Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. కన్నీళ్ళను కూడ దాచి నాకై చెమటగా ఖర్చుపెడుతున్నది తెలియలేదు..' నాయన బతికున్నప్పుడు ఏదీ తెలియదని ఆయన విలువేమిటో గానం చేసే గజల్ గీతమిది. నిజంగానే నాన్నకు అమ్మంత పేరు లేనేలేదు. అమ్మను ప్రేమించినంతగా నాయనను ప్రేమించం. ప్రేమించకపోగా మనకోసం అది చేయలేదని, ఇది ఇవ్వలేదని నిందిస్తాం. నిలదీస్తాం. అమ్మతో పాటు మన పుట్టుకకూ, ఎదుగుదలకూ కారణమై శ్రమించిన నాయన అమ్మలా ఆదరణను, ప్రేమను పొందలేకపోయాడు పాపం ఎందుకో! 'నాన్న వెన్నెముకయి నిలబడ్డాడు అందుకే వెనకబడిపోయాడు' అన్న కవి వాక్కు సత్యమేమో!
నాన్నలకూ ఓ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగానైనా నాన్నలో దాగున్న విషయాలను పరిశీలించాలి. నాన్న దయారహితుడిగా, కఠిన చండామార్కుడిగా మారటానికి నాయన స్థానంలో ఉన్న వ్యక్తులు కారణం కాదు. పితృస్వామిక వ్యవస్థకు కారణమైన సొంత ఆస్తి యాజమాన్యము, శ్రామికులుగా సమాజం విభజించబడటమూ అందులో భాగంగా ఇంటి యజమానిగా తండ్రి వ్యవహరించడం అనేది అసలు విషయం. సమాజంలో పాలకుడు యజమాని, అతని చేతిలోనే నిర్ణయాధికారం, ఆధిపత్యం ఉంటుంది. కుటుంబంలోనూ అదే ప్రతిఫలించింది. తండ్రి యజమాని, పాలకుడయ్యాడు. తల్లి, పిల్లలు పాలితులయ్యారు. ఈ వైరుధ్యంలోంచే ఘర్షణ మొదలవుతుంది. దాని ప్రతిఫలమే నాన్నపట్ల పిల్లలకున్న సంబంధం ప్రతిబింబిస్తుంది. అయితే ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు కూడా ఉంటాయి. సమిష్టికృషితోనే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. అయితే కీలకమైన ఆర్థిక నియంత్రణ తండ్రి చేతిలో ఉండటం వలన, తమకు కావలసినవేవీ సమకూర్చలేదనే ఆరోపణలను పిల్లల నుంచి నాన్న ఎదుర్కొంటాడు. తల్లికి ఆదాయ వనరు లేనందున అమ్మతో ఘర్షణ ఉండదు.
అదొక సామాజిక పరిణామపు పర్యవసానం. కానీ బయట యజమానుల కింద పనిచేస్తూ వారి ఆధిపత్యాలకు, పీడన, దోపిడీలకు నిత్యం నాన్న గురవుతూనే ఉంటాడు. పిల్లల పెంపకం తల్లికి వదిలివేయటం వలన, అమ్మతో అనుబంధం పిల్లలకు ఎక్కువ. అయితే తండ్రి ఎప్పుడూ భవిష్యత్తును, రేపటిని గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు. తల్లికి ఇప్పుడేమిటనేది ముఖ్యంగా ఉంటుంది. అమ్మది క్షమాగుణం. నాన్నది శిక్షాగుణం. క్షమ వెంటనే బాధను పోగొడుతుంది. శిక్ష జీవితంలో బాధ రాకుండా చూస్తుంది. నాన్న కఠినంగా కనపడటానికి కారణమిది. అందుకే నాన్నప్రేమ ఆలస్యంగా తెలుస్తుంది. అయితే స్త్రీ పురుషుల మధ్యనున్న వివక్షతల కారణంగా నాన్న అమ్మపైన చూపించే దౌర్జన్యాలను, చిన్నతనం నుంచి పిల్లలు చూడటం వల్ల కూడా నాన్నకు దూరమవుతారు. ''నీ బాధకూ నా బాధకూ మధ్య జెండర్ రాజ్యం ఏలుతుంది, అందమైన అమ్మ శరీరమ్మీద, దగ్ధమైన యవ్వనాన్ని చూసిన దాన్ని, వెన్నెల ప్రవహించే ఆమె హృదయం మీద నాన్న చేసిన గాయాలు చూసిన దాన్ని'' అని మహెజ బీన్ కవయిత్రి చెప్పినట్టుగా నాన్నను ద్వేషించడానికి ఇదీ కారణమే.
కానీ ప్రతి నాన్నలోనూ నిగూఢంగా ఓ అమ్మ ఉంటుంది. మరపురాని ప్రేమలు పంచిన నాన్నలూ ఎందరో ఉన్నారు. 'ఓ నాన్న.. నీ మనసే వెన్న, అమృతం కన్నా అది యెంతో మిన్న' అంటూ నాన్న ప్రేమను సినీగీతంలో వినిపించారు. నాన్నలో బయటికి వ్యక్తం చేయని ప్రేమలు దాగుంటాయి. పిల్లలు ఉన్నతంగా పెరిగి పెద్దవాళ్ళయి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పుడు నాన్న ఆనందానికి అవధులుండవు.
నేడు చాలా మార్పు వచ్చింది. ప్రపంచీకరణ నేపథ్యంలో అమ్మ నాన్న ఇద్దరూ ఉద్యోగాలకు బయటికి వెళ్ళడం వలన పిల్లల బాధ్యతను ఇద్దరూ సమంగా పంచుకొంటున్నారు. ఇప్పుడు పిల్లలు నాన్నతోనే ఎక్కువగా అనుబంధంతో ఉంటున్నారు. ఒకరూ ఇద్దరూ పిల్లలకే పరిమితమయ్యే నేటి పరిస్థితులలో పిల్లలపై శ్రద్ధ పెరిగింది. మరోవైపు భవిష్యత్తు పట్ల తీవ్ర ఆందోళనలతో తండ్రులు పిల్లలపై నిర్బంధ విద్యా శిక్షణలకు పాల్పడటం, రెసిడెన్షియల్ కళాశాలల్లో చదివించడంతో తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలు పెరగని తనమూ పెరిగింది. దీంతో నాన్న ఊరిలో, పిల్లలు విదేశాల్లో సంపాదనల్లో మునిగిపోయారు. ప్రేమలిప్పుడు మెయింటినెన్స్, మనేజ్మెంట్ కిందకు మారిపోయాయి.
సమాజంలోని సంక్షోభాల కారణంగా, ఉపాధి లేమి, నిరుద్యోగిత వల్ల బాధ్యతా రాహిత్యంగా మారిన తండ్రులెందరినో మనం చూస్తాం. పతితులూ భ్రష్టులూ బాధాసర్పద్రష్టులూ ఉన్న వ్యవస్థలో నాన్నల అనుబంధాలలో ఆర్థిక సంబంధాలే దర్శనమిస్తుంటాయి. 'రిచ్డాడీ, పూర్ డాడీ'లుగా విభజన గీతలు గీసుకున్నాక నాన్నకు దక్కేది ఆ ఒక్క పిలుపు మాత్రమే.
ప్రపంచంలో అమ్మల గురించి గొప్ప సాహిత్యమొచ్చింది. ప్రసిద్ధ 'అమ్మ' నవలను సృజించిన గోర్కీ కూడా ఓ నాన్న. నాన్నపై కూడా ఇప్పుడు సాహిత్యం వెలువడుతోంది. వర్గ సమాజపు విభజనలలో, పెట్టుబడి కబళించే మానవ సంబంధాలలో ప్రేమల కోసం వెతుకులాడుకోవటం అవసరమే. నాన్నను అర్థం చేసుకుని ఆదరించి అనురాగం పంచడమూ అవసరమే. ''ఏం కూడబెట్టించిండు పిల్లలకు... లోకం లోతు / ఇంత రేషం / ఇన్ని కన్నీళ్ళు / తలెత్తుకున్న చరిత్ర / వొడువనిదే ఇచ్చిండు, చాలదా..!'' అని కవి నందిని సిధారెడ్డి వాళ్ళ నాయనను గుర్తుచేసుకున్నట్లే నాన్న నుండి మనకేం అందిందో తెలుసుకుందాం!