Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉపయోగాల మాటెలావున్నా ఉద్దీపనలు మాత్రం వెలువడుతూనే ఉన్నాయి. వీటి తీరు చూస్తుంటే...
''పైపై సొగసులు కల్ల సుమా!
లోపలిదంతా డొల్ల సుమా!
నిజం తెలియమని నేనంటాను
లేదా కొంపే గుల్ల సుమా!'' అన్న దాశరథి కృష్ణమాచార్య కవితా వాక్కులు గుర్తుకు రాకమానవు. ప్రజల అసంతృప్తి పరాకాష్టకు చేరుతున్నప్పుడల్లా ఇలాంటి ప్యాకేజీలు వెలుగుచూడటం కరోనా కాలంలో పరిపాటిగా మారింది. తాజాగా రూ.6.29లక్షల కోట్ల ప్యాకేజీతో ఆర్థికమంత్రి మరో ఉద్దీపన ప్రకటించారు. వెంటనే ప్రధానమంత్రి ''అద్భుతం'' అంటూ అభినందించడం, హౌమ్‌మంత్రి ''మహాద్భుతం'' అంటూ వంతపాడటం కూడా షరా మామూలుగా జరిగిపోయాయి. ఈ ప్యాకేజీలు వెలువడిన ప్రతిసారీ ఈ ప్రభుత్వ పెద్దల ''జుగల్బందీ'' మీడియా పతాకశీర్షికల్లో అలరించమే తప్ప, ప్రజల జీవితాల్లో ప్రతిఫలించకపోవడం వైచిత్రి. వాటి ప్రయోజనాలు ప్రజలకు చెందనప్పుడు అవి ఎంత భారీ ఉద్దీపనలైనా ఏమిటి ఉపయోగం?
కరోనా రెండవ వేవ్‌లో మరింత దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గట్టిక్కించడమే లక్ష్యంగా ఈ ఆరులక్షల ఇరవైతొమ్మిదివేల ప్యాకేజీని ప్రకటించారు. కానీ ఇందులో ఈ సంవత్సరం నగదు రూపంలో ఖర్చు చేయగలిగింది యాభై నుంచి అరవై వేల కోట్లకు మించి ఉండదని ప్రముఖ రేటింగ్ సంస్థ ''ఇక్రా (ఐసీఆర్ఏ)'', ప్రఖ్యాత వాణిజ్య దినపత్రిక ''ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్''ల విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. కొంచెం లోతులోకి వెళ్లి పరిశీలిస్తే... ఈ ఆరు లక్షల కోట్ల భారీ ప్యాకేజీలో దాదాపు మూడున్నర లక్షల కోట్లు పారిశ్రామిక వేత్తలకు ఇచ్చే రుణాలే కావడం గమనార్హం. మరో యాభైవేల కోట్లు వైద్యరంగంలో మౌలిక సదుపాయాల కోసం రుణాలున్నాయి. అంటే ఇవి కూడా ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యాల జేబుల్లోకే చేరుతాయి. ఇక విద్యుత్ డిస్కంల నష్టాలు పూడ్చేందుకు తొంభైమూడు వేల కోట్లు, ప్రాజెక్టు ఉత్పత్తుల ఎగుమతులకు ముప్పైమూడు వేల కోట్లు, ఎగుమతులు బీమా కోసం ఎనభైఎనిమిది వేల కోట్లు, బ్రాడ్ బాండ్ సేవలకు సుమారుగా ఇరవైవేల కోట్లు, పర్యాటక రంగానికి వందకోట్లు, ఇలా దాదాపు ఐదులక్షల కోట్లకు పైగా ప్రయివేటు జేబుల్లోకి పోతే ఇక ప్రజలకు మిగిలేది ఏముంటుంది? చివరికి ఆహార భద్రత కింద వెచ్చించే తొంభైమూడు కోట్లు తప్ప ప్రజలకు లబ్దిచేకూర్చే పద్దు ఒక్కటీ లేదు. ఇంతకు ముందు కూడా ''ఆత్మనిర్భర్ భారత్'' అంటూ ఇదే తీరున 21లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. ఏం జరిగింది? ఆర్థిక వ్యవస్థ పతనాన్ని అడ్డుకోగలిగారా? కూలిపోతున్న ఉపాధిని ఆదుకోగలిగారా? ఈ మహమ్మారి కాలంలో పేదలు మరింత పేదలు కాగా, మధ్య తరగతి భారియెత్తున తగ్గిపోయిందని పలు అధ్యయనాలు స్పష్టం చేయడమే కాదు, ప్రజల జీవితానుభవమూ రుజువు చేస్తోంది కదా! కనుక ఈ ప్యాకేజీల ఫలితాలను ఏలినవారి మాటల్లో కాక, ప్రజల జీవితాల్లో చూడగలిగితేగానీ అసలు విషయం బోధపడదు. నిరుద్యోగం మరింత పెరిగిపోయింది. ఉపాధి తరిగిపోయింది. సామాన్యులు ఇన్నాళ్లూ కడుపుకట్టుకుని దాచుకున్న సొమ్మూ కరిగిపోయింది. కరోనా తొలి యేడాదిలోనే అదనంగా 23కోట్లమంది నిశ్శబ్దంగా దారిద్య్రరేఖ దిగువకు జారిపోయారు. అదే సమయంలో అత్యంత ధనికుల సంపద మాత్రం అమాంతం పెరిగిపోయింది. కేవలం గత ఆర్థిక సంవత్సరంలోనే లిస్టెడ్ కంపెనీల కార్పొరేట్ నికర లాభాలు 57.6శాతం పైకి ఎగబాకాయి. దేశంలోని శతకోటీశ్వరుల సంపద ఏకంగా 35శాతం పెరిగిపోయింది. ఈ కరోనా కాలమంతా, అసంఖ్యాకులైన భారత ప్రజలు తమ ఆదాయాలనూ, జీవనోపాధినీ కోల్పోగా, పిడికెడు మంది బడాబాబులు మాత్రం అంతులేని సంపద సొంతం చేసుకున్నారు. అంబానీ సంపద రూ.8,400 కోట్ల డాలర్లకు, అదానీ ఐశ్వర్యం 7,800 కోట్ల డాలర్లకూ దూసుకుపోయాయి. అంటే... పేదలు మరింత పేదలుగా, ధనికులు మరింత ధనికులుగా మారే పరంపర ఈ కాలంలో శరవేగంగా జరిగిపోయింది. మరి ఈ ఉద్దీపనలు ఎవరిని ఉద్దరిస్తున్నట్టూ..?!
అందుకే సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి ''ఇది పాత ప్రకటనలకు కొత్త ముసుగులు తొడిగే ప్రయత్నం మాత్రమే'' అని వ్యాఖ్యానించారు. ఎంతటి ప్రజా వ్యతిరేక విధానానికైనా ఆకర్షణీయమైన రంగులూ హంగులూ అద్దడంలో ఆరితేరిన మన ఏలినవారి కళా కౌశలానికి మరో ఉదాహరణ ఈ ఉద్దీపన. ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేయని ఉద్దీపనలు, ప్రజల కొనుగోలు శక్తిని పెంచని ప్యాకేజీలు ఎన్నొచ్చినా నిష్పలమేనని అనుభవం చెపుతుంటే... అందుకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కోవిడ్ మృతులకు పరిహారం చెల్లించడానికి డబ్బులు లేవంటోంది ప్రభుత్వం. నిజానికి ప్రభుత్వం చెపుతున్న లెక్కల ప్రకారమే చూసినా, దేశంలో కోవిడ్ మరణాలు నాలుగు లక్షలు. మరణానికి నాలుగు లక్షల పరిహారమివ్వడానికి పదహారువేల కోట్లు మాత్రమే ఖర్చవుతుంది. ఇందుకు చేతులు రాని ప్రభుత్వం 'సెంట్రల్ విస్టా' నిర్మాణానికి మాత్రం ఇరవైవేల కోట్లు ఖర్చుపెడుతోంది.
దీనిని బట్టి ఈ ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటో, ఈ ప్యాకేజీల పరమార్థమేమిటో అర్థం చేసుకోవచ్చు. నిజాల్ని గ్రహించగలిగినప్పుడే వివేకంతో ప్రశ్నించగలం. విమర్శ నిర్వహించే పాత్రను చాలా మంది అపార్థం చేసుకుంటారు గానీ, అది మాత్రమే జవాబుదారీతనాన్ని నిర్మించగలదు. లేదంటే దాశరథే చెప్పినట్టు ''కళ్లెం ఉన్నది మన చేతిలో గుర్రం మాత్రం పడె గోతిలో'' అన్న చందంగా తయారవుతుంది మన ఆర్థిక వ్యవస్థ.