Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాఠిన్యం, క్రౌర్యం, క్రూరత్వం, కిరాతకం ఇలా ఎన్ని రకాలుగా పలికినా మొత్తం కలిపితే రాక్షసత్వం అని అనవచ్చో, ఇంకా అంతకంటే ఏదైనా పదం ఉందో వెతకాలి. ఎందుకంటే చిన్నప్పుడు చదువుకున్న కథల్లో రాక్షసులు కూడా అంత కఠినంగా అనిపించేవాళ్ళు కాదు.. మనుషుల్ని తినేసినా ఊరవతల ఉండి రోజుకొకర్ని పంపమని మర్యాదగా, ఓ పద్ధతి ప్రకారమే అంతమొందించేవారు మరి! మనిషి అనే మాటకు పూర్తి విరుద్ధమైన, వ్యతిరేకమైన కరుకు మృగలక్షణాలు, మనుషులుగా చలామణీ అయ్యేవాళ్ళకు ఎలావచ్చాయి? ఇది చరిత్ర తిరగేయాల్సిన ప్రశ్న.
''ఇరువై కోరల, అరవై కొమ్ముల, క్రూర ఘోర కర్కోటకులో? కోరకి కన్నూ, కొమ్ముకి కన్నూ, కర్కాటక కర్కోటకులో? దారుణ మారణ దానవ భాషలు! ఫేవర భైరవ భీకర ఘోషలు! ఘోషల భాషల, ఘంటల మంటల కంటక కంఠపు గణగణలో?'' అని మహాకవి బీభత్స హింసా ప్రవృత్తులను శబ్దీకరించారు. స్వర్గం, నరకం అని పేరు పెట్టి మానవులు నరకంలో విధించే శిక్షలు అత్యంత కిరాతకమైనవిగా పేర్కొన్నారు. అంటే చంపడం అనేది కూడా ఇంత దారుణంగా చేయొచ్చని ముందుగానే ఊహించి ఏర్పాట్లు చేశారంటే వాళ్ళెంత కర్కోటకులో తెలిసివస్తుంది.
బానిస సమాజం నుండే ఈ రకమైన జుగుప్సాకరమైన హింసతో కూడుకున్న శిక్షలు మనం చూడవచ్చు. 'అపరిచితుడు' సినిమాలో ఒక్కొక్క మనిషిని చంపడానికి ఎన్నెన్ని రకాలున్నాయో స్పష్టంగా చూపిస్తారు. బానిస సమాజం నుండి మనుషుల కష్టాన్ని శ్రమని దోచుకోవటం విపరీతంగా పెరిగింది. దోచుకోవడాన్ని వ్యతిరేకించే వారిపై రాజ్యం, రాజ్యం నిర్వహణకు వినియోగించుతున్న సైన్యం, భటులతో క్రూరమైన అణచివేతకు పూనుకుంటుంది. అందుకు కావలసిన తర్ఫీదూ రాజ్యంలో ఉంటుంది. ఆ శిక్షలు, హింస చాలా క్రూడ్గా మనకు కనిపించొచ్చు. నియంతృత్వమనీ అనొచ్చు.
బానిస సమాజం పోయింది. భూస్వామ్య సమాజం వచ్చింది. ఇప్పుడు ఆధునికమైన పెట్టుబడిదారీ ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చింది. అంటే ప్రజల్ని, శ్రామికుల్ని దోచుకోవటం తరిగిందా? పెరిగిందా? కచ్చితంగా చెప్పవచ్చు పెరిగింది. కానీ రూపం మారింది. అణచివేసే రూపాలూ మారాయి. ఇంకో దుర్మార్గమేమంటే ప్రజల చేతనే పరిపాలింపబడుతోందని చెప్పి దోపిడీకి కొమ్ముకాస్తున్నారు. ప్రజలను అణచివేస్తున్నారు. ఆ పర్యవసానంగా వచ్చిందే నేటి మన పోలీసు వ్యవస్థ. రెండు వందలయేండ్లు పరిపాలించిన బ్రిటిష్వాడి పోలీసు శిక్షణే నేటికీ మనకుంది.
కాబట్టి మనం గ్రహించవలసిన సారాంశమేమంటే దోపిడీ వ్యవస్థ ప్రతిఫలనమే ఈ క్రూరత్వం. దీనికి వేలయేండ్ల చరిత్ర ఉంది. మనదేశంలో ఇది కుల వ్యవస్థ ఆధారంగా కూడా కొనసాగుతోంది. ఇది మరో పీడన. తరతరాలుగా పీడనా దోపిడీ అణచివేతా అన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న సమాజం మనది. దీనిని మరింత పటిష్టంగా నిలబెట్టుకోవాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్న వాళ్ళే మన పాలకులుగా ఉన్నారు. అదీ అసలు కథ.
అయితే ఈ క్రూరత్వాన్ని అలవాటు చేసుకునే పోలీసులూ మనుషులే. మనలాంటి మనుషులే. బతుకుదెరువు కోసం పోలీసులవుతారు. పోలీసుల్లోనూ కరుణ రసహృదయులూ ఉంటారు. స్నేహ శీలురూ ఉంటారు. కానీ వృత్తినేర్పే కఠిన్యమూ మనుషుల్లో దాగుండే క్రూర స్వభావమూ కలిసి కిరాతకాలు చేయిస్తుంది. 'పొట్టకూటి కోసం పోలీసన్నా, మా పొట్టలు కొడుతున్నావా బానిసన్నా!'' అని పాడుకొంటున్నాము కూడా.
కానీ అడ్డగూడూరు పోలీసు స్టేషన్లో మరియమ్మ అనే దళిత మహిళను విచారణ కోసం తీసుకువచ్చి, అత్యంత దారుణంగా కొట్టి, కడుపులో తన్ని చంపడం ప్రజాస్వామ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. అడ్డం వచ్చిన కొడుకునూ స్నేహితుణ్ణీ గొడ్డును కొట్టినట్టు కొట్టి పడేయటం అటవిక శిక్షను గుర్తుకు తెస్తుంది. ఇది మొట్టమొదటి సారిగా జరిగిన క్రూరత్వం కాదు. చుండూరు, కారంచేడు, మొన్న నేరెళ్ళ, నేడు మరియమ్మ ఇంకా ఎన్నో ఎన్నో..! ఎందుకంటే ''వాళ్ళ వెనకాల ఎకరాల భూమిలేదు, పూరి గుడిసెలు తప్ప ఎకౌంట్ల లావాదేవీలు లేవు, పొయ్యిలో పిల్లిలేస్తే గొప్ప, కనీసం ఊర్లోనూ ఉండే వాళ్ళు కాదు, చివరన చిరునామాయే లేనోళ్ళు, అయినా వాళ్ళు కాగితపు కరెన్సీలు కాదు, అచ్చమైన మనుషులు'' అందుకే తేలిక భావం. ధన బలమో, పరపతో, అగ్రవర్ణమో అయివుంటే ఇంత తేలిగ్గా చంపేవాడా వాడు! లేదు. బలహీనుల పట్ల రాజులకు, పాలకులకు ఉన్న చూపే పోలీసుకూ ఉండింది అంతే!
అసలు విషాదమేమంటే, కిరాతకుడు కొట్టాడు, చంపాడు. ప్రజాస్వామ్యమని, రాజ్యాంగమని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని మహాఘనంగా సెలవిచ్చే పరిపాలకులు ఇది దారుణమని, అన్యాయమని కనీసం మాటవరుసకైనా పలకరేమి! మరియమ్మ దెబ్బలతో మరణించిందన్నది అందరికీ తెలిసిన విషయంగానే స్పష్టమవుతూ ఉన్నది. మరి చర్యలు చేపట్టరేమిటి? అమెరికాలో శ్వేతజాతీయ పోలీసు దురహంకారానికి దారుణంగా బలయిన జార్జిప్లాయిడ్ ఉదంతం అనంతరం లక్షలాది ప్రజాస్వామికవాదులు ఉవ్వెత్తున కదిలారు. ఉద్యమించారు. నేరస్తులకు శిక్షపడేలా చేశారు. ఇక్కడా నిరసన పెల్లుబుకాలి. క్రూరత్వంపై మానవత్వం గెలవాలి. చట్టం ముందు అందరూ సమానమన్న రాజ్యంగం కల్పించిన హక్కును రక్షించుకోవాలి. ''మనం ఓటి కుండలమై మోగటం ఆపి మసిలే నీళ్ళయి కురిసినప్పుడే మరియమ్మలకు న్యాయం'' అన్న జి. లక్ష్మీనర్సయ్యగారి కవితా పాదాల్లా మనమంతా నిప్పులు కురవాల్సిందే. క్రూరత్వాలకు సమాధి కట్టాల్సిందే.