Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నా రాజ్యము రత్న ఖనియె, నా రాష్ట్రము నన్న పూర్ణనందనవనమే! నా రైతులు వెన్నుముకయె, నా రేగడి మన్నుయందు నాగజెముడులే! ఉన్నవి దోసెడు బియ్యము, యెన్నో చేతుల వెతలను నెటులిక తీర్చున్, మిన్నగునాకలి కడుపులు, అన్నంబో రామచంద్ర! యనియల్లాడన్'' అంటూ శిష్లా తమ్మిరాజుగారు ఆకలి దృశ్యాలను అక్షరబద్ధం చేశారు. ఆకలి, అన్యాయం అనేవి ఈ ప్రపంచంలోని సమాజాల దుష్టత్వానికి నిదర్శనం. ఆకలి మనుషుల్ని ఎంతకయినా తెగింపజేస్తుంది. శరీరాన్నే కాదు మనసుల్ని తొలిచివేస్తుంది. నిలువునా దహించివేస్తుంది.
చాలా భయంగా ఉంది. తలచుకుంటేనే హృదయం తల్లడిల్లుతోంది. ఇలా చూస్తామని, చూస్తూనే ఇలా జరుగుతూంటుందని అనుకున్నామా! ఒక సంవత్సర కాలంగా ప్రకృతి వైపరీత్యమనీ, దీనిని ఎలా ఎదుర్కోవాలో ఎవరికీ తెలియదని అనుకుంటూ ఉన్నాము. కానీ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మన చేతలే, మన విధానాలే ఈ దారుణాలకు దారితీస్తున్నాయని స్పష్టంగానే తెలుస్తున్నది. మొన్న కర్నాటకలో తల్లీదండ్రీతో పాటు వాళ్ళ ముగ్గురు పిల్లలు ఆకలి భరించలేక ఆత్మహత్య చేసుకున్నారనే సంఘటన ప్రతి గుండెనూ కలిచివేస్తుంది. ఈ దేశంలో ఆకలి మరణాలేమీ కొత్తకాదు. కానీ కరోనా విపత్తు కారణంగా విధించిన లాక్డౌన్వల్ల, పనులు దొరకక పోవటం వల్ల, పట్టణాల్లో అసంఘటితంగా ఉన్న కార్మికులు ఆదాయాల లేమితో, ఆదరణ కరువై ఆకలిని ఎలా జయించాలో తెలియక, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక తమను తామే చంపుకోవడం చాలా బాధాకరమైన విషయం.
కరోనా రెండవ ఉధృతి కారణంగా ప్రాణనష్టం పెరగటంతో పాటు ఉపాధి కోల్పోయి తీవ్రమైన దారిద్య్రంలోకి నెట్టివేయబడ్డవారు పెరిగారు. వలస కార్మికులుగా ఉన్నవారు, స్థిర నివాసం లేక ప్రభుత్వ రేషను సౌకర్యాలు అందక ఆకలికి గురవుతున్నవారు లక్షల్లో ఉన్నారు. గత సంవత్సరంలోనయినా లాక్డౌన్ సందర్భంగా పేదలకు, వలస కూలీలను, ఉపాధి కోల్పోయిన వారికి అంతో ఇంతో సహాయం చేసే ప్రయత్నం కొసాగినప్పటికీ ఈసారి ఆదుకోవాలన్న ధ్యాసే లేకుండా పోయింది. కేంద్రం లాక్డౌన్ ప్రకటించకపోయినా, అనేక రాష్ట్రాలు కరోనా ఉధృతిని తట్టుకోలేక లాక్డౌన్లు ఎక్కడికక్కడ ప్రకటిస్తూ అమలు చేస్తున్నారు. కానీ మరి ఉపాధి కోల్పోయేవారి కోసం ఎవరూ ఆలోచించటం లేదు. ఈ సంవత్సరం మార్చి, ఏప్రిల్, మే నెలలోనే కోటిమంది ఉపాధి ఉద్యోగాలు కోల్పోయారని కొందరు పేర్కొంటున్నారు. కానీ అది ఇంకా ఎక్కువ సంఖ్యలోనే ఉంటుంది. ఈ సంవత్సరం కరోనాతో పాటుగా అనేక కొత్త రోగాలు దాని మూలంగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆక్సిజన్, మందులు, వైద్యమూ ప్రభుత్వాలు అందించలేని స్థితిలో, మధ్య తరగతి ప్రజలు ఇల్లూ పొల్లూ అమ్ముకుని ప్రాణాలు కాపాడుకోవటం కోసం అన్ని ఆదరువులకూ కోల్పోయారు. దారిద్య్రంలో మ్రగ్గుతున్నారు.
కరోనాను ఎదుర్కోవడానికి, రోగనిరోదక శక్తిని పెంచుకోవాలని, ఆ శక్తిని పెంచుకోగలిగితేనే బతికి బట్టకట్టగలమని ఓవైపు వైద్యులు చెపుతున్నప్పటికీ, మరోవైపు కోట్లాది సామాన్య ప్రజల ఆహార ధాన్యాల వినియోగం సగానికి పడిపోయిందని, పౌష్టికాహారం ప్రక్కనపెట్టి కనీస ఆహారమూ పొందలేని స్థితిలోకి ప్రజలు నెట్టివేయబడ్డారని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అన్ని రాష్ట్రాలలో ఆహార లేమితో బాధపడుతున్నవారు రోజు రోజుకూ పెరుగుతున్నారు. గతంలో ప్రపంచీకరణ, పెట్టుబడిదారీ దోపిడీ, యుద్ధాలు మొదలైన వాటితో పేదరికం పెరిగేది. కరోనా వచ్చిన తర్వాత సంత్సరంలోనే నాలుగు కోట్ల మంది పేదరికంలోకి నెట్టివేయబడ్డారు. ఈ సంవత్సరాంతానికి మరో నాలుగు కోట్లకు పెరుగుతారని ఒక అంచనా. గ్రామీణ ప్రాంతాలలోని పిల్లలు, మహిళలు తీవ్రమైన ఆకలితో బతుకులీడుస్తున్నారని తెలుస్తున్నది. మన ప్రధాని నియోజకవర్గమైన వారణాసిలోని గ్రామీణ ప్రాంతంలో పిల్లలు గడ్డితిని కడుపు నింపుకుంటున్న ఫొటోలు ఈ మధ్య సోషల్మీడియాలో వెలుగు చూశాయి. కరోనా ఆరంభ కాలంలో కూడా ఉత్తరభారతంలో రైల్వేస్టేషన్లో ఆకలితో కాగితాల్ని తింటున్న దృశ్యామూ కనపడింది. ఇవన్నీ గుండె తరుక్కుపోయే సంఘటనలు. గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది ఒకపూటతిని, రెండో పూట నీళ్ళతో కడుపు నింపుకుంటూ బతుకుతున్నారు. ఇప్పుడు దేశంలో వేలాది మందిని బలి తీసుకుంటున్న కరోనా మరణాలకంటే అధికంగా ఆకలి, పేదరికంతో అసువులుబాసే వారుంటారని సామాజిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రకృతివల్లనే ఈ వైపరీత్యాలూ, ఇక్కట్లు, దు:ఖాలు వస్తున్నాయని చెప్పి పాలకులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొన్ని లక్షల టన్నుల ధాన్యం గోదాముల్లో మూలుగుతూ ఎలుకలు, పందికొక్కుల పాలవుతున్నది. ఆకలవుతున్న వాడికి అందించాలన్న కనీస బాధ్యతను మరచిన ప్రభుత్వాలు పెట్టుబడి వ్యవస్థకే కాపలాగా పనిచేస్తున్నాయి. 'చావును పోషించే ఈ నేలను కూల్చాలి, కొత్తలోకం, కొత్త మనిషిని తయారు చేయాలి' అని మఖ్ధూం అన్నట్టు ఆకలిని తీర్చేది పోరాటమొక్కటే. ఆత్మహత్యలు కావు.