Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూమి మాయమవుతున్నది ఓరన్నా
రైతు మాయమవుతున్నాడు
పరిశ్రమల పేరిట
ఫ్యాక్టరీల పేరిట
ఆధునికత పేరిట
అభివృద్ధి పేరిట
పొలము గుండె తొలుచుకుని
పొగగొట్టాలొస్తున్నా
పంటచేల కంఠాలకు
ఉరితాళ్లే పడుతున్నా
నేల నిఘుంటువులోనా
గతకాలం వైభవంలా
రైతు అనే పదం నిక్షిప్తం అవుతున్నదిఃః
అంటూ వందేమాతరం శ్రీనివాస్ పాడిన ఈ పాట ప్రస్తుత వ్వవసాయ పరిస్థితులకు అద్దంపడుతున్నది. నిజాలను నిగ్గు తేలుస్తున్నది. ఈ పాట సారాంశం భూమి, రైతులే. రాష్ట్రంలో ఒకవైపు వ్యవసాయభూమి అంతా రియల్స్టేట్గా మారుతుంటే, మరోవైపు రెండు కోట్ల మాగాణం సాగులోకొచ్చిందనీ, మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ఆహారాధాన్యాలు ఉత్పత్తవుతున్నాయని పదే పదే గులాబీ సర్కారు బట్టీపట్టి మరీ చెబుతున్నది. కాగా 50 లక్షల ఎకరాల్లో సాగు దిగుబడి 1.5 కోట్ల మెట్రిక్ టన్నులేననేది రైతు సంఘాల మాట. దేని ఆధారంగా సర్కారు ఆ ప్రకటన చేసింది? వ్యవసాయం ఊహలమీద నడుస్తున్నదా ?
ఇప్పుడు వానాకాలం సీజన్ ఆరంభమైంది. ముందస్తుగానే తొలకరి రాష్ట్రాన్ని పలకరించింది. రైతులు మురుస్తూ దుక్కుల చదనుకు సిద్ధమవుతున్నారు. ఎప్పటిలాగే పుట్టెడు సమస్యలతో బీళ్లను తడుపుకుంటున్నారు. కానీ, రాష్ట్రానికి ఇప్పటివరకు వానాకాలపు వ్యవసాయ ప్రణాళికనే ప్రభుత్వం తయారుచేయలేదు. రుణాల ఆలోచనే లేదు. కానీ దేశంలోనే ఎక్కడాలేనివిధంగా 75 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేయబోతున్నట్టు మాత్రం సాక్ష్యాత్తు ముఖ్యమంత్రే ప్రకటించారు. నిజంగా అలా జరగాలంటే 450 గ్రాముల పత్తి ప్యాకెట్లు 2 కోట్లు కావాలి. ఉన్నాయా ?
వానాకాలం ప్రారంభమైంది మొదలు రాష్ట్రాన్ని కల్తీ విత్తనాలతో దళారులు అతలాకుతలం చేస్తున్నారు. వారి గురించి పట్టింపు ఏమైనా ఉందా ? ఆసిఫాబాద్, యాదాద్రి జిల్లాల్లో ఇటీవల భారీగానే కల్తీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. అలాగే 16 లక్షల విలువైన మిరప విత్తనాలూ దొరికాయి. పాలకూర నుంచి పత్తి దాకా అన్ని రకాల కల్తీ విత్తనాలతో రైతులను మోసం చేస్తున్నారు. ప్రశ్నిస్తే అక్రమార్కులపై పిడి యాక్ట్ పెడతామని గంభీరపు ప్రకటనలు చేస్తారు. గతేడాది పెట్టిన 220 కేసులు సంగతేంటి ? విచారణ పూర్తయి ఏవరికైనా శిక్షలు పడ్డాయా ? ఎంత మంది లైసెన్స్లు రద్దు చేశారు ? అలాగే రాష్ట్రంలో విత్తనాల కొరతను సదవకాశంగా తీసుకుని రైతులను నట్టేట ముంచుతుండగా, మరోవైపు సర్కారు మాత్రం నాణ్యమైన విత్తనాలను విదేశాలకు ఎగుమతి చేయడం ఆశ్చర్యమూ, ఆందోళనా కలిగిస్తున్నది. టీకాల మాదిరే ఇదీనూ. తత్ఫలితంగా పెట్టిన పెట్టుబడి ఎల్లక రైతులు ఆత్మహత్యలవైపు మళ్లుతున్నారు. వ్యవసాయం నడవాలంటే విత్తనాలు, ఎరువులు, రుణాలు, సబ్సిడీలు తప్పనిసరి అనే సంగతి సర్కారుకు తెలియదా ?
విత్తు విత్తిన నాటి నుంచి పంట చేతికొచ్చేదాకా రైతులు అనేక సాగు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆరుగాలం కష్టపడ్డా అకాలవర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు మట్టిమనిషిని వేధిస్తూనే ఉంటాయి. సాధారణ వాస్తవ సాగు పెట్టుబడి వరికి ఎకరాకు రూ. 35 వేలు, మొక్కజొన్నకు 30 వేలు, సోయాకు 21 వేలు, పత్తికి 36500, మిర్చికి 2.21 లక్షలు, వేరుశెనగ 32600 కావాలి. కానీ సర్కారు రైతుబంధు పేర ఇచ్చేది ఉత్త ఐదు వేలే.
అదీ కూడా 60 లక్షల మంది రైతులకుగాను 45 లక్షలమందికే ఇస్తున్నారు. మిగతా 15 లక్షల మంది(కౌలు రైతులు)కి పాసుబుక్కులు లేవనే సాకుతో తిరస్కరిస్తున్నారు. యాసంగి, వానాకాలంలో విత్తన సబ్సిడీల కోసం కేవలం రూ. 110 కోట్లతోనే సర్కారు సరిపెడుతున్నది. నిజానికి రాష్ట్రంలో 80 శాతంగా ఉన్న సన్న, చిన్న కారు రైతులకు విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గతేడాది రైతులు రాష్ట్రవ్యాప్తంగా రూ. 25 వేల కోట్ల మేర ప్రయివేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
మూలిగే నక్కపై తాటికాయపడ్డట్టు అసలే అష్టకష్టాల్లో ఉన్న రైతులపై ఏటా ప్రకృతి వైపరీత్యాల దాడి సాధారణమైంది. 2014 నుంచి 2021 వరకు ఈ తరహా నష్టాలు రూ.25 వేల కోట్లు కాగా, సర్కారు పరిహారంగా ఇచ్చింది రూ. 2500 కోట్లే. అందుకే కేరళ తరహాలో పంటలకు కనీస మద్దతు ధరల నిర్ణాయక కమిటీలను రాష్ట్రంలోనూ నియమించాలి. అక్కడ 16 రకాల పంటలకు మద్దతు ధరలను వామపక్ష ప్రభుత్వం అమలుచేస్తున్నది. మన రాష్ట్రంలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రాతిపదికన రుణాలివ్వాలి. దాన్నీ మరిచింది గులాబీ సర్కారు. రైతులకు చేస్తానన్న రూ. 25 వేల రుణ మాఫీ సైతం అంతంతే. 35 లక్షల మందికే ఇచ్చి, మిగతా 20 లక్షల మందికి ఎగ్గొట్టడం అన్యాయమే ? భూసార పరీక్షల సంగతి పక్కనబెడితే, ఇప్పటికీ అసలు వ్యవసాయ ప్రణాళిక సిద్ధం చేయకపోవడం ఆశ్చర్యం. అశేష రైతుల ప్రయోజనాలే పరమావధిగా సర్కారు నడవాలి. పత్రికా ప్రకటనలకే పరిమితం కాకుండా వాటికి ప్రాణం పోయాలి. అదే నేటి కర్తవ్యం.