Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్యారంగం ఇంకా సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నది. కొవిడ్‌లో అత్యంత దారుణంగా ప్రభావితమైన వ్యవస్థల్లో ఇదొకటి. కరోనా దుష్పప్రభావం విద్యార్థులు, పిల్లలపై తీవ్రంగా పడింది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అలక్ష్యంతోపాటు కార్పొరేట్ శక్తుల ప్రాబల్యమూ కారణమే. పక్కాగా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు చురుగ్గా లేకపోవడంతో విద్యార్థుల భవిష్యత్ అంధకారమవుతున్నది. ప్రత్యక్ష తరగతులకు బదులు ఆన్లైన్ విద్యను ముందుకు తెచ్చినా, పిల్లలకు కష్టాలు తప్పడం లేదు. కొవిడ్ నుంచి వైద్యపరమైన రక్షణ, ప్రధానంగా టీకా వారికి అందలేదు. అలాగే బోధనా సిబ్బందికీ చేరలేదు. ఈనేపథ్యంలో పాఠశాల అంటేనే భయపడే పరిస్థితి ఇంకా పోలేదు.
గత ఏడాది కరోనా టెన్త్ బ్యాచ్ విద్యార్థులు ట్రిపుల్ ఐటీ పరీక్షల్లో 60 శాతం మేర ఉత్తీర్ణులు కాలేకపోయారని వార్తలొస్తున్నాయి. అంటే నాణ్యత పేలవంగా ఉందనేది స్పష్టం. తరగతి గదిలో చెప్పే పాఠాలు కొన్నింటిని ఆన్లైన్ ద్వారా చెప్పడం కష్టమనీ, సమీక్ష అవసరమని యూజీసీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎస్సీఈఆర్టీ) ఇప్పటికే చెప్పాయి. పాఠాలు చెప్పడమే తప్ప, కింది స్థాయిలో విద్యార్థి ఏమేరకు నేర్చుకున్నాడనే విషయమై సరైన సమీక్ష ఇప్పటికీ జరగలేదు. కేంద్రీయ పాఠశాలల్లో సాగుతున్న ఆన్లైన్ బోధన నాణ్యతపై ఎన్సీఈఆర్టీ జరిపిన సర్వేలో 35శాతం విద్యార్థులకు పాఠాలు అర్ధం కావడం లేదని తేలింది. 21శాతం పిల్లలకు కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్లు లేవు. కరెంటు సమస్యలు, ఇంటర్నెట్ లోపాలతోపాటు చిన్న స్క్రీన్లతో కంటి చూపు, ఫిట్స్ తదితర అనారోగ్య ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చదవకుండా, పరీక్షలు రాయకుండా బంగారు భవిష్యత్‌ను ఆశించలేం. కేరళ కమ్యూనిటీ విద్యా విధానం దేశానికే ఆదర్శంగా నిలిచింది. టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు పేద విద్యార్థులకు అందుబాటులోకి తేవడంతో అక్కడ సత్ఫలితాలు వచ్చాయి. టెన్త్ పరీక్షలూ సజావుగా జరిగాయి.
ఇదిలావుంటే ప్రయివేటు, కార్పొరేట్ శక్తులు ఫీజులను ఎంతపడితే అంత వసూలు చేస్తున్నాయి. అడ్డూఅదుపూ లేదు. గత ఏడాదిగా ఉపాధి పనులు నిర్వీర్యమై పొట్టచేత పట్టుకున్న పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు తమ పిల్లల చదువుకు ఫుల్స్టాప్ పెట్టే పరిస్థితి ఉత్పన్నమవుతున్నది. దీనికి కరోనా ఒక ఆటంకమైతే, దీన్ని అధిగమించడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థగానీ, రాష్ట్ర విద్యాశాఖ గానీ ప్రభావశీల నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యాయి. అవి చేసిందల్లా విద్యార్థులను ప్రమోట్ చేయడమే. తరగతి గదికి ప్రత్యామ్నాయం లేదు. ఆన్లైన్ విద్య అందరికీ సౌలభ్యం కాదు. నగరాలు, గ్రామాలకు చాలా తేడా ఉంటుంది. నగరాలు, పట్టణాల్లోని తల్లిదండ్రులు ఆర్థికభారమైనా తమ పిల్లల భవిష్యత్ కోసం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను సమకూర్చగలిగారు. అదే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు గాలికి తిరుగుతుంటే చూడలేక కష్టంగానైనా స్కూళ్లకు పంపడానికి సిద్ధమయ్యారు. వారి ఆర్థిక, సామాజిక నిస్సహాయస్థితి మూలంగా ఆన్లైన్ బోధన సాగలేదు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే, కొత్తగా చదువును ప్రారంభించాలనుకున్న చిన్నారుల సంగతేంటి?
జులై ఒకటి నుంచి అన్ని విద్యాసంస్థలు ప్రారంభమవుతున్నాయి. ఈనేపథ్యంలో మరోసారి విద్యార్థుల భవితపై చర్చ ఆరంభమైంది. సర్కారీ స్కూళ్లల్లో మౌలిక సదుపాయాల కొరత ఉంటే, ప్రయివేటులో ఫీజుల భయం పట్టుకుంది. తల్లిదండ్రుల ఇష్టంమేరకే పిల్లలను పాఠశాలలకు పంపాలని ప్రభుత్వం చెబుతుండగా, ఫీజులు వసూలు చేసుకున్నాక థర్డ్‌వేవ్ పేరుతో మళ్లీ మూతేస్తారని ప్రయివేటు స్కూళ్ల పిల్లల తల్లిదండ్రుల ఆందోళన. మొత్తం విద్యావ్యవస్థను చక్కదిద్దేందుకు రూ.4000 కోట్లు ఖర్చుచేస్తామని గత మార్చి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చెప్పిన గులాబీ సర్కారు, ఈ ఏడాది ఒక్కపైసా ఇవ్వకపోవడం గమనార్హం. కాగా ఫీజులకు సంబంధించి 2019-20లో ఇచ్చిన జీవో 46ను అమలుచేయడంలో సర్కారు మీనమేషాలు లెక్కించడం, ప్రయివేటు విద్యాసంస్థలకు కోరలు తొడుగుతున్నది. ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చిస్తామని సర్కారు చెబుతున్నా, గత ఏడాది అనుభవం అంతా డొల్లేనని చెబుతున్నది. ఆదాయాలు పడిపోయిన తల్లిదండ్రులు లక్షలకు లక్షలు కట్టలేక ఆందోళన, ఆవేదన చెందుతున్నారు. కరోనా వైద్యం పేర కార్పొరేట్ ఆస్పత్రుల తరహాలోనే విద్యాసంస్థలూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నాయి. హైకోర్టు పదే పదే చెప్పినా ప్రయివేటు ఆస్పత్రులు, విద్యాసంస్థల అక్రమ బిల్లులు, ఫీజులను సర్కారు అరికట్టలేకపోతున్నది. తక్షణమే ప్రభుత్వం అఖలపక్షం, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ప్రత్యామ్నాయ శాస్త్రీయ విధానంతో ముందుకు రాకపోతే పిల్లల భవిష్యత్ మోడువారే అవకాశాలే ఎక్కువ.