Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశం మహమ్మారి ధాటికి విలవిలలాడుతుంటే ఎన్నికలు, కుంభమేళాలంటూ ఊరేగిన ప్రధాని మొత్తానికి స్పందించారు. కరోనా నియంత్రణలో ఆయన వైఫల్యాలను అంతర్జాతీయ మీడియా ఎండగడుతోంటే, ప్రపంచ వ్యాపితంగా పలువురు ప్రముఖులు, నిపుణులు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంటే ఇన్నాళ్లూ ముఖం చాటేసిన ''మహానేత'' ఎట్టకేలకు టీవీ తెరలపై తిరిగి ప్రత్యక్షమయ్యారు. సోమవారం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. ఇకపై వ్యాక్సినేషన్ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అని ప్రకటించారు. ఆలస్యంగా వెలువడినా ఈ ప్రకటన ఆహ్వానించదగిన పరిణామం. 18ఏండ్లు పైబడిన వారందరికీ ఉచిత టీకా విధానం ఈ నెల 21 నుంచి అమలులోకి వస్తుందని సెలవిచ్చారు. ఇది ముమ్మాటికీ స్వాగతించాల్సిన అంశమే. కాకపోతే ఇందులో ఇప్పటికైనా జరిగిన పొరపాట్లను సరిచేసుకుని ప్రజల ప్రాణాలను కాపాడుకోవాలన్న చిత్తశుద్ది కంటే పోయిన ప్రతిష్టను తిరిగి పొందాలన్న తాపత్రయమే కనిపిస్తుండటం విచారకరం. ఆయన మాటల్లో ఆత్మవిమర్శ అస్సలు లేకపోగా ఆరోపణలూ అసత్యాలూ అర్థసత్యాలే చోటు చేసుకోవడం ఇందుకు నిదర్శనం.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. రాష్ట్రాలు కోరినందునే టీకాల బాధ్యతను వాటికి అప్పగించామనీ, ఇప్పుడవి వైఫల్యం చెందినందునే కేంద్రం తిరిగి బాధ్యత తీసుకుంటుందని చెప్పడం పచ్చి అబద్ధం. ఒక విధానమంటూ లేకుండా పూటకో తీరున వ్యవహరించిన కేంద్రం, ఇప్పుడా వైఫల్యాలను రాష్ట్రాలకు అంటగట్టడం రాజకీయ అవకాశవాదం. ఒకవేళ ప్రధాని చెప్పిందే నిజమైతే ఈ విషయాన్ని టీకా విధానాన్ని ప్రకటించేటప్పుడు ఎందుకు ప్రస్తావించలేదు? కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్లో ఎందుకు పేర్కొనలేదు? కేవలం రాష్ట్రాల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఆడుతున్న నాటకమిది! తానేం చెప్పినా ప్రజలు నమ్ముతారన్న అహంకారమిది!!
దేశంలో కరోనా ముప్పు తొలగిపోలేదనీ, నిరంతరం రూపం మార్చుకుంటున్న ఈ వైరస్ దాడికి వ్యాక్సిన్మాత్రమే రక్షణ కవచమనీ ప్రధాని ప్రవచించారు. అందుకే ఒకటి కాదు, రెండు వ్యాక్సిన్లు తయారు చేసామని జబ్బలు చరుచుకున్నారు. నిజమే! కానీ ఆ వ్యాక్సిన్లకు కొరత ఎందుకు ఏర్పడిందో మాత్రం చెప్పలేకపోయారు. దేశీయ అవసరాలనే తీర్చలేని దశలో విదేశాల ఎగుమతికి ఎందుకు అనుమతించారో చెప్పలేకపోయారు. దేశంలో యాభైకి పైగా కంపెనీలు ఉత్పత్తికి సిద్ధంగా ఉండగా కేవలం రెండు కంపెనీలకే గుత్తాధిపత్యం ఎందుకు కట్టబెట్టారో చెప్పలేకపోయారు. వ్యాక్సిన్ ఉత్పత్తికి వేలకోట్ల రూపాయలు ధారపోసామని ఉదారంగా చెప్పుకొచ్చిన ప్రధాని అవి ఎన్నివేల కోట్లో స్పష్టం చేయలేకపోయారు. బడ్జెట్లో వ్యాక్సిన్ కోసం కేటాయించింది 35వేల కోట్లు. ఖర్చు చేసింది ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా ఐదారువేల కోట్లకు మించదు. కనీసం కేటాయించిన మొత్తంలో సగం ఖర్చుచేసినా, సామర్థ్యం కలిగిన ప్రభుత్వ సంస్థలకు ఉత్పత్తి బాధ్యతలప్పగించినా ఈ టీకా కొరత ఉండేది కాదు కదా? ప్రధానికి ఆదర్శప్రాయులైన అమెరికా, బ్రిటన్ వంటి దేశాధినేతలంతా 2020లో పరిశోధనాదశలోనే వేల కోట్ల డాలర్లు చెల్లించి తమ అవసరాలకు మించి కోట్లాది డోసులకు ఆర్డర్స్ పెట్టి బుక్ చేసుకుంటే, మన ప్రభుత్వానికి 2021 జనవరి దాటేదాకా ఆ సోయి ఎందుకు లేదో ప్రధాని ఎరిగించలేకపోయారు!
ఈ వివరాలన్నీ తెలివిగా దాటవేసిన ప్రధాని, దేశంలో 23వేల కోట్ల డోసుల టీకాలు వేశామని గొప్పలు పోయారు. ఇందులో రెండు డోసులు అందినవారి సంఖ్య కేవలం 5కోట్ల లోపేనన్న సంగతి దాచిపెట్టారు. జనాభాలో 70శాతం ప్రజలకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తియితే తప్ప ఈ మహమ్మారి మూడవ దశను నియంత్రిచలేమన్నది నిపుణుల మాట. ఈ లెక్కన ఈ లక్ష్యం ఎప్పటికి పూర్తి కావాలి? ప్రధాని మాటల్లో సంవత్సరాంతానికి పూర్తిచేస్తామన్న ఉజ్జాయింపు ధోరణే తప్ప నిర్దిష్టత లేదు. అంతే కాదు, వ్యాక్సిన్ ఉత్పత్తి మొదలు, సమీకరణ, పంపిణీ వరకు ఈ టీకా విధానంలో, వాటి ధరల్లో ఇప్పటి వరకూ నెలకొన్న అసంబద్ధత, అహేతుకత, అసమానతలకు వేటికీ ఆయన సమాధానం చెప్పలేకపోయారు.
పైగా మెడికల్ ఆక్సిజన్‌కు ఇంత తీవ్రమైన కొరత ఏర్పడుతుందని ఊహించలేకపోయామనీ, అయినప్పటికీ ప్రపంచంలో ఎక్కడ దొరికితే అక్కడ నుంచి ఆక్సిజన్ నిలువలను దేశానికి తరలించామని భుజాలు చరుచుకున్నారు. భారత పార్లమెంటరీ స్టాడింగ్ కమిటీ ఈ విషయమై 2020 నవంబర్లోనే హెచ్చరించింది కదా! రెండవ అల ప్రమాదం పొంచివుంది, దేశంలోని ఆక్సిజన్ నిల్వలు సరిపోవు, తక్షణమే అందుకవరసమైన ఫ్లాంట్ల ఏర్పాటుకు పూనుకోవాలని స్టాడింగ్ కమిటీతోపాటు అనేక మంది శాస్త్రవేత్తలు చేసిన ముందస్తు సూచనలన్నిటినీ తుంగలోతొక్కి, తీరా ప్రమాదం ముంచుకొచ్చాక ఆక్సిజన్ కోసం ప్రపంచం ముందు నిస్సహయంగా నిలబడి దేబిరించి, ప్రపంచ నలుమూలల నుంచి సమీకరించామని చెప్పుకోవడాన్ని ఏమనాలి? ఈ నిర్లక్ష్యానికి బలైన లక్షలాది ప్రాణాలకు మూల్యం ఎవరు చెల్లించాలి? చేసిన తప్పులను అంగీకరించలేని ఈ పిరికితనం దేశానికి రక్షణెలా ఇస్తుంది?
రాజకీయపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, న్యాయస్థానాలు ఎంతగా ప్రశ్నించినా, ప్రపంచమీడియా ఎంత నిందించినా చలించని ప్రధాని ఉన్నట్టుండి టీవీల్లో ప్రత్యక్షమై ఇకపై ఉచిత వ్యాక్సినేషన్ కేంద్రం బాధ్యత అని ప్రకటించడం దిగజారుతున్న ప్రతిష్టను కాపాడుకోవడానికా? లేక ప్రజల ప్రాణాలనురక్షించడానికా? సోమవారం వ్యాక్సినేషన్ కేంద్రం బాధ్యత అని ప్రకటించారో లేదో మంగళవారం కొత్త మెలిక పెడుతూ టీకా పంపిణీపై సరికొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. అందువలన ఏలినవారి నిజాయితీని ఆచరణలో తేల్చుకోవాల్సిందే..