Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్షద్వీప్.. పచ్చదనాన్ని రంగరించుకున్న నీలం రంగు సముద్రం. వెండి వెన్నెలకు తీసిపోని తెల్లని ఇసుక తిన్నెలు. దట్టంగా అల్లుకున్న సుగంధద్రవ్యాల గుభాళింపు. మరో పక్క స్థానిక జాలరుల సంప్రదాయ జీవనశైలి, అంతర్జాతీయస్థాయిని తలపించే పర్యాటక కేంద్రం. ఇలాంటి సున్నిత పర్యావరణ కేంద్రమైన లక్షద్వీప్‌లో అభివృద్ధి పేరుతో చిచ్చు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. పాలనాధికారి అంటే రాజ్యాంగాన్ని అమలుచేయాల్సిన వ్యక్తి. కానీ, ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీసే చట్టాలను చేయడమంటే కంచె చేనును మేయడం కాక మరేమిటి?
లక్షద్వీప్‌లో అభివృద్ధి పేరిట పాలనాధికారి ఒంటెద్దు పోకడలను ప్రజలు తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తున్నారు. ఈ పరిస్థితికి మోడీ సర్కార్‌ది, వారి కనుసన్నల్లో నడిచే పాలనాధికారిదే బాధ్యత! అభివృద్ధంటే లక్షద్వీప్‌ల స్థానిక ప్రజల జీవన స్థితిగతులను మార్చేలా ఉండాలి. కానీ, పాలనాధికారి ప్రఫుల్ కె.పటేల్ రూపొందించిన ప్రతిపాదనలు అందకు విరుద్దం. లక్షద్వీప్ దక్షిణాన ఉన్న అందమైన 36దీవుల సముదాయం. దేశంలో నీరు నీలం రంగులో కనిపించే ఏకైక బీచులు ఇక్కడే ఉన్నాయి. ఇదే ఏకైక పగడపు దీవి. దీనిని బట్టే అక్కడి పర్యావరణ, జీవావరణ ప్రత్యేకతలేమిటో అర్థం చేసుకోవచ్చు. తాజాగా రూపొందించిన లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ -2021 ప్రకారం ఈ దీవులన్నింటిలో అభివృద్ధి పేరిట హౌటళ్ళు, భవనాలు పెద్దఎత్తున నిర్మిస్తారు. వీటి కోసం ప్రజల ఆస్తులను నష్టపరిహారం చెల్లించకుండా స్వాధీనం చేసుకునే హక్కు పాలనాధికారికి ఉంటుంది. వాహనాలు అంతంత మాత్రంగా ఉండే దీవుల్లో రోడ్ల విస్తరణ అంటున్నారు. రోడ్లపక్కన ఉండే ఇండ్లను కూల్చేస్తున్నారు. సున్నితమైన పర్యావరణం కలిగిన లక్షద్వీప్‌లో మైనింగ్ కార్యక్రమాలకూ అనుమతిచ్చారు. తమ నివసించే హక్కును కాలరాస్తుంటే నిరసన తెలపకుండా ఉంటారా? నిరసన తెలిపితే ఏడాది పాటు జైలే అంటూ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్లు పేరుతో గూండా చట్టాన్ని తెచ్చారు. ప్రశాంత జీవనం అక్కడి ప్రజల సొంతం. కానీ ఇప్పుడు అభివృద్ధి పేరిట పటేల్ తెచ్చిన మార్పులపై ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. దేశంలోనే అతి తక్కువ క్రైం రేటు ఉన్న ప్రాంతం లక్షద్వీప్. అటువంటి చోట ఇటువంటి చట్టం ఎందుకు? ఖాళీగా ఉన్న జైళ్లను ప్రజలతో నింపి వీరి అజెండా అమలు చేయడానికేగా!
ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి చేపల వేట. తీరంలో జాలరులు తమ వస్తువుల పెట్టుకునేందుకు కట్టుకున్న షెడ్లను భద్రతకు ముప్పు అంటూ తొలగిస్తున్నారు. లక్షద్వీప్‌లోకి ప్రవేశించాలంటే అనుమతి తప్పనిసరి. కానీ, ప్రయివేటుకు పటేల్ ద్వారాలు తెరుస్తున్నారు. ద్వీపవాసులు భాషా, సాంస్కృతి, సరుకులు, వైద్యంతో పాటుగా ప్రతిదానికీ కేరళతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు పటేల్ కర్నాటకలోని మంగళూరుకు వెళ్లాలని హుకుం జారీచేశారు. ఇది వారి జీవనశైలిపై తీవ్ర ప్రభావం చూపడమే స్థానికులు ఆగ్రహానికి కారణం. వీటిని నిరసిస్తూ విద్యార్థులు పాలనాధికారికి ఎస్ఎంఎస్లు చేయడంతోవారి అరెస్టు చేశారు. అందుకే సేవ్ లక్షదీప్ ఉద్యమం ఊపందుకుంది.
లక్షద్వీప్‌లో 97శాతం మంది ముస్లింలే. అదే విధంగా దేశవ్యాప్తంగా జనాభా పెరుగుదల రేటు 2.2గా ఉంటే, లక్షద్వీప్‌లో 1.4మాత్రమే! ఇద్దరు పిల్లల కంటే ఎక్కువమంది సంతానం ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేదన్న ప్రతిపాదనలను ముందుకు తీసుకురావడం స్థానికంగా అధిక సంఖ్యలో ఉన్న ముస్లిం జనాభాను లక్ష్యం చేసుకోవడమే కదా! ఇక్కడ ఆవుల సంఖ్య చాలా తక్కువ! అవి కూడా ప్రభుత్వ డెయిరీల వద్ద తప్ప ప్రజల దగ్గర లేవు. అయినా బీఫ్ నిషేధం విధించారు. ఇప్పటి వరకు కఠినంగా ఉన్న అమలులో ఉన్న మధ్యనిషేదాన్ని మాత్రం ఎత్తివేశారు. దీనిని అంతర్యంమేమిటో వారే తెలియచేయాలి.
ఇప్పటిదాకా సాంప్రదాయానికి విరుద్దంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రపుల్ కే పటేల్‌ను లక్షద్వీప్‌కు పాలనాధికారిగా పంపారు. ఒక రాజకీయనేతకు ఇటువంటి కీలకబాధ్యతలు అప్పగించడమే వివాదాస్పదం. బాధ్యతలు స్వీకరించగానే కఠినంగా అమలవుతున్న కరోనా నిబంధనలను ఎత్తివేయడంతో ఒక్క కరోనా కేసు కూడా లేని లక్షద్వీప్‌లో పది శాతం కేసులు నమోదయ్యాయి. అందుకు కారణం ఎవరు? స్థానిక ప్రభుత్వ డెయిరీలను మూసివేసి గుజరాత్‌కు చెందిన అమూల్‌కు మాత్రమే పాల విక్రయానికి అనుమతిచ్చారు. దీంతో తమ ప్రాంతాన్ని గుజరాత్‌కు వలసగా మారుస్తున్నారన్న అభిప్రాయం స్థానిక ప్రజల్లో ఏర్పడింది. దీంతో ఆగకుండా ఆచార వ్యవహారాలు, భాష, సంస్కృతి, జీవనోపాధి చివరకు తినే ఆహారం విషయంలో కూడా పాలనాధికారి జోక్యం చేసుకుంటుండటంతో స్థానిక ప్రజలకు తిరగబడటం తప్ప మరోమార్గం లేకుండా పోయింది. ప్రధాన భూభాగం తమకు రక్షణగా, కష్టకాలంలో అండగా ఉంటుందన్న నమ్మకాన్ని ఈ తరహా దీవుల్లో ఉంటున్న ప్రజానీకానికి కలిగించాలి. దానికి భిన్నంగా వారిపై పెత్తనం చేసి, జీవితాలను ధ్వంసం చేసేలా ప్రవర్తించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. దేశ ప్రజలందరు లక్షద్వీప్ ప్రజలకు బాసటగా నిలవాల్సిన సమయమిది. అందుకే కేరళ అసెంబ్లీ లక్షద్వీప్‌ను రక్షించండంటూ తీర్మానం చేయాల్సి వచ్చింది. తమిళనాడు సైతం మద్దతు ప్రకటించింది. మరి, కేంద్ర సర్కారు వైఖరిలో మార్పు వస్తుందా..! లేకపోతే పర్యావరణానికి పెనుముప్పే.