Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఒక దేశం ఎందరు శత కోటీశ్వరులను కలిగి ఉన్నదనే దాన్ని బట్టి కాదు.
ఆ దేశంలో ఆకలి దప్పులు లేని ప్రజా బాహుళ్యం ఎందరున్నారనేదాన్ని బట్టి
ఆదేశం ఒక క్రమ పద్ధతిలో నడుస్తోందని చెప్పవచ్చు..'' - మహాత్మాగాంధీ
కరోనా మహమ్మారి మానవ జీవితాల్ని చిదిమివేస్తున్నది. జీవనాధారాలనూ కూల్చివేస్తున్నది. ఈ 'వర్తమానం' భవిష్యత్ ఎవరూ చెప్పలేకున్నారు. మనదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేక 56అంగుళాల ఛాతి ముడుచుకుబోయింది. టీకాలు ప్రారంభించి (జనవరి 16) ఐదు నెలలు దాటుతున్నా ఐదుశాతం మందికి మించి టీకాలందించలేక 'విశ్వగురు' చతికిల బడ్డారు. వీరభక్తితో కళ్ళు, చెవులు మూసుకుపోయిన బధిరాంధులకు తప్ప మిగిలిన కోట్లాది మందికి దేశ ఆర్థిక వ్యవస్థ ధ్వంసమవుతున్నదని స్పష్టంగా అవగతమవుతూనే ఉంది.
పంటకైనా, మనిషికైనా పట్టిన చీడేమిటో, వచ్చిన జబ్బేమిటో అర్థమైతేనే దానికి సరైన విరుగుడు వాడవచ్చు. తమ అగ్రజులు అమెరికా వంటి దేశాల్లో ఆచరించి చూపిన విధానాన్ని సైతం పక్కకి పడేసి నాటు వైద్య పద్ధతులనాశ్రయించడమే భారతదేశంలో భారతీయ జనతాపార్టీ ప్రత్యేకత. పైగా జరిగిన మంచిని తనకూ, చెడును ఇతరులకూ ఆపాదించడానికి అలవాటుపడ్డ భారత ప్రధాని, నేడు భారత ఆర్థిక వ్యవస్థ దిగజారిపోవడానికి కారణం రాష్ట్రాలేనని నొక్కి వక్కాణిస్తున్నాడు. మొదటి దశ కరోనా దేశ జీడీపిని బాగా దెబ్బతీసింది. ఆ దశ లాక్డౌన్ ముగిసిన తర్వాత 'భక్తులు' మన ఆర్థిక వ్యవస్థ మళ్ళీ పట్టాలెక్కేసిందని మోడీకి సహస్రనామార్చన మొదలు పెట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని లాపర్వాగా వదిలేశాయి. రెండవ కెరటం విరుచుకు పడింది. ఒక్కో రాష్ట్రం ఒక్కో పద్థతిలో లాక్డౌన్ ప్రకటించాయి. మొత్తం మీద ఆర్థిక వ్యవస్థ కుంటుకుంటూనైనా నడిచింది. కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం గత సంవత్సరం మొదటి త్రైమాసికమంత నాసిగా ఉండకపోవచ్చని కొందరు ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. గత సంవత్సర కాలంగా అణిచివేయబడ్డ (పెంట్‌అప్) డిమాండ్ ఒక్కసారిగా రానున్న పండుగల సీజన్లో విప్పారుతుందని పరిశ్రమాధిపతులు కూడా ఆబగా ఎదురు చూస్తున్నారు. లెక్కలు కట్టుకుంటున్నారు. వ్యక్తులు కనే పగటి కలలు నిజం కాకపోతే ఆ వ్యక్తులకే నిరాశ మిగులుతుంది. కాని దేశ రాజకీయ నాయకత్వమే అలాంటి ఊహాలోకాల్లో తాము విహరిస్తూ ప్రజల్నీ భ్రమల్లో ఉంచాలనుకుంటే చెల్లుబాటు కాదు. ఈ విషయం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, యూపీ స్థానిక సంస్థల ఎన్నికలూ రుజువు చేసాయి.
రెండవ కెరటం గ్రామాలపై విరుచుకుపడింది. గత రెండు సంవత్సరాలుగా మెరుగ్గా ఉన్న వానాకాలం ఈ సంవత్సరం కొంత సందేహాస్పదంగా ఉండటం మోడీగారికి మరో ''దుశ్శకునం''. అధికారయుతంగా ప్రకటించింది 3 కోట్ల కేసులు, 3.9 లక్షల మరణాలు. దీనికి ఎన్నో రెట్లు అధికంగా 18-24లక్షల మంది మరణించి ఉంటారని అనధికార అంచనా. ప్రజల వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగాయి. కోవిడ్ రానివారి విటమిన్లు, ఇతర అనుబంధ ఖర్చు 2020-21లో రూ.15వేల కోట్లని ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ సంస్థ వారు లెక్కలు తేల్చారు. ఇదే కాలంలో బ్యాంకుల్లో ప్రజలు తీసుకున్న గోల్డ్ లోన్స్ రూ.33,476కోట్ల నుంచి రూ.60,726 కోట్లకు పెరిగాయి. వాస్తవానికి రెండవ దశ ఉధృతమైంది 2021 ఏప్రిల్ నుండి. ఈ జూన్ నాటికి ఈ లెక్కని తాజాపరిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఆ బంగారాన్ని జనం విడిపించుకోలేక పోవడం వల్ల బ్యాంకులు దాన్ని వేలమేస్తున్నాయని కూడా తాజా వివరాలున్నాయి. వ్యవస్థపై వినియోగదారుల విశ్వాసం (కన్సూమర్ కాన్ఫిడెన్స్) అధమస్థాయిలో ఉందని నిన్న మే నెల్లో రిజర్వు బ్యాంకు అంచనా వేసింది. అంటే ఎటుపోయి ఎటువస్తుందోనన్న అనుమానంతో ప్రజలు ఖర్చు చేయరన్నమాట! ఫలితంగా ఆర్థిక వ్యవస్థ చక్రాలు కదలవు. దీనికి తోడు మనదేశంలోని నమ్మకాలు, కట్టుబాట్ల వల్ల ఒకింట్లో ఎవరైనా మరణిస్తే ఆ సంవత్సరం ఆ యింట్లో పండుగలు జరుపరు. ఫలితంగా పండుగల సీజన్‌పై పెట్టుబడిదార్లు పెట్టుకున్న నమ్మకం వమ్మయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ప్రజల చేతుల్లోకి డబ్బు పంపేందుకు మోడీ సర్కార్ ససేమిరా అంటున్నది. ప్రజల కొనుగోలు శక్తి పెరగనిదే దేశ ఆర్థిక వ్యవస్థ కుదుటపడదనేది సహజ పెట్టుబడిదారీ సూత్రం. దీన్ని కూడ ప్రభుత్వం నిరాకరించడం దారుణం! ఈ స్థితిలోనూ మన కార్పొరేట్ల లాభాలు తగ్గడం లేదు. సెన్సెక్స్ పరుగు ఆగట్లేదు. మన దేశంలో బిలియనీర్ల సంఖ్య పెరగడమే కాదు, అంబానీ, అదానీల లాభాల పరుగు ఆకాశమే హద్దుగా సాగిపోతోంది. అందరికీ ఆర్థిక, సామాజిక న్యాయం అందిస్తానన్న మన ప్రజాస్వామ్య రిపబ్లిక్లో కేవలం ఒక్కశాతం భారతీయులు 62శాతం జాతీయ సంపదను స్వాధీనం చేసుకోగలగడం మనం ప్రశ్నించాల్సిన, ప్రతిఘటించాల్సిన అంశమే!
చైనాలో వందకోట్ల మందికి టీకా వేయడం పూర్తయింది. అమెరికా, ఇంగ్లండు మొదలైన దేశాల్లో 65శాతం తమ ప్రజానీకానికి టీకా వేశారు. ఫ్రాన్స్ తమ దేశంలో ఇక మాస్క్ వాడక్కల్లేదని ప్రకటించింది. మందరోగ నిరోధక శక్తి తమ దేశాల్లో ప్రాప్తించిందని ఆ దేశాలు విశ్వాసంతో ఉన్నాయి. మనదేశంలో బీజేపీ పార్లమెంటు సభ్యులు, మంత్రులే గోమూత్రం తాగమని, ఆవుపేడ పూసుకోమని ప్రచారం చేస్తుంటే మన భవిష్యత్ ఏంటి? ఈ ప్రభుత్వాన్ని వీలైనంత త్వరగా సాగనంపకుంటే అలలు కాదు, కరోనా సునామీలే రావచ్చు మనదేశంలో! హౌషియార్ రహౌ!!