్న తిండిగింజలను ఉచితంగా అందజేయడం వంటి చర్యలు చేపడితే అసంఖ్యాకంగా ఉన్న కష్టజీవులకు కొంతైనా ఊరట లభించేది. దీంతోబాటు మౌలిక ప్రాజెక్టులు చేపట్టడం, అప్పుల ఊబిలో కూరుకుపోయిన చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఊతమివ్వడం వంటి చర్యలు కష్టజీవుల ఆదాయాన్ని పెంచేందుకు తోడ్పడతాయి. అప్పుడు మార్కెట్లో వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. ఇందు కోసం జీడీపీలో 2శాతం కేటాయిస్తే సరిపోతుంది.అందుకవసరమైన ధనాన్ని సమీకరించడానికి కార్పొరేట్ల ఆదాయాలపై పన్నులు అదనంగా వేయాలి. అమెరికాలో బైడెన్ ఆ విధంగానే చేసి ఆర్థిక పతనానికి బ్రేకులు వేస్తున్నాడు. ఈయూ దేశాలూ అదే బాటలో ఉన్నాయి. కానీ, మోడీ ఆ విధంగా చేయకపోగా కార్పొరేట్లకే ఇంకా దోచిపెడుతున్నాడు. ఈ క్రమంలోనే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను నెల రోజుల వ్యవధిలోనే 17సార్లు పెంచేసింది. ఒక వైపు పడిపోతున్న నిజ ఆదాయాలు, మరో వైపు ఆకాశాన్నంటుతున్న ధరలతో అసంఖ్యాక కష్టజీవుల పరిస్థితి దారుణంగా తయారైంది. దీనికితోడు మోడీ ప్రభుత్వం సామాన్యులకిచ్చే సబ్సిడీల్లో నిర్దాక్షిణ్యంగా కోత పెడుతున్నది. అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడికి దాసోహమంటున్న మోడీ ప్రభుత్వ చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత అథోగతి లోకి నెట్టడానికి తప్ప మరి దేనికీ ఉపయోగపడవు. ఇటువంటి ప్రజాకంటక ప్రభుత్వాన్ని ఎంత త్వరగా ఇంటికి సాగనంపితే దేశానికి అంత మంచిది.