Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై మరోసారి రాజకీయ దుమారం రేగుతున్నది. ప్రధానంగా కృష్ణా నదీ ప్రాంతంలో ఏపీ చేపడుతున్న పలు ప్రాజెక్టుల నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ చర్చకు ఆస్కారం కలిగింది. తెలుగు రాష్ట్రాల మధ్య ఈ పంచాయతీలు ముదురుతున్నాయి. తొలినాళ్లలో తెలుగురాష్ట్రాల సీఎంల మధ్య అలరు బలరు బాగానే నడిచినా, ఏడాది కాలంగా ఆ సఖ్యత ఆనవాళ్లు కనిపించడం లేదు. ఇదిలావుండగా రాష్ట్రాల మధ్య వివాదాలను, తగాదాలను పరిష్కరించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నది. కావాలనే రెండు రాష్ట్రాల జుట్లు ముడేసి రాజకీయ చదరంగం ఆడుతున్నది. తద్వారా రాష్ట్రాల సాగునీటి ప్రయోజనాలను దెబ్బతీస్తున్నది. ప్రధానంగా తెలంగాణ సాగునీటి అవసరాలు నెరవేరడం లేదు.
కృష్ణాజలాల వివాదం పరిష్కారానికి బ్రీజేశ్కుమార్ కమిషన్ వేసి 15 ఏండ్లు. అయినా నేటికి కొలిక్కిరాలేదు. ఆ కమిషన్‌ను పరిష్కారం చేయనివ్వకుండా కేంద్రంలోని బీజేపీ సర్కారు అడ్డు పడుతున్నది. స్వార్థ రాజకీయాల కోసం తాత్సారం చేస్తున్నది. అపెక్స్ బోర్డులో కేంద్ర సాగునీటి శాఖ మంత్రితోపాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ సభ్యులుగా ఉండి ఒత్తిడి చేస్తున్నా, పరిష్కారాన్ని చూపడంలో కేంద్రం చొరవ అంతంతే. మరోవైపున రాష్ట్రంలోని బీజేపీ తన బాధ్యతను మరిచింది. కేంద్రంపై ఒత్తిడి చేయకుండా దుందుడుకు విమర్శలు చేస్తున్నది. నాలుగేండ్లుగా కృష్ణాజలాల పంపిణీ ఆంధ్రా, తెలంగాణకు కేటాయించడానికి నిర్ణయించిన విషయం కూడా పెండింగ్‌లోనే ఉన్నది. కృష్ణాబేసిన్‌లో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలు పూర్తిగా ఉన్నాయి.
బచావత్ ట్రిబ్యునల్ 1976, మే లో చేసిన అవార్డ్ ప్రకారం తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రాకు 512 టీఎంసీలు కేటాయించారు. బ్రీజేశ్కుమార్ ట్రీబ్యునల్ కనీసం తెలంగాణకు 300 టీఎంసీలనైనా అవార్డ్ చేయాల్సి ఉంది. ఏండ్లుగా తీర్పు ఇవ్వకపోవడంతో మహబూబ్‌నగర్‌లో నాలుగు ప్రాజెక్టులు కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌తోపాటు పాలమూరు ఎత్తిపోతల, ఆర్డీఎస్ విస్తరణ, ఆలంపూర్ లిఫ్టు, పులిచింతల ఎడమకాలువ, నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టుల నిర్మాణాలు మొదలెట్టారు. వీటికి ఎలాంటి ఆటంకాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం రీడిజైన్ పేరుతో కాళేశ్వరం, సీతారామసాగర్, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులను చేపట్టింది. కాగా సర్కారు దృష్టి గత మూడేండ్లుగా కాళేశ్వరంపైనే ఉంచి పనులు సాగిస్తున్నది. పాలమూరు ఎత్తిపోతలకు రూ. 85 వేల కోట్లు వ్యయం చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ. 6 వేల కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు. దీనికితోడు డిండి ప్రాజెక్టుకూ రూ. 5600 కోట్లతో శ్రీకారం చుట్టారు.
శ్రీశైలం సొరంగమార్గం ద్వారా నల్లగొండకు నీరివ్వాల్సివుండగా, 43 కిలోమీటర్ల టన్నెల్కుగాను 10 కిలోమీటర్ల మేర పనులు ఇంకా పూర్తికాలేదు. ఏడేండ్లుగా కాలయాపన చేస్తూ అలాగే ఉంచేశారు. సొరంగమార్గం పూర్తయితే గ్రావిటి ద్వారా నల్లగొండ జిల్లాకు 5.5 లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉంది. టన్నెల్‌ను పూర్తిగా తవ్వకపోవడంతో ప్రభుత్వం రూ. 10 వేల కోట్లు అదనపు భారాన్ని మోయాల్సి వస్తున్నది. దీంతో సొరంగాన్ని త్వరితగతిన పూర్తిచేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రైతు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పూర్తయిన ప్రాజెక్టుల బ్రాంచ్‌కెనాళ్లు, ఫీల్డ్ ఛానెళ్లు తవ్వని నేపథ్యంలో పూర్తి ఆయకట్టు సాగులోకి రావడం లేదు. తద్వారా వేల కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టులు కట్టినా ప్రజాప్రయోజనాలు నెరవేరడం లేదు. ఏండ్లతరబడి పెండింగ్‌లో పెట్టడం మూలంగా రాష్ట్రాల మధ్య తగాదాలు పెరుగుతున్నాయి. పనులు ఆపాలనే డిమాండ్లు పదే పదే రాజకీయపక్షాల నుంచి వస్తున్నాయి. ఒకవైపు మెట్ట ప్రాంతాల రైతులు, ప్రజలు నీరు వస్తుందనే ఆశతో ఎదురుచూస్తూ నిరాశకు గురై వలసలు పోతున్న దుస్థితి. రుణగ్రస్తులైన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలో ఈతరహా విషాద మరణాలూ అధికమే. ఆదిలాబాద్‌లో 25 మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణాలు రెండు దశాబ్ధాలుగా కొనసాగుతూనే ఉండటం గమనార్హం. రాష్ట్ర బడ్జెట్లో రూ.1500 కోట్లు చెల్లిస్తే, ఆ జిల్లా శాశ్వతంగా కరువు నుంచి బయటపడుతుంది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని ప్రాజెక్టులు కూడా పూర్తిచేయాల్సిన బాధ్యత సర్కారుదే.
ప్రజల అభిప్రాయాన్ని మన్నించి కృష్ణానదిపై చేపట్టిన ప్రాజెక్టులు, లిఫ్టులు సత్వరమే పూర్తిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది సమస్యలకూ చెల్లుచీటి పాడుతుంది. కేంద్రం జీఎస్టీ తెచ్చిన తర్వాత రాష్ట్రానికి వస్తున్న పన్ను ఆదాయం కూడా రూ. 3000 నుంచి రూ.5000 కోట్ల వరకూ తగ్గాయి. ఈమేరకు పరిహారం చెల్లిస్తామని మోడీ సర్కారు వాగ్దానం చేసింది. ఆ డబ్బులు విడుదల చేస్తే, పెండింగ్ ప్రాజెక్టులు సకాలంలో పూర్తికావడానికి అవకాశాలేర్పడతాయి.