Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఆకాశంలో సగం.. అవనిలో సగం..'' వినడానికి బానే ఉంది. కానీ లింగ వివక్షతతో మహిళల సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోతుంది. మన దేశంలోనూ స్త్రీ, పురుష లింగ నిష్పత్తి దారుణంగా పడిపోతోంది. మగ శిశువులతో పోల్చితే ఆడ శిశువుల జననం దిగజారడం ఆందోళన కలిగించే అంశం. శాస్త్ర విజ్ఞాన స్పృహ, సాంకేతిక పరిజ్ఞానం మానవాళి ప్రగతికే కాకుండా దుర్గతికి కూడా దోహదపడతాయని జననాల రేటు, లింగ నిష్పత్తి రెండూ తగ్గడం స్పష్టంచేస్తుంది.
'పసికందుల్ని ఉన్నపళంగా చిదిమేస్తున్నారు. పుట్టేది ఆడపిల్ల అని ముందే తెలిస్తే, మరీ కర్కశంగా వ్యవహరిస్తున్నారు. కడుపులోని ఆ పిండాన్ని అక్కడికక్కడే కరిగించేస్తున్నారు. ఇలా భ్రూణ హత్యలు ఇంకా ఎంతకాలం? వాటికి అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?' అని సర్వోన్నత న్యాయస్థానం పలు సందర్భాల్లో ప్రశ్నించింది. దేశంలో ఆడ శిశువుల సంఖ్య తగ్గిపోతోంది. దానికి కారణం లింగ విచక్షణ లేకపోవడమేననీ, ఎన్నో చిరు ప్రాణాలు తల్లిగర్భంలోనే అంతరిస్తున్నాయని 'ఎయిమ్స్' వివిధ అధ్యయనాలలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 'నస్త్రీ స్వాతంత్య్రమర్హతి!' అనే సైద్ధాంతిక వరవడిలో సాగే పాలనలో నేడు దేశం ఉన్నది. స్త్రీకి అడుగడుగుగా ఆంక్షలు విధించే పాలకుల పాలనలో పూజించడం మాట అటుంచి కనీస గౌరవానికి కూడా వారు నోచుకోవడం లేదు. మతం ప్రతిపదికన పాలించే ప్రభువుల ఎలుబడిలో రాతియుగమే నయమనిపించేలా ఉంది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, చెత్తకుప్పలు, మురుగు కాల్వల్లో బయటపడుతున్న మృతపిండాలు గర్భవిచ్ఛిత్తి పర్యవసానాల్ని కళ్లకు కడుతూనే ఉన్నాయి. ఎన్నో ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్న ఇలాంటి హత్యోదంతాలు మానవతనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రభుత్వాల పని వాటన్నింటినీ చేష్టలుడిగి చూస్తుండటమేనా అన్నది జవాబు లేని ప్రశ్న. ఆఖరికి 'గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన ప్రకటనల నియంత్రణ'లోనూ ప్రభుత్వాలది ఘోర వైఫల్యం కాక మరేమిటి? ప్రజలను చైతన్యం చేయాల్సిన పాలకులు ప్రజలను మూఢత్వంలోకి నెడుతున్నారు. దాని పర్యవసానమే నేటి ఈ పరిస్థితికి కారణం.
దేశంలో ఒక్క ఏడాదిలోనే 1.56 కోట్లకు పైగా గర్భస్రావాలు చోటుచేసుకున్నాయని 'లాన్సెట్ గ్లోబల్ హెల్త్ మెడికల్ జర్నల్' నిర్వహించిన సర్వే నిగ్గుతేల్చింది. భూమిమీదకు రాకుండానే పసి నలుసులు అలా అంతరించడానికి వైద్య, సామాజిక అంశాల్నీ లాన్సెట్ విశ్లేషించింది. కారణాలేవైనా, ప్రతి ముగ్గురు గర్భవతుల్లోనూ ఒకరికి గర్భవిచ్ఛిత్తి జరుగుతోంది. దేశంలో అబార్షన్ల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇండియాలో గర్భస్రావాలు పలు రెట్లు పెరిగాయి. భారత ప్రభుత్వ లెక్కల్లో వార్షిక అబార్షన్ల సంఖ్య ఏడు లక్షలకు మించకున్నా, వాస్తవాలు వేరుగా ఉన్నాయి. నిటి ఆయోగ్ విడుదల చేసిన ఎస్డీజీ నివేదిక ప్రకారం దేశ సగటు లింగ నిష్పత్తి 899తో పోలిస్తే మన రాష్ట్ర నిష్పత్తి 840గా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో లింగ నిష్పత్తి 958తో ముందంజలో ఉంది. ఇది జాతీయ సగటు కన్నా అధికంగా ఉండటం విశేషం. కేరళ లింగ నిష్పత్తి 957తో రెండో స్థానంలో ఉంది. గతంలో లింగ నిష్పత్తిలో వెనుకబడ్డ పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలు మెరుగుపడ్డాయి. నిటి ఆయోగ్ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సూచీల నివేదికలోనూ ఈ విషయం తేటతెల్లమైంది.
పరిమిత కుటుంబ స్పృహ పెరగడంతో పాటు పుట్టేవారు ఆడో, మగో పిండ దశలోనే తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం స్త్రీ శిశువులను గర్భంలోనే కడతేర్చే దుర్మార్గానికి తెర లేపింది. పర్యవసానంగా మహిళల జననాలు తగ్గుముఖం పడుతున్నాయి. పలు ప్రయివేటు కేంద్రాల్లో కొనసాగుతున్న లింగ నిర్ధారణ పరీక్షల అక్రమాలకు అడ్డుకట్టవేయడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయి. గప్‌చుప్‌గా సాగే 'ప్రయివేట్ స్కానింగ్' పలు నిర్ధారణ, పరీక్ష కేంద్రాల తీరుతెన్నులపై ప్రభుత్వాలకు ఎటువంటి నియంత్రణా లేకపోవడం వల్లనే, విచ్ఛిన్నకర పోకడలు ప్రబలుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలూ గర్భవిచ్ఛిత్తి ఔషధ మాయల గుట్టును రట్టు చేయడంపై ప్రధానంగా దృష్టి సారించాలి. స్కానింగ్ ద్వారా లింగ నిర్ధారణ చేస్తే, మూడేళ్ల జైలుశిక్ష విధిస్తారని చట్టంలో ఉన్నా, శిక్ష పడిన సందర్భాల్ని రెండు రాష్ట్రాల్లోనూ వేళ్లమీద లెక్కించవచ్చు. అక్రమాలకు పాల్పడిన కేంద్రాల్లో అధికార బందాలు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలు, మెరుపు దాడులు దాదాపు శూన్యం. ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినప్పుడే పసి ప్రాణాలు నిలబడతాయి. ఒక్క ఏడాదిలో 350 అబార్షన్లకు పాల్పడినట్లు తనంత తానుగా పోలీసుల ఎదుట అంగీకరించాడో వైద్యప్రబుద్ధుడు! ఇలాంటి వెలుగు చూడని ఘటనలు దేశంలో ఎన్నో. పర్యావరణ సమతుల్యత లేక జీవావరణం విధ్వంసానికి గురవుతుందో అదేవిధంగా లింగ సమతుల్యత దెబ్బతింటే సమాజాభివృద్ధి అంత విధ్వంసానికి గురవుతుంది. అందుకే లింగ అసమానతలను తొలగించాలి. 'పుట్టే ప్రతి బిడ్డకూ బతికే హక్కు' ఉంది. దాని పరిరక్షణ బాధ్యత ముమ్మాటికీ ప్రభుత్వాలదే!
''అబలా కోమలి సుకుమారి అని బంధించారా నిన్ను..
కట్లు తెంచుకొని, గట్లు దాటుకొని రావాలమ్మా నువ్వు!
పోరాడాలమ్మా నువ్వు!''