Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుందేళ్ళు (వేట) కుక్కల్ని తరిమిన చోట విజయనగర సామ్రాజ్యం వెలిసిందని విద్యారణ్యస్వామి చెప్పాడని నానుడి. కుందేళ్ళకా శక్తి ఉంటుందా? ఉండదా? అనే విషయం పండిత చర్చకు వదిలేద్దాం. మొన్న గురువారం మెహబూబ్నగర్జిల్లా బూర్గుపల్లి గ్రామంలో బర్రెలు చిరుతపులిపై తిరగబడ్డ విషయం, ఆ జీవన్మరణ పోరాటంలో పులి ఓడిన విషయం చూశాం.. విన్నాం.. చదివాం.. సంచలన కథనాల కోసం ఎగబడే ప్రధాన స్రవంతి మీడియా ఒకానొక గ్రామంలో కాళ్ళు విరిగిన చిరుత కనపడగానే వెనక్కి తవ్వుకుంటూ వెళ్ళింది. అవి ఫలానా ఆయన బర్రెలని నిర్ధారించింది. తమపై పంజా విసిరిన పులిని తమ 'ఇనుప బూట్ల' గిట్టలతో తొక్కివేయడం వల్ల పులి కాళ్ళు విరిగిపోయాయని నిర్ధారించేసింది. ఇది నిజం కూడా కావొచ్చు. అయితే గత ముప్పయ్యేళ్ళ సరళీకృత ఆర్థిక విధానాల మహాయజ్ఞంలో సమిథలుగా మాడిపోతున్న వారి 'రూపం'పై తప్ప 'సారం' గురించి మన మీడియాకు పెద్దగా ఖాతరులేదు. అంటే.. రైతుల, చేనేత కార్మికుల ఆత్మహత్యలు తప్ప వాటికి గల కారణాలపై విశ్లేషణ చాల అరుదు.
ఇప్పుడు దేశ రైతాంగం క్రమంగా తిరుగుబాటు బావుటాలెత్తుతోంది. మీడియా రాతలతో సంబంధం లేకుండా గత సంవత్సరం ఆగస్టు 9 నుంచి ''క్విట్ ఇండియా'' స్ఫూర్తితో మొగ్గ తొడిగింది రైతు ఉద్యమం. మోడీ భజన పరులు తప్ప మిగిలిన ఆలోచనా పరులు, పెట్టుబడిదారీ విధాన సమర్థకులు సైతం గత సంవత్సర లాక్‌డౌన్‌ను, కరోనా వ్యవహారంలో మోడీ సర్కార్ నిర్వహణా తీరును విమర్శిస్తున్నారు. భారతదేశం మళ్ళీ పట్టాలెక్కేసిందని అగ్రద్వయం జబ్బులు చరుచుకుంటూంటే స్టేట్ బ్యాంకు మాజీ ఛైర్మన్ రజనీష్‌కుమార్, క్రిసిల్, ఇక్రాల ఛీఫ్ ఎకానమిస్టులు డి.కె. జోషి, అదితి నాయర్ వంటివారు దీన్ని తూర్పారపడుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమించాలంటే వీలైనంత త్వరగా, వీలైనంత ఎక్కువ మందికి టీకాలేస్తే తప్ప లాభం లేదని మారుతి ఛైర్మన్ ఆర్.సి. భార్గవ చెపుతున్నారు. ఈసారి కేంద్రం ప్రకటించకున్నా రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి. వారానికి రూ.58వేల కోట్లకు పైగా ఆదాయం తగ్గిపోయిందని బార్క్లేస్ అంచనా వేసింది. ఈ లాక్డౌన్ దెబ్బకి నిరుద్యోగం పెరిగింది. చివరికి అప్పటిదాకా పచ్చగా నడిచిన (ఎఫ్.ఎం.సీ.జీ) ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్ సెక్టార్ (అంటే టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మిషిన్లు మొదలైనవి) కూడ పడకేసినాయి. కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు తగ్గాయి. 2020 లాక్‌డౌన్‌తోనే కుంగిపోయిన విమాన, రోడ్డు, రైలు ప్రయాణ రంగాలు, హాస్పిటాలిటీ రంగం నేడు మరింతగా చితికిపోయాయి. 3వ కెరటం కూడా వస్తే భారత ఆర్థిక వ్యవస్థపై భల్లూక పట్టు బిగుస్తుందని అనేక మంది హెచ్చరిస్తున్నారు. ''సి.ఎమ్. ఐ.ఈ.'' అంచనా ప్రకారం 97శాతం కుటుంబాలు తమ ఆదాయాలు తగ్గిపోయాయని మొత్తుకుంటున్నారు. అమెరికాకి సంబంధించిన ''ప్యూ రిసెర్చ్ సెంటర్'' భారతదేశ మధ్య తరగతి దాదాపు పదికోట్ల నుంచి ఆరు కోట్లకు పడిపోయిందని అంచనా వేసింది. ఈ మధ్య తరగతిని నమ్ముకునే ప్రపంచ పెట్టుబడిదార్లు మనదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉరుకులాడేది.
ఈ రెండవ దశ కోవిడ్ దెబ్బకి మొదటి దశలో పెద్దగా ప్రభావం పడని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పతనం కావడం ప్రత్యేకం. అంతకు ముందు దాచుకున్న డబ్బు అయిపోవడం, ఉపాధి హామీ పనులు లేకపోవడం ఒక ఎత్తైతే, గ్రామీణ జనానికి ఉపాధి చూపే వ్యవసాయ రంగం, ఎమ్ఎస్ఎమ్ఈ రంగం, నిర్మాణరంగం దెబ్బతినడం ఈపతనంలో కీలకం. జేఎన్యూకు చెందిన వ్యవసాయ ఆర్థికవేత్త డాక్టర్ హిమాంశు అంచనాలో నిర్మాణ రంగం కుదేలు కావడానికి ముఖ్యమైన ఇండికేటర్ దేశంలో దాదాపు మూతపడ్డ ఇటుక బట్టీలే అన్నారు. ఈ దశలో ఈ ఆర్థిక సంవత్సరంలో 15-20శాతం పన్నులు (రూ.46-62వేల కోట్లు)వసూళ్ళు తగ్గచ్చని, డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం కూడ రూ.44,000-58,000 కోట్ల దాకా సాధ్యం కాకపోవచ్చని కేర్ రేటింగ్ అంచనా వేసింది. ప్రభుత్వరంగం బతికే ఉంటుందని మనం ఆనందించినా ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతుందని మాత్రం చెప్పక తప్పదు. ఆర్థిక వ్యవస్థ పతనోన్ముఖ పయనానికివన్నీ సూచికలు.
ఈ దశలో కూడా ఎఫ్‌సీఐ గోదాముల్లో ముక్కిపోతున్న, ఎలుకలు, పందికొక్కులు తింటున్న ఆహార ధాన్యాలను వామపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టు ఆదాయ పన్నుకట్టని దేశ పౌరులందరికీ నెత్తికి నెలకి పది కిలోలు చొప్పున ఇవ్వడానికి, అమెరికాతో సహా అన్ని పెట్టుబడిదారీ దేశాల్లో ఇచ్చినట్టు పైకం ఇవ్వడానికి (నెలకు రూ.7,500) మోడీ సర్కార్ సిద్ధపడకపోవడం దారుణం. ఈ దశలో మిగిలిన దారేది? పిల్లిని రూములో వేసి కొడ్తె ఏం చేస్తుందని మన అనుభవం చెపుతోందో అదే మిగిలింది.
సింఘులో, టిక్రీలో, ఘాజిపూర్లో రైతులు పట్టుదలగా నాలుగు డిగ్రీల చలిని, నేడు 45 డిగ్రీల ఎండను భరించారు. రేపు జడివానలను ధిక్కరించి నిలుస్తారు. గతతంత్ర దినోత్సవం నాడు మోడీ సర్కార్ రచించిన రణతంత్రాన్ని అధిగమించారు. ''స్వేచ్ఛలాంటి అందమైన భ్రమలుండటానికి వారు కవులు కాదు... కష్టాల ఒడిలో పుట్టి కన్నీళ్లలో పెరిగి ప్రతిధ్వనిలేని ఈ ధ్వనులమధ్యే బతికే వాళ్ళు. ఇక్కడే చచ్చే వాళ్ళు. పేదవాళ్ళు. ఈ దేశ ప్రజలు వీళ్ళు'' అని ఒక కవి అన్నది వీరి గురించే. ''జనం భూమిలో సంఘాలు నాటడం నేర్చుకున్నవారు'' కూడా వీరే. ఈ పాలకులు వీరిని పిల్లులన్నా, గొర్రెలన్నా తిరగబడటం నేర్చినవారు. తిరగబడే తీరుతారు.