Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రెజిల్లో ఐదు లక్షల మంది కరోనాతో చనిపోవడంతో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు పూనుకున్నారు. దాదాపు ఏడున్నరలక్షల మంది వీధుల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టారు. ప్రపంచం నలుమూలలా ఇలాంటి నిరసనలు చిన్నవి పెద్దవి జరుగుతున్నాయి. వివిధ దేశాల్లో 2021 మేడే సందర్భంగా జరిగిన కార్మిక ప్రదర్శనలో కూడా కరోనా మహమ్మారిని అరికట్టడానికి ఆయా దేశాలలో ప్రభుత్వాలు పూనుకోవాలని, ఉపాధి లేనందున ఉపకార వేతనాలు ఇవ్వాలని, పనిలోకి రమ్మని ఒత్తిడి చేయరాదని కార్మికుల వారి కుటుంబాల ప్రాణాలను ప్రమాదంలో పడేయరాదని డిమాండ్ చేశారు.
కరోనా వైరస్ ఏమిటి, ఇది ఇంత ప్రమాదకారిగా ఎందుకు మారింది, దీని మూలాలు ఎక్కడ ఉన్నాయి అని అనేకమంది అమెరికాలోని శాస్త్రవేత్తలు అధ్యయనాలు చేశారు. ఈ మహామ్మారికి ఇప్పుడు అమలు జరుపుతున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలే ప్రధాన కారణమని రాజ్ వాలేస్ వంటివారంటున్నారు. ప్రపంచ దోపిడీలో భాగంగా సాగే పారిశ్రామికీకరణ, వ్యవసాయం, దానికి వాడే ఎరువులు, పురుగు మందులు, అడవుల నరికివేత వలన వాతావరణ సమతుల్యత దెబ్బతినడంతో కొత్త వైరస్లు పుడుతున్నాయని చెబుతున్నారు.
నయా ఉదారవాద విధానాలను పాటిస్తున్న మితవాద ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వైరస్ ఎక్కుడ పుట్టింది, జంతువుల నుంచి వచ్చిందా, గబ్బిలాల నుంచి వచ్చిందా అనే అంశాల చుట్టూ చర్చను తిప్పుతూ ఇది సాధారణ జలుబుతో సమానం అని మభ్యపెట్టే ప్రయత్నాలు చేశాయి. అమెరికా, బ్రెజిల్, భారతదేశ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఎక్కువ మరణాలు సంభవించాయి. అమెరికాలో కేసులు 3.5కోట్లు, మరణాలు ఆరులక్షలు. బ్రెజిల్ మరణాలు ఐదు లక్షలు. భారత్‌లో కేసులు 3 కోట్లు, మరణాలు నాలుగు లక్షలు. ఎన్నికలు నిర్వహించడం, మత కూటములు నిర్వహించడం, కరోనా అదుపులోకి రాకుండానే పరిశ్రమలు బలవంతంగా ఉత్పత్తి ప్రారంభించడం ఇందుకు ఉదాహరణలు.
వైరస్ల నుంచి ప్రజలకు వచ్చే నష్టాన్ని తగ్గించే చర్యలకు పూనుకోకుండా పెద్ద కార్పొరేట్ సంస్థల లాభాలను పెంచే చర్యలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అందుకే వ్యాక్సిన్లు తయారు చేసే మందుల కంపెనీలకు పేటెంట్ హక్కులు ఉంటాయని వారు ధరలు పెంచి పెద్ద మొత్తాలలో లాభాలు గడించడానికి వెసులుబాటు కల్పిస్తున్నాయి తప్ప ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన సమయంలో పేటెంట్లను ప్రక్కన పెట్టడానికి ముందుకు రావడం లేదు. సార్వత్రిక ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే కొందరికి వ్యాక్సిన్ ఇచ్చి మిగతా వారికి వ్యాక్సిన్ కొనుగోలుశక్తి లేనందున వారిని వదిలిపెడితే రెండు డోసులు తీసుకున్న వారికి కూడా మళ్ళీ వైరస్ సోకుతుంది. వైరస్‌కు ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు అనే తేడా ఉండదు. దేశం యొక్క సరిహద్దులను అది గౌరవించదు. కాబట్టి ఎక్కడ ఉన్నా ఎక్కడికైనా సోకగలదు. ఒక్కరికి వచ్చినా అందరికి సోకగలదు అనేది గుర్తించి ప్రభుత్వాలు తమ బాధ్యతగా అందరికీ వ్యాక్సిన్ ఉచితంగా అందించేందుకు బాధ్యత వహించాలి.
నయా ఉదారవాద విధానాలు అమలు జరిపే దేశాలలో ప్రభుత్వాలు వైద్య రంగానికి నిధులు చాలా అరకొరగా ఖర్చుపెడుతుంటాయి. అవి ఇలాంటి అత్యవసర పరిస్థితులలో సరిపోవు. ప్రపంచంలో 50సంవత్సరాల నుంచి ఈ విధానాలు అమలులో ఉన్నందున ప్రభుత్వ ప్రజా ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా శిథిలమైపోయింది. కార్పొరేట్ వైద్యం ఆధిపత్యంలోకి వచ్చింది. డబ్బు చెల్లిస్తే వైద్యం, లేకపోతే లేదు అనే స్థితి రాజ్యం ఏలుతున్నది. ఒకమాటలో చెప్పాలంటే నయా ఉదారవాద విధానాలు యాసిడ్లాగ మొత్తం సమాజాన్ని క్రమంగా తినేస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో జరిగిన జీ-7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో పేద దేశాలకు వ్యాక్సిన్ ఇస్తామని, వ్యాక్సిన్ తయారీ, పంపిణీకి బాధ్యతలు పంచుకుంటామని చెప్పాయి. కావాల్సిన దానికి వారు వాగ్దానం చేసినవి పదోవంతు కూడా లేవు అనేది అర్థం చేసుకోవాలి.
ప్రపంచం ఎన్నో మహమ్మారులను ఇప్పటికే చూసింది. జీకా (బ్రెజిల్), సార్స్ (చైనా), సైన్ ఫ్లూ (ఉత్తర అమెరికా), మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సింగ్రోమ్ రాబోయే రోజుల్లో ఇంకా పెరగవచ్చని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. వైరస్ పుట్టుకకు అనేక కారణాలు, పరిస్థితులు ఉంటాయి. వాటిని తట్టుకుని సాధారణ ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా ప్రభుత్వాలు తమ వైద్య విధానాలను సిద్ధం చేసుకోవాలి.
చైనా ఇప్పటికే 100కోట్ల మందికి వ్యాక్సిన్స్ ఇచ్చింది. ఇక సామూహిక వ్యాప్తికి అవకాశాన్ని తగ్గించింది. వైరస్ సోకినట్టు తెలవగానే ఆ ప్రాంతాన్ని పూర్తి కట్టడి చేస్తున్నది. ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకుంటున్నది. చైనా, క్యూబా, వియత్నాం, లావోస్ సోషలిస్టు ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నందువలన ప్రజల ప్రాణాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఉదారవాద ఆర్థిక విధానాలు పాటిస్తున్న దేశాలు మందుల కంపెనీల లాభాలకు, ప్రయివేటు వైద్యంకు పెద్దపీట వేసి ప్రజలను గాలికి వదిలేస్తున్నాయి.
నయా ఉదారవాద విధానాలను పాలకులు అమలు చేస్తున్నంత కాలం ఇలాంటి మహమ్మారుల నుండి మానవ సమాజాన్ని కాపాడుకోలేము. అడవులను రక్షించుకోవాలి, వాతావరణ సమతుల్యతను కాపాడుకోవాలి, కృత్రిమ పద్ధతులను అవలంబించడం మానాలి. అడవులను బతకనిస్తే అవే వైరస్‌లను అదుపులో ఉంచుతాయి.