Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో రాష్ట్రాలన్నింటీనీ దివాళా తీయించి కేంద్రంపై ఆధారపడే పరాన్నభుక్కులుగా మిగిల్చాలనేది బీజేపీ గేమ్ ప్లాన్. నేడు అన్ని రాష్ట్రాలతోపాటు మన రాష్ట్రమూ ఆర్థిక కష్టాల్లో ఉంది. నిధుల కోసం కటకటలాడుతున్నది. ఈ స్థితిలో సంపాదించుకునే మార్గం వెతుక్కోకుండా 'ఇంట్లో బంగారం' అమ్ముకుని బతకాలనుకునే ఆలోచన ఏ కుటుంబ పెద్దచేసినా ఎవరూ హర్షించరు. ఇప్పుడు కేంద్రంపై పోరాటం చేయడం తప్ప రాష్ట్రాలకు మరో దారిలేదు. ఈ దశలో కేసీఆర్ చూపు మరెక్కడో ఉంటే రాష్ట్రానికి నష్టం. భూముల అమ్మకం, బాండ్ల కోసం ఉరుకులు పరుగులు పెట్టడం వృధా ప్రయాస. పైగా దళితులకు మూడెకరాలు, అవసరమైతే కొనిస్తామన్న 2014 నాటి వాగ్ధానం అమలుచేయడానికి భూమి లేదుగానీ, ఇప్పుడు అమ్మకానికి ఎక్కడ్నించి వచ్చిందన్న వామపక్షాల ప్రశ్నకూ సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం. వేలం ప్రక్రియను ప్రారంభిస్తూ నోటిఫికేషన్‌ను సైతం ఇప్పటికే జారీచేసింది. హైదరాబాద్ నగర శివార్లకు సంబంధించి పలు ప్రాంతాల్లో ఈ తరహా వేలం కోసం ఆదేశాలిచ్చింది. ప్రతి జిల్లాలో కనీసం వెయ్యి ఎకరాలు విక్రయిస్తానంటున్నది. గతంలో రెండుసార్లు ఈ తరహా ప్రయత్నాలు చేసింది. ఆశించినవిధంగా అమ్మకాలు జరగలేదు. అయినా మరోసారి ఆ దిశగానే అడుగులేస్తున్నది. ఒకటిరెండు పథకాలకు మినహా మరే ఇతర అవసరాలకు నిధులు విడుదల చేయరాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శికి సీఎం ఆదేశాలివ్వడాన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భూముల అమ్మకాల నిర్ణయంపై రాజకీయపార్టీలు, ప్రతిపక్షాలు అభ్యంతరం చెబుతున్నాయి. భవిష్యత్‌ను మరిచి వర్తమానానికే పరిమితమై నిర్ణయాలు తీసుకుంటున్నదనే విమర్శలూ చేస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో కూడా భూములు అమ్మారు. కొంత మేర నిధులు రాబట్టగలిగారు. అప్పట్లో రియల్ఎస్టేట్ బిజినెస్ బాగా జరిగింది. కోకాపేట తదితర ప్రాంతాల్లో ఎకరాకు రూ. 25 కోట్ల ధర పలికింది. ఇప్పుడూ అదే తరహాలో సర్కారు భూములను వేలం వేయాలనుకుంటున్నది. తద్వారా భారీగా నిధులు సమకూర్చుకోవాలని కేసీఆర్ సర్కారు భావిస్తున్నది. అయితే ప్రస్తుతం మార్కెట్లో సరైన పరిస్థితుల్లేవు. గత కొన్నేండ్లుగా ఉన్న ఆర్థిక మాంద్యం నేపథ్యంలో భూములకు మంచి ధరలు వచ్చే అవకాశం లేదు. ఇది ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టమే. మార్కెట్ నిపుణుల మాట కూడా ఇదే. ఇదిలావుండగా భూము లను రక్షించాల్సిన ప్రభుత్వమే, ఆదాయం కోసం అమ్మడం సరికాదనే అభిప్రాయాలు వామపక్షపార్టీల నుంచి వస్తున్నాయి. ప్రభుత్వ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తున్నది. ఆదాయం లేదంటూ ఆందోళన చెందేకంటే, ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడం కీలకమనేది ఆర్థిక నిపుణులమాట. అవసరంలేని సచివాలయం నిర్మాణం, అనవసరంగా వరంగల్ సెంట్రల్ జైలు కూల్చివేయడం, కొత్త వాహనాలు కొనడం ద్వారా వేల కోట్లు వృధాగా ఖర్చుచేస్తే ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులే కదా. తద్వారా రాష్ట్ర ఆర్థికవ్యవస్థ మరింత దెబ్బతినే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. గత ఏడాది కాలంతో రెండుసార్లు విధించిన లాక్‌డౌన్‌తో దాదాపు రూ. 55 వేల కోట్ల ఆదాయం ఖజానాకు రాకుండాపోయిందని సర్కారే అంటున్నది. ఈ తరుణంలో అవసరం లేని నిర్మాణాలు చేపడితే సర్కారు రోజువారీ అవసరాలకూ నిధుల కొరత తప్పకపోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంపై రూ. 3 లక్షల కోట్లు అప్పులున్నాయి. దీనికి ఏడాదికి రూ.15 వేల కోట్ల నుంచి రూ. 20 వేల కోట్ల వడ్డీ కడుతున్నారు. అంతేగాక తలసరి అప్పు రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు ఉంది. అలాగే ప్రాజెక్టులు, ఇతర పనులకు సంబంధించి రూ. 45 వేల కోట్ల మేర బకాయి బిల్లులూ మెడమీద ఉండనే ఉన్నాయి. బిల్లులు చెల్లించలేదు కాబట్టి, ఇవి కూడా సర్కారు అప్పులే. బిల్లులు రాక ఏకంగా ప్రజలచేత ఎన్నికైన సర్పంచులు ఆత్మహత్యలకు పూనుకోవడం గమనార్హం. దేశంలో అన్ని రాష్ట్రాలతో సహా కేరళకూ ఆర్థిక సమస్యలున్నాయి. అయినా కరోనా లాక్డౌన్లో హీనస్థితికి చేరిన ప్రజల ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేసేందుకు వందరోజుల ప్రణాళికతో ముందుకొచ్చింది. రూ. 20 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించి వారికి ఆపన్నహస్తాన్ని అందించింది. అంతేగాక రూ.2500 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులతో దాదాపు ఎనభైవేల ఉద్యోగాలు సృష్టించే పనిలో ఉంది. కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘాల నిధులు, జీఎస్టీ, ఐజీఎస్టీ నిధుల కోసం పోరాటం చేస్తోంది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలూ ఆ మార్గాలలో నడవాల్సిందే. కలిసొచ్చే పార్టీలు, ప్రభుత్వాలతో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తీవ్రమైన ఒత్తిడి ద్వారానే రాష్ట్రాల హక్కులు సాధించుకోవడానికి వీలవుతుంది. ఆమేరకు టీఆర్ఎస్ సర్కారు కృషిలో పదును పెరగాలి. కోవిడ్ టీకాల కోసం కేరళ సీఎం విజయన్ రాసిన లేఖ, అక్కడి అసెంబ్లీ చేసిన తీర్మాణం ఇప్పుడు దేశంలోని దాదాపు 100 కోట్ల మందికి ఉచిత వాక్సిన్ ప్రకటనైనా కేంద్రం నుంచి వచ్చేలా చేసిన సంగతి తెలిసిందే. దేశ ఫెడరల్ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, రాష్ట్రాల హక్కుల పరిరక్షణకు కలిసొచ్చే వారందరితోనూ ఐక్యంగా పోరాడటం ద్వారా సాధించుకున్న తెలంగాణ సార్థకమవుతుంది.