Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిడికెడు మంది దోపిడీదారుల కోసం లక్షల కోట్ల ప్రజాధనం ఉదారంగా ధారపోయగలిగిన ఈ ప్రభుత్వానికి, కరోనా మృతులకు పరిహారమివ్వడానికి మాత్రం చేతులు రావడంలేదు. ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం ఒకటికి రెండుసార్లు వెంటబడి గుర్తుచేసినా, కుదరదుగాక కుదరదని నిర్దయగా చెప్పేసారు. ఇంతటి మహావిపత్తులోనూ బాధిత ప్రజల పట్ల కనీస బాధ్యతను విస్మరిస్తున్న ఈ ప్రభుత్వం, పరిపాలన ఎవరికోసం? అన్న ప్రశ్న ఇప్పుడు ఈ దేశ భవిష్యత్తునే హెచ్చరిస్తోంది.
కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం చెల్లించాలంటూ దాఖలైన వాజ్యాల విచారణలో భాగంగా, సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని పదే పదే ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇందుకు సమాధానంగా ఈ పరిహారాలు చెల్లించడం సాధ్యం కాదంటూ కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్లో స్పష్టం చేసిన సంగతీ తెలిసిందే. కాగా, దీనిపై సోమవారం కోర్టు స్పందిస్తూ... ''పరిహారం అవసరం లేదని ప్రధాని నేతృత్వంలోని 'జాతీయ విపత్తు నిర్వాహణా సంస్థ (ఎన్‌డీఎంఐ)' నిర్ణయం తీసుకుందా?'' అని సూటిగా ప్రశ్నించడం గమనార్హం. అలాంటి నిర్ణయం ఎక్కడ జరిగిందో, ఎవరు చేసారో ఏలినవారికే తెలియాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం ప్రకృతి వైపరిత్యాలలో నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించడం ప్రభుత్వాల బాధ్యత. దీనిని అనుసరించి, సర్వం కోల్పోయిన మృతుల కుటుంబాలకు రూ.4లక్షల పరిహారాన్ని కోరుతూ దాఖలైన వాజ్యాలు న్యాయమైనవి. కనుకనే న్యాయస్థానం కూడా అడుగుతోంది. కానీ ప్రభుత్వ వైఖరే అన్యాయంగా ఉంది.
కోవిడ్‌ను జాతీయ విపత్తుగా పరిగణించి, ఆమేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం కింద సర్వాధికారాలనూ చేపట్టి, రాష్ట్రాల చేతులు కట్టేసిన కేంద్రం... అదే చట్టాన్ని అనుసరించి బాధితులకు పరిహారం చెల్లించడానికి మాత్రం ముందుకు రాకపోవడం అమానుషం. విపత్తు అనేది ఒకసారి వచ్చిపోతుందనీ, ఈ కోవిడ్ విపత్తు అలా ఒకసారి వచ్చిపోయేది కాదనీ, పదే పదే వచ్చిపోయే ఈ మహమ్మారి ధాటికి బలయ్యే వారందరికీ పరిహారం చెల్లించడం ప్రభుత్వ ఖజానాకు భారమవుతుందనీ కేంద్రం పేర్కొనడం మరీ విడ్డూరంగా ఉంది. ప్రజలకు ఉపయోగపడని ఆ ఖజానా ఎవరికోసం? ఎందుకోసం? ద్రవ్యలోటు పరిమితి దాటుతుందని సాకులు చెపుతున్న సర్కారు, జీడీపీ పతనానికి ఏం సమాధానం చెపుతుంది? పెరుగుతున్న నిరుద్యోగితకూ, ఉపాధిలేమికి బదులేమిస్తుంది? అంతకంతకూ కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థనూ, సంక్షోభంలో ఉన్న ప్రజా జీవితాన్నీ చక్కదిద్దలేని ప్రభుత్వానికి, ఇప్పుడు తప్పించుకోవడానికి ద్రవ్యలోటు ఒక సాకు మాత్రమే.
నిజానికి ఇప్పుడు పరిహారం పొందడం బాధిత ప్రజల హక్కు. కానీ దేశ రాజ్యాంగ లక్ష్యాలతో నిమిత్తం లేకుండా, పరిస్థితులేమైనా అంతిమంగా ప్రజా బాహుళ్యం బాగోగులకే ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆదేశిక సూత్రాలకు విరుద్ధంగా నేటి బీజేపీ పాలన ముందుకు సాగుతోంది. మహమ్మారి సృష్టిస్తున్న విలయానికి, ఆప్తులనూ, ఆస్థులనూ కోల్పోయి అనాథలుగా మిగిలిన జీవితాలెన్నో కళ్ళముందు కలవరపెడుతున్నాయి. వారిని కాపాడే బాధ్యత ఎవరిది? ఏ ప్రభుత్వ ఖజానాకైనా ప్రజల ప్రాణాలకు మించిన ప్రయోజనం ఏముంటుంది? ఇప్పటికే మహమ్మారి కారణంగా, బాధ్యతారహిత ప్రభుత్వ విధానాల కారణంగా కోట్లాది భారతీయుల జీవితాలు రోడ్డున పడ్డాయి. కానీ విచిత్రంగా ఇదే కాలంలో అత్యంత సంపన్నుల ఆస్తులు మాత్రం అమాంతంగా పెరిగిపోయాయి..! ఈ ఒక్క యేడాదిలోనే అవి కనీవినీ ఎరుగని రీతిలో పెరగడమే కాదు, లెక్కకు మించిన సొమ్ము స్విస్ బ్యాంకులకు చేరింది. ఈ పెరుగుదలలో గడిచిన పదమూడేండ్లలో ఇదే అత్యధికం. ఇందులోని మతలబేమిటో ఏలినవారు సెలవీయగలరా? వీరి ఖజానా నింపడానికి ప్రభుత్వ ఖజానాకు తమ విధానాలతో తూట్లు పొడిచి, అడ్డదారిలో లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ''పెద్ద మనుషులకు'', పేదల కడుపులు నింపడానికి మాత్రం చేతులు రావటంలేదు. పేదల సంగతి అటుంచితే, కనీసం కరోనా కాటుకు కుటుంబాలను కోల్పోయి, ఉన్న ఆధారాలనూ కోల్పోయి అభాగ్యులుగా మిగిలినవారిని ఆదుకోవడానికి కూడా వారి మనస్సు అంగీకరించడం లేదు. ప్రజలంటే పట్టింపులేదు, ప్రతిపక్షాలంటే లెక్కలేదు, చివరికి న్యాయస్థానాల పట్ల కూడా గౌరవం లేదు. మరి వీరూ వీరి పాలనా ఎవరి కోసం?
ఇటువంటి సందర్భంలోనే ఇంగ్లాండ్ మహాకవి ''పి.బి.షెల్లీ'' ఓ పాట ద్వారా తన ప్రజలకిచ్చిన సందేశం ఒకటి ఇప్పుడు గుర్తుకు వస్తోంది.
''విత్తనం నాటింది నువ్వు - దోచుకుపోయేది మరొకడు
సంపద సృష్టించిందీ నువ్వు-దాన్ని అనుభవించేది మరొకడు
బట్టలు నేయడం నీవంతు - వాటిని తేరగా ధరించేది ఇంకొకడివంతు
ఆయుధాల తయారీ నీవంతు-వాటిని ఉపయోగించేది వేరొకడివంతు
కానీ, ఒక్క మాట సుమా!
విత్తనం నీవే నాటు - ఏ నిరంకుశుడికీ దాన్ని దక్కనివ్వకు
సంపద సృష్టించు - కానీ, మరొకడికి పంట చేరనివ్వకు
బట్టలు నేస్తూనే వుండు - వాటిని సోమరిపోతులకు అందనివ్వకు
ఆయుధాలు తయారు చేయి - వాటిని నీ రక్షణకు మాత్రమే ఉపయోగించు'' అంటారాయన. ఇది ప్రజల గ్రహింపునకు వచ్చేంత వరకే ఈ ఏలినవారి దురాగతాలకు చెల్లుబాటు.