Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విత్తుముందా? చెట్టుముందా? అనే ప్రశ్నకి వృక్షశాస్త్రం, జీవ పరిణామ సిద్ధాంతాల సాయంతో సమాధానం చెప్పవచ్చు. కానీ పెళ్ళైతేనే పిచ్చి కుదురుతుందా? పిచ్చి కుదిరిన తర్వాతే పెళ్ళవుతుందా? అనే దానికి సమాధానం సాపేక్షంగానే ఉంటుంది. ఎవరి తరుఫున ఆలోచిస్తున్నామనే దాన్ని బట్టి సమాధానం ఉంటుంది. ఇటువంటిదే ఒక కీలక ప్రశ్న మోడీ సర్కార్ ముందుకొచ్చింది. మహమ్మారి కంట్రోల్లో కొచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందా? ఆర్థిక వ్యవస్థ బాగుపడితే కరోనా నియంత్రణలో ఉంటుందా? వాస్తవానికి ఇది చొప్పదంటు ప్రశ్నే!
ఎందుకంటే 2019 నాటికే మూలుగుతున్న మన దేశ ఆర్థిక వ్యవస్థ నెత్తిన కరోనా తాటికాయ పడింది. దానికి చాలా సంవత్సరాల ముందు నుంచే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థ అంపశయ్యపై ఉంది. సరళీకృత ఆర్థిక విధానాల రాకతో మన దేశంలో దిగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకుంది. ఆ తరువాత వరుసగా అనేక ప్రభుత్వాలు ఎగుమతులు పెంచుతామని, పెరిగినాయని ఎన్ని కబుర్లు చెప్పినా ఎగుమతులు పెరిగింది లేదు. 2017లో ట్రేడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీమ్ పెట్టినా పెరగలేదు. అభివృద్ధి చెందిన దేశాలే సంక్షోభంలో ఉంటే మన దేశంలో ఆర్థిక వ్యవస్థ చక్రాలు తిరుగేదెక్కడీ అన్నీ బాగున్నాయని, అంతా సర్దుకుందని సర్కారు చంకలు గుద్దుకుంటుంటే టిసిఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర వంటి దిగ్గజ కంపెనీల్లో భారీగా తొలగింపులు చోటుచేసుకుంటున్నాయని మొన్ననే ఎకనామిక్ టైమ్స్ ప్రకటించింది. వీళ్ళంతా సాధారణ అసంఘటిత కార్మికులు కాదు. నెలకు రూ.50వేల పైన జీతాలందుకునేవారు. 50లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల గృహ రుణాలు తీసుకున్నవారు. ప్రతి నెలా రూ.40/50వేలు ఈ.ఎం.ఐ.లు కట్టేవారు. ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషీన్లు మొదలైనవి కొనేవారు. ఫ్లిప్కార్డులు, అమెజాన్లు నిరంతరం వాడేవారు. ఈ జీతగాళ్ళపై ఆధారపడ్డ ఈ పరిశ్రమలన్నీ నేడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
భారత కార్పొరేట్ రంగం ఆశలు మంచి వర్షాలు పడటం మీద, రేపు ఆగస్టు, సెప్టెంబర్ నాటికి ప్రారంభమయ్యే పండగల సీజన్ అమ్మకాల మీద ఆధారపడి ఉన్నాయి. కార్లు, ఇతర ఆటో ఉత్పత్తులు ఎక్కువగా అమ్ముడైతే, వినిమయ సరుకులు జనం బాగా కొంటే, ప్రయాణాలు బాగా జరిగితే, ఆభరణాలు బాగా అమ్ముడైతే...!? పూరి గుడిశెలో ఉన్న వ్యక్తి రాజుగారమ్మాయిని పెళ్లి చేసుకుని కట్నంగా వచ్చిన బోలెడన్ని ఆవులతో పాల వ్యాపారం చేస్తే, ఇంకా డబ్బు సంపాదిస్తే.. తన మాటవినని పెళ్ళాన్ని ఒక్క తన్నుతంతే... గుడిశెలో తనతో పాటు ఎప్పటినుంచో ఉన్న కుండ భళ్లున బద్దలై చెదిరిపోయిన కలలా లేదా? అయితే వీళ్లు మోడర్న్ వాళ్ళు కాబట్టి కల కూడ అర్థవంతంగానే ఉంది. జూలై నాటికి రోజుకి 80లక్షల వ్యాక్సినేషన్ డోసులు చొప్పున అందకీ వ్యాక్సినేషన్ వేస్తేనే ఆరోగ్య వ్యవస్థ కుదురుకుంటుందని, అప్పుడే ప్రజలు ఇతర వాటిపై ఖర్చు పెట్టగలుగుతారని, అప్పుడే ఆర్థిక వ్యవస్థ పచ్చబడుతుందని మన కార్పొరేట్ల ఆశ.
దీన్నే కొత్తగా కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టీస్ ఛైర్మన్‌గా బాధ్యత తీసుకున్న టి.వి. నరేంద్రన్ కేంద్ర ప్రభుత్వం మరో రూ.3లక్షల కోట్లు ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వాలని, దాన్ని జన్‌ధన్ అకౌంట్లలోకి బదలాయించాలని, ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెంచాలని, స్వల్ప కాలికంగానైనా జీఎస్టీ రేట్లు తగ్గించాలని, ఇంధనంపై ఎక్సైజ్ పన్నులు తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. రోజూ 71.2లక్షల డోసుల టీకాలు వెయ్యాలన్నాడు. అమెరికా లాంటి దేశాలను అధ్యయనం చేసిన ఎవరైనా చెప్పేమాటే అది. రానున్న డిసెంబర్ నాటికి దేశంలో 175 కోట్ల వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తి జరగాలన్నారు నరేంద్రన్. ముఖ్యంగా కార్పొరేట్ల ఆశకు, పైన పేర్కొన్న కల సాకల్యం చెందే మార్గమది. కాని కార్పొరేట్లు తమ లాభాలు వదలుకోవు. భారత్ బయోటెక్ కేంద్ర ప్రభుత్వానికి ముందు ఒక్కోడోసు టీకా రూ.150లకే ఇస్తానంది. ఇప్పుడు నష్టమొస్తోంది కాబట్టి బయట రూ.1200కి అమ్ముకోడానికి+దానిపై జీఎస్టీని చెల్లించాలని చెపుతుంది. లాభం లేందే వ్యాపారి ఏటికి ఎదురుపోడని తెల్సుగాని ప్రభుత్వాలు కూడా జీఎస్టీని వదులు కోవని తెలియదు. దీనిమీద కార్పొరేట్ ఆసుపత్రుల సర్వీసు చార్జీ, వెరసి ప్రజల జేబుకి చిల్లు. దాదాపు 26 రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో ఆంక్షల వల్ల స్వయం ఉపాధి మొత్తం దెబ్బతినింది. సి.ఎమ్.ఐ.ఈ అంచనా ప్రకారం 2021 ఏప్రిల్, మే మాసాల్లో 1.72 కోట్ల మంది నిరుద్యోగులయ్యారు. నెలవారీ జీతాలొచ్చేవారి ఆదాయాలు కూడా తగ్గాయి. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రజల కొనుగోలు శక్తి పిండేయబడింది. దీన్ని సరి చేయమనే సీఐఐ అధ్యక్షుడు మొత్తుకున్నది. కాని కేంద్ర ప్రభుత్వం తన నిర్వాకం వల్లే పచ్చటి మొలకలొస్తున్నాయని (ఇంగ్లీషు) 'వి' ఆకారంలో (రికవరి) ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని హెచ్చులు పోవడం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
వ్యాక్సిన్ల దేశవాళి ఉత్పత్తి గురించి చెప్పేవి అబద్ధం. దేశంలో రెండు డోసులు వ్యాక్సిన్ వేసిన వారి సంఖ్య అబద్ధం. ప్రపంచానికి తామే రక్షకులన్న మాట అబద్ధం. దేశంలో మరణాలపై ప్రభుత్వం చెప్పేది అబద్ధం. ఆక్సిజన్ సిలెండర్లు అబద్ధం. వెంటిలేటర్ బెడ్లు అబద్ధం. గుజరాత్ నమూనా అబద్ధం. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో శైలజా టీచర్ నిజం. కేరళ నిజం.