Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇండియా అంటే
నాలుగు మందిరాలు
నాలుగు మసీదులు
గుప్పెడు మట్టి
గంపెడు విశ్వాసాలు కాదురా..
శతాబ్దాల సామరస్య భావాల చరిత్ర అని కవి కరీముల్లా అన్నట్టు... సామరస్య భావాల చరిత్ర గల దేశంలో జీవించడమే ప్రశ్నార్థకమైనప్పుడు నిరసన అనివార్యమైంది. నిరసన తెలిపిన విద్యార్థులను ఉపా చట్టం కింద అరెస్టు చేసి జైలుకు పంపారు. దానిపై ఏడాది తరువాత ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇస్తూ.. రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కుకు, ఉగ్రవాద చర్యకు మధ్య తేడా ఉన్నదని వ్యాఖ్యానించింది. ఢిల్లీలో వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనల సందర్భంగా గతేడాది అరెస్టు అయిన ముగ్గురు విద్యార్థులు నటాషా నర్వాల్, దేవాంగన, అసిఫ్ ఇక్బాల్లకు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా కోర్టు అసమ్మతిని అణచివేయాలనే ఆరాటంలో, రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కుకూ, ఉగ్రవాద చర్యకు మధ్య ఉన్న తేడా గమనించడంలో కేంద్రానికి చూపు మసకబారినట్టు అనిపిస్తున్నది. ఇది ప్రజాస్వామ్యానికి దుర్దినం అని వ్యాఖ్యానించింది. పౌరసత్వ సవరణచట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను నిషేధించలేదని కూడా న్యాయమూర్తులు గుర్తుచేశారు. ప్రతి ప్రజా ఉద్యమమూ ఒక కుట్రే. ప్రతి నిరసన ఒక విద్రోహ చర్యే. ప్రజాపక్షపాతులే దోషులు అన్నట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వాలకు ఈ వ్యాఖ్యలు చెంపపెట్టు. అయినా ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం ప్రభుత్వ నిరంకుశవైఖరికి నిదర్శనం.
సాధారణంగా ఐపీసీ నేరాలకు ఉగ్రవాద చర్యల పేరుతో ఉపా చట్టాన్ని వర్తింపజేయరాదు. నిందితులపై మోపిన అభియోగాలు ఏవీ ఉపా కిందకు రావుః అని కోర్టు అభిప్రాయపడింది. ఈ విద్యార్థులు కేవలం నిరసన ప్రదర్శలను ప్రోత్సహించారు. ఇది ఏ దృష్టితో చూసినా చట్ట వ్యతిరేకం కాదు. ప్రజలను ఉద్యమంలో పాల్గొనమని చెప్పడం నిరసనలో భాగమేనని, హింసను రెచ్చగొట్టిన దాఖలాలూ లేవని కోర్టు స్పష్టం చేసింది. తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారనిగానీ, కుట్ర పన్నారనికానీ అంగీకరించడానికి కోర్టు నిరాకరించింది. ఒక వేళ వీరి నిరసన రాజ్యాంగబద్దంగా లేదు అనుకున్నా అది తీవ్రవాద కార్యకలాపం కాదని కూడా కోర్టు తేల్చి చెప్పింది. దేశంలో అంతకంతకూ బలహీన పడుతున్న ప్రజాస్వామ్యానికి ఈ తీర్పు కొత్త ఊపిరిలూదింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాపక్షపాతులు, నిస్వార్థ కార్యకర్తలు, మేథావులకు ఎడతెగని కారాగారాన్ని మనం చూస్తున్నాం. ఇందుకు జేఎన్యూ, జామియా మిలాయా విద్యార్థుల నిర్భందం, ఢిల్లీ పౌరహక్కుల కార్యకర్తల ఉదంతం, బీమాకోరెగావ్ ఘటన ఇలా అనేక ఉదాహరణలున్నాయి. అందుకే వరల్డ్ ప్రెస్ ఫ్రీడం-2021 సూచికలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ 142వ స్థానానికి దిగజారింది. భారత్లో ప్రజాస్వామ్యాన్ని మోడీ సర్కార్ నియంతృత్వం వైపునకు తీసుకెళ్తోందని ఫ్రీడం హౌస్ తెలిపింది.
ఇలాంటి తరుణంలో ఈ తీర్పు అక్రమకేసులు బానాయించే ప్రభుత్వాలకు తీవ్ర హెచ్చరిక. దేశభద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలను మాత్రమే తీవ్రవాద చర్యల కింద పరిగణించాలన్న ఇంగిత జ్ఞానం పోలీసులకు, అసమ్మతిని సహించలేని నాయకులకు కొరవడడం దారుణంః అని ప్రభుత్వాన్ని న్యాయస్థానం చివాట్లు పెట్టడం గమనార్హం. నిజానికి ప్రజాస్వామ్య విలువలకు, నిబంధనలకు కట్టుబడే అలవాటులేని ప్రభుత్వాలు ప్రతి నిరసననూ తీవ్రవాద చర్యకిందే పరిగణిస్తున్న తరుణంలో... ఈ తీర్పు పౌరుల హక్కులను ప్రభుత్వాలే కాలరాస్తూ ఉంటే కోర్టులు చూస్తూ ఊరుకోవన్న స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది. అయినప్పటికీ చీటికీ మాటికీ బూటకపు ఆరోపణలతో ఉపా కేసులు పెట్టడాలు ఇకముందు కూడా ఉంటాయన్నది వాస్తవం. వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ, నిరసన తెలియజేసే అవకాశం ప్రజాస్వామ్య సౌధానికి పునాదిరాళ్ల వంటివని పాలకులు గుర్తించనంతకాలం న్యాయస్థానాలు బెయిలు మంజూరుచేయడం, నిశిత వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రభుత్వాల మితిమీరిన ప్రవర్తనలు ఆగిపోతాయని అనుకుంటే పోరపాటే. ప్రజా చైతన్యం మాత్రమే దీనిని నివారించగలదు.
ఇంతకు ముందు సంస్థలను మాత్రమే తీవ్రవాద సంస్థలుగా పరిగణించే వారు. కానీ ఈ చట్టాన్ని సవరించి వ్యక్తులను కూడా తీవ్రవాదులుగా పరిగణించడానికి అదనపు కోరలు తొడిగారు. వ్యక్తులను ఏ కారణం చేత తీవ్రవాదులుగా పరిగణిస్తారో చట్టంలో ఎక్కడా స్పష్టతలేదు. పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాల్సిన పాలకులు సామాన్య ప్రజానీకాన్ని అణిచివేసే వింత చట్టాలను తీసుకురావడమే అసలు విషాదం. న్యాయ మూర్తులు నిష్కారణంగా నిందలకు గురయ్యే వారికి ఊరటకలిగించే చర్యలు తీసుకుంటూ ఉండవచ్చు. కానీ ఈ చట్టాలను దుర్వినియోగం చేసే వారిని శిక్షించిన సందర్భాలు లేకపోవడం విషాదకరం. కాబట్టి ఢిల్లీ హైకోర్టు తీర్పు పాక్షిక న్యాయమే. రాచరికం అంతమై చాలా కాలమైంది. అయినా రాజ ద్రోహం కేసులు పెడుతున్నారు. రాజద్రోహం అంటే ఏమిటో పునర్నిర్వచించవలసిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ ఇటీవల చేసిన వ్యాఖ్య పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.