Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నొప్పించక, తానొవ్వక తప్పించుకు తిరిగేవాడ్ని'' సుమతీశతకకారుడు ''ధన్యుడ''న్న సందర్భం వేరు. రెండువేల శతాబ్దంలో రెండు దశాబ్దాలు గడిచిపోయాక పాషాణ హృదయాలు పాటలతో కరుగుతాయా? మాటలు వింటాయా? బలమైన సుత్తులతో మోదకుంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు యీడేరవని ఈ ప్రభుత్వానికి ఎంత తొందరగా అర్థమైతే అంతమంచిది. నాయకత్వంలో పనివిభజన ఏరాజకీయ పార్టీలోనైనా ఉంటుంది. కాని టీఆర్ఎస్ ప్రత్యేకతేమంటే అధినాయకుడు మోడీ భజన చేస్తూ, వంగి, వంగి సలాములు చేస్తోంటే పుత్రరత్నం ''సమాఖ్య స్ఫూర్తి'' దెబ్బతింటోందని, మరోనేత జీ.యస్.టీ. బకాయిలివ్వాలంటూ చేసే తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళే బెదరవంటే క్రూరమృగాలు అదుర్తాయా? బెదుర్తాయా?
భారత రాజ్యాంగం ''రాష్ట్రాల సమాఖ్య'' (యూనియన్ ఆఫ్ స్టేట్స్) అంటున్నది. రాష్ట్రాల విధులేమిటో, కేంద్రం విధులేమిటో, ఉమ్మడి జాబితా ఏమిటో స్పష్టంగా పేర్కొంది మన రాజ్యాంగం. సరళీకృత ఆర్థిక విధానాలు రాష్ట్రాల హక్కులపై దాడిని వేగవంతం చేశాయి. కాంగ్రెస్ హయాంలోనే మొగ్గతొడిగిన ఈ నిర్వాకం, భారత రాజ్యాంగానికే వ్యతిరేకి అయిన బీజేపీ నేతృత్వంలో తీవ్రమైంది. ''రాజ్యాంగం ప్రకారం పన్నులు విధించుకోవడానికి రాష్ట్రాలకున్న అధికారాన్ని వదలుకునేలా రాష్ట్రాలను ఒప్పించుకున్న తర్వాత, అంటే అమ్మకం పన్నును వదులుకునేలా చేసిన తర్వాత జీఎస్టీ అవతరించింది. రాష్ట్రాల ఆదాయం తక్కువ పడితే దాన్ని పూడుస్తామన్న వాగ్దానం నేడు ఏరకంగా గాలికి పోయిందో చూస్తున్నాం.'' 2017 జులై ఒకటిన జీఎస్టీకి ఎదురేగి చప్పట్లు కొట్టి ఇప్పుడు రూ.900కోట్లు ఐజీఎస్టీ బకాయిలు ఇవ్వాలని వగస్తే ఏమి ఉపయోగం? దానిపైనా అధినేత నోరిప్పకుండా ఛోటా నేతలు అభ్యర్థిస్తే సాధ్యమయ్యేనా?
రాష్ట్రాల హక్కులపై బీజేపీ దండయాత్ర వనరుల హస్తగతంతో ఆగలేదు. ఉమ్మడి జాబితాలోని విద్యపై, విద్యుత్‌పై పడింది. రాష్ట్రాలతో ఏవిధమైన చర్చలేకుండా ఆమోదించిన నూతన విద్యావిధానం, విద్యుత్ సవరణబిల్లుల ప్రమాదాన్ని అసలు కేసీఆర్ సర్కార్ గుర్తించిందా? రాష్ట్రాల జాబితాలోది ''వ్యవసాయం''. రాష్ట్రాలతో ఏ చర్చా లేకుండా మూడు వ్యవసాయ బిల్లులను, అన్ని పార్లమెంటరీ సాంప్రదాయాలనూ కాలరాస్తూ చట్టాలుగా రూపొందించింది బీజేపీ. 2020 డిసెంబర్ 8న జరిగిన భారత్‌బంద్‌లో సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొన్న అధినేత ఢిల్లీ ధ్వయంతో భేటీ తర్వాత యూటర్న్ ఎందుకు తీసుకున్నారో ఆ లోగుట్టు ''పెరుమాళ్ల''కే ఎరుక! ఇది రైతాంగానికి సమస్య తేవడంతో పాటు రాష్ట్రాల హక్కులపై దాడి కూడా!
జమ్మూ, కాశ్మీర్లో గవర్నర్ పాలనలో ఉంది కాబట్టి ఆ తన స్వంత మనిషితో 'ఊ'' అనిపించి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టి పడేసిన బీజేపీపై పల్లెత్తు మాట అనడానికి సాహసించకపోతే రేపు ఆసూత్రం ఏ రాష్ట్రానికైనా వర్తింపచేసే ప్రమాదం లేదని కేసీఆర్ సాబ్ భావిస్తున్నాడా? ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ అంటే రాష్ట్ర ప్రభుత్వమేనన్న సవరణ చేశారు. 70మంది సభ్యులున్న అసెంబ్లీ, ఆ రాష్ట్ర మంత్రివర్గం చేసే నిర్ణయాలను కాలరాసే ఎన్సీఆర్ చట్ట సవరణ ప్రమాదాన్ని కేసీఆర్ గుర్తించారా? చిన్న రాష్ట్రాలు, బలమైన కేంద్రం బీజేపీకి ప్రియతమమైనది. నేడు కార్పొరేట్ శక్తులకు అవసరమయినది కూడా అదే! హిందూత్వ - కార్పొరేట్ పాలన నిర్విఘ్నంగా సాగించే ప్రయత్నంలో బీజేపీ ఉంది. ఈ విషయం కేసీఆర్ అర్థం చేసుకుంటున్నారా?
తమది రైతుల ప్రభుత్వమని, కేంద్రం కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఉత్పత్తులన్నీ కొంటామని కేసీఆర్ ఘనంగా ప్రకటించారానాడు. నేడు ధాన్యం రైతులు, కందిరైతులంతా పడుతున్న తిప్పలు, చేస్తున్న ఆర్తనాదాలు నిత్యం పత్రికల్లో కనపడుతూనే ఉన్నాయి. పంజాబ్ కంటే ఎక్కువ ధాన్యం పండించామని చెప్పే ముఖ్యమంత్రి గోనెసంచులు లేక, సమయానికి కాంటా వేసేవాళ్ళు లేక, ఆ బస్తాల నిల్వకు అవసరమైన గిడ్డంగులు లేక రైతులు పడుతున్న అవస్థలు గమనిస్తున్నారా? నాడు అకాల వర్షాలు, నేడు సకాల వర్షాల దెబ్బకు రైతుల గోస చూసి చెమర్చని కండ్లు లేవు మన రాష్ట్రంలో. ''పంజాబ్‌లో ధాన్యమంతా కొని, మా దగ్గరెందుకు కొనర''ని ప్రశ్నించడానికి కేసీఆర్‌కు మనసెలా వచ్చిందో అర్థంకాదు. గత ఏడు నెలలుగా ఢిల్లీలో పోరాడుతున్న పంజాబ్ రైతులను చూసి కూడా ఆ ప్రశ్న ఎలా వేయగలిగారు? వాళ్ళు పోరాడారు. సాధించుకున్నారు.
ప్రపంచానికంతా టీకాలు సప్లయి చేసే తెలంగాణకు (అది అతిశయోక్తి అలంకారానికి పరాకాష్టే అయినా) టీకాలు లేవని పుత్రరత్నం సుతిమెత్తటి ప్రకటన ఇస్తే ఉపయోగమేంటి? అందరం కలిసి కేంద్రంపై పోరాడుదాం అన్న కేరళ, ఢిల్లీ, పంజాబ్, జార్ఖండ్‌తో గొంతు కలపనంత కాలం రాష్ట్రానికి టీకాలు దక్కవు.
తెలంగాణ అభివృద్ధి అంటే యావత్ తెలంగాణ సమాజాభివృద్ధి. నాలుగు కోట్ల ప్రజల అభివృద్ధి. అంటే కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, వివిధ వృత్తులు చేసుకునే వారి అభివృధ్ధి. దానికి ప్రధాన అడ్డంకి నేటి కేంద్రంలోని బీజేపీ పాలన. ''ఈ రోజు స్టీల్ ప్లాంట్, రేపు మా సింగరేణా'' అనే గర్జన సైతం రాజకీయ ఎత్తుగడగా మిగలరాదు. అందుకే నక్కజిత్తుల నాగన్నతో జర పైలం!