Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంపన్న దేశాల క్లబ్‌గా పేర్గాంచిన జి-7 దేశాల కూటమి ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న సార్వత్రిక ఆర్థిక సంక్షోభం, కోవిడ్-19 ముప్పు వంటి ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం చూపాల్సింది పోయి, చైనాను భూతంగా చూపడంపైనే దృష్టంతా పెట్టింది. ఇంగ్లండ్‌లోని కార్నివాల్లో మూడు రోజుల పాటు జరిగిన ఈ సామ్రాజ్యవాద దేశాల శిఖరాగ్ర సదస్సు ముగింపు సందర్భంగా విడుదలజేసిన 25పేజీల ప్రకటన చైనా చుట్టూనే ఎక్కువగా తిరిగింది. ఒకటి రెండు చోట్ల రష్యాను కూడా టార్గెట్‌గా చేసుకున్నా చైనా మీదే ప్రధానంగా కేంద్రీకరించింది. 1979 వరకు చైనాతో దౌత్య సంబంధాలకు ససేమిరా అన్న అగ్ర రాజ్యం ఇప్పుడు ఆ దేశాన్ని చూసి ఎంతగా బెంబేలెత్తుతున్నదో కార్బిస్ బే ప్రకటన చూస్తే అర్థమవుతుంది. కోవిడ్ సంక్షోభానికి ముందు వరకు చైనా అసలు మాకు పోటీయే కాదు అన్నట్లుగా మాట్లాడిన వారు ఇప్పుడు దానిని కట్టడి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఎనిమిదేండ్ల క్రితం చైనా ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ ద్వారా ఆసియా నుంచి ఆఫ్రికా, లాటిన్ అమెరికా దాకా రోడ్లు, రైల్వేలు, పోర్టులు, ఆసుపత్రులు, క్రీడా సముదాయాలను ఏర్పాటు చేసుకుంటూ వాణిజ్య విస్తరణతోబాటు ఆయా దేశాల గుడ్‌విల్ సంపాదించేందుకు చైనా చేసిన యత్నాలను దివాళాకోరు దౌత్యం అని హేళన చేసిన సామ్రాజ్యవాద దేశాలు ఇప్పుడు అదే పంథాను అనుకరించేందుకు యత్నిస్తున్నాయి. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుకు పోటీగా బిబిడబ్ల్యు (బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డు)ను తెరపైకి తెచ్చాయి.
శాంతియుత అభివృద్ధిని కోరుకుంటున్న చైనాపై బురద చల్లేందుకు అవి చేయని ప్రయత్నం లేదు. చైనాకు వ్యతిరేకంగా వుహాన్ ల్యాబ్ థియరీని ముందుకు తెచ్చాయి. షింజియాంగ్, హాంకాంగ్, తైవాన్లలో మానవ హక్కులు, మౌలిక స్వేచ్ఛకు భంగం కలుగుతోందని గగ్గోలు పెట్టడం, తూర్పు, దక్షిణ చైనా సముద్ర దీవుల్లో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ఏకపక్షంగా యత్నిస్తోందంటూ యాగీ చేయడం, చైనా అనైతిక మార్కెట్ విధానాలకు పాల్పడుతోందంటూ అమెరికా గత కొంత కాలంగా చేస్తున్న గోబెల్స్ ప్రచారం ఈ ప్రకటనలోనూ ప్రతిబింబించింది. చైనా కూడా దీనికి అంతే దీటుగా సమాధానమిచ్చింది. చిన్న కూటములు ప్రపంచాన్ని శాసించే రోజులు పోయాయి అని చెప్పింది. షింజియాంగ్‌లో ఉయిఘర్స్, ఇతర అటానమస్ ప్రాంతాలకు సంబంధించిన వాస్తవాలను వక్రీకరిస్తూ సామ్రాజ్యవాద దేశాల అధీనంలోని మీడియా కథనాలు రాస్తుంటుంది. ఆ రిపోర్టులను ఆధారంగా చూపి ఈ దేశాలు చైనాలో ఏదో జరిగిపోతోందంటూ యాగీ చేస్తుంటాయి. పశ్చిమ దేశాలు మరీ ముఖ్యంగా అమెరికా ప్రపంచమంతటా చేస్తున్నది ఇదే. చైనాతో ఘర్షణ వైఖరినవలంబించాలనే విషయంలో అమెరికాకు, జి-7లోని ఇతర భాగస్వాములకు మధ్య విభేదాలు అలానే ఉన్నాయి. ఈ సమస్యను దౌత్య మార్గంలో పరిష్కరించుకోవాలే తప్ప ఘర్షణ సరికాదని ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాలు తేల్చి చెప్పాయి. ఉత్తర ఐర్లండ్, బ్రెగ్జిట్ విషయంలో బ్రిటన్, ఫ్రాన్స్ తగవులాడుకున్నాయి. రష్యా విషయంలో అమెరికా తీసుకున్న దుందుడుకు వైఖరిని అనుసరించేందుకు జర్మనీ సుముఖంగా లేదు. ఎందుకంటే జర్మనీ రష్యన్ గ్యాస్‌పై ఎక్కువగా ఆధారపడిఉంది. ప్రచ్ఛన్న యుద్ధం నాటి మనస్తత్వంతో ఉన్న ఈ కూటమికి దూరంగా ఉండాల్సిన భారత్ ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికాతో కలసి అతిథి హౌదాలో హాజరైంది. వాతావరణ మార్పులు, ప్రజాస్వామిక హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛ, నెట్ షట్‌డౌన్ వంటి వాటిపై జి-7ను ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన వర్చువల్ ప్రసంగం ఆయన ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. ఆర్టికల్ 370 రద్దు చేసిన అనంతరం కాశ్మీర్‌ను పెద్ద బందిఖానాగా మార్చి, ఇంటర్నెట్ను నెలల తరబడి నిలిపేయడం, సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులపైన, రైతు ఉద్యమం పైన నిర్బంధాన్ని ప్రయోగించిన మోడీ ప్రజాస్వామిక విలువలు, హక్కుల గురించి మాట్లాడటమంటే దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగానే ఉంటుంది. జి-7 దేశాలకు భారత్ సహజ మిత్రపక్షం అని చెప్పడం సిగ్గుచేటు. సంపన్న దేశాల విధానాలను ప్రతిఘటించి, వర్థమాన దేశాల ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడాల్సింది పోయి, వాటితో గొంతు కలపడం దేశ ప్రయోజనాలకే విఘాతం. శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో ఇంటర్నెట్, సోషల్ మీడియాపై ఆంక్షలను సమర్థిస్తూ జి-7 దేశాలు తీసుకున్న వైఖరి ఆ దేశాలు పాటించే ప్రజాస్వామ్య విలువల డొల్లతనాన్ని బయటపెట్టింది.