Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చైనా కమ్యూనిస్టు పార్టీ తన శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నది. తొమ్మిది కోట్లమంది పార్టీ సభ్యులతో ఒక బలమైన కమ్యూనిస్టు పార్టీగా నిలిచి ఉన్నది. చైనా సమాజంలోని అన్ని వర్గాల్లో బలమైన సంబంధాలు కలిగియున్నది. మార్క్సిజాన్ని చైనా నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించి 1949లో విప్లవం జయప్రదం చేయడమే గాక నేడు అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా చైనాను నిలపడంలో చైనా కమ్యూనిస్టు పార్టీ పాత్ర అద్వితీయమైనది.
1921 జులై 1న చైనా కమ్యూనిస్టుపార్టీ ఆవిర్భవించింది. అనంతరం 28సంవత్సరాలకే రాజ్యాధికారం సాధించగలిగింది ఆ పార్టీ. ప్రపంచగతిని మార్చిన మూడు ప్రధాన ఘటనలు.. 1917లో సోవియట్‌లో అక్టోబర్ మహా విప్లవం, 1946లో ఫాసిజంపై విజయం సాధించి 2వ ప్రపంచ యుద్ధానికి పరిసమాప్తి పలకడం, చైనాలో విప్లవ విజయం.. ఎందుకంటే ఆ తర్వాత వలస వ్యవస్థ పేకమేడలా కూలిపోయింది.
ఈ రోజు చైనా 12లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో ప్రపంచ జీడీపీలో 15శాతం వాటా కలిగి ఉన్నది. ప్రపంచంలో రెండవ ఆర్థిక శక్తిగా ఎదిగింది. దీనికి మూలకారణం చైనా కమ్యూనిస్టుపార్టీ మార్గదర్శకత్వంలో ప్రభుత్వం నడవడమే. నిర్దిష్ట పరిస్థితులను నిర్దిష్టంగా అధ్యయనం చేసి దీర్ఘకాలిక, తక్షణ ప్రణాళికలను రూపొందించుకుని పార్టీ, ప్రభుత్వం దాని సాధనకు ఏకకాలంలో పట్టుపట్టి సాధిస్తుంటారు.
చైనా కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో 1924 నుండి 1945 వరకు వీరోచితమైన సాయుధ పోరాటం జరిగింది. ఈ కాలంలో చైనా కమ్యూనిస్టు పార్టీ మూడు సూత్రాలను పాటించింది. అవి ఐక్య సంఘటన, సాయుధ పోరాటం, పార్టీ నిర్మాణం. వీటిని పాటించి శత్రువును ఓడించి, విప్లవమార్గంలో పురోగమించింది.
1945లో చైనా ఈశాన్య ప్రాంతం నుండి రష్యా వెన్నుదన్నుగా జపాన్‌పై పెద్దఎత్తున లాంగ్‌మార్చ్ నిర్వహించింది. ఆ యుద్ధంలో 2.1కోట్ల మంది చైనా ప్రజలు చనిపోవడమో గాయాల పాలవడమో జరిగింది. అందులో ఆరులక్షల మంది చైనా కమ్యూనిస్టుపార్టీ యుద్ధవీరులే. 10లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని 10కోట్ల మంది నివసించే ప్రాంతంలో విముక్తి ప్రాంతాలు ఏర్పాటు చేశారు. ఈ విముక్తి ప్రాంతాలలో పార్టీ 1947లో భూచట్టం అమలు జరిపి యుద్ధ ప్రభువుల భూమిని స్వాధీనం చేసుకుని భూమిలేని పేదలకు పంచింది. భూసంస్కరణలు అమలు జరిపి ప్రభుత్వం భూస్వామ్య దోపిడీని అంతం చేసి వ్యవసాయం అభివృద్ధికి పూనుకున్నది.
1949 ఏప్రిల్‌లో కొమింగ్టంగ్ రాజధానిని హస్తగతం చేసుకున్నది. ఇది శత్రువు ఓటమికి మూలకారణం అయింది. ఈ మొత్తం పోరాటంలో కార్మికవర్గం, నాయకత్వంలో రైతాంగం కదిలింది. యుద్ధ ప్రభువులు, జపాన్ సామ్రాజ్యవాదులు ఓడించబడ్డారు.
1949 అక్టోబర్ 1న చైనా ప్రజారిపబ్లిక్ ఏర్పాటు అయినట్టు మావో ప్రకటించారు. నూతన ప్రజాస్వామ్యం ఏర్పడినట్టు, అది కార్మికవర్గం నాయకత్వంలో కార్మికులు, రైతులు, ప్రజాస్వామిక వాదులు అన్ని జాతులవారి ఐక్యతతో ఏర్పడినట్టు ప్రకటించారు. దీనితో అర్థవలస, అర్థభూస్వామ్య వ్యవస్థ సోషలిస్టు సమాజంగా పరిణామం చెందడం ప్రారంభం అయింది.
మావో ఆయన సహచర బృందం నాయకత్వంలో చైనా కమ్యూనిస్టుపార్టీ విజయం సాధించింది. మార్క్సిజం, లెనినిజం సిద్ధాంత ప్రాతిపదికగా ఇది జరిగింది. 1978 నుండి విదేశీ పెట్టుబడులను సాంకేతిక సహాయాన్ని ఆహ్వానించింది. చైనాను ఆధునిక సోషలిస్టు దేశంగా మలిచేందుకు చర్యలు చేపట్టింది. దీనికి డెంగ్ జియావో పింగ్ మార్గదర్శకత్వం వహించారు. సోషలిజం అంటే పేదరికం కాదు, ప్రజలకు సౌకర్యవంతమైన జీవితం అందించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. దాని ప్రతిఫలంగా 1978లో 15వేల కోట్ల డాలర్లతో ప్రపంచ జీడీపీలో 1.75శాతంగా ఉన్న చైనా జీడీపీ నలభై సంవత్సరాల తరువాత 12.2లక్షల కోట్ల డాలర్లతో ప్రపంచ జీడీపీలో 15శాతం వాటాకు ఎదిగింది. చైనాలో రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే చౌకసరుకుల వ్యవస్థ రద్దు చేశారు. పేదరికం పూర్తిగా నిర్మూలించిన మొదటి దేశం చైనా. శాస్త్ర, సాంకేతిక రంగంలో చైనా తిరుగులేని శక్తిగా ఎదిగింది. 5జీ, కృత్రిమమేథ, క్వాంటమ్ థియరీ సోలార్ విద్యుత్, కాలుష్య నియంత్రణలో ముందున్నది.
ఇన్ని విజయాలు సాధించడానికి అక్కడ పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉండటం. ప్రజలతో అంటిపెట్టుకుని వారి సుఖ దు:ఖాలలో భాగస్వాములు కావడం కీలకమైన అంశం. అక్కడ పార్టీ సభ్యులు 9కోట్లు. అందులో 27.2శాతం మహిళలు, కార్మికవర్గం - రైతాంగం నుండి వచ్చినవారు 35.3శాతం మంది ఉంటారు. ఇది అక్కడ పార్టీ వర్గ పొందిక.
చైనా కమ్యూనిస్టుపార్టీ ఏర్పడి 2021 జూలై 1తో 100సంవత్సరాలు నిండుతున్నాయి. ఈలోపు సమర్థవంతమైన అన్ని సౌకర్యాలు ఉన్న మంచి సమాజం నిర్మించాలని లక్ష్యంగా ప్రకటించుకుని పూర్తిచేశారు. 2050నాటికి ఆధునిక సోషలిస్టు దేశంగా ఎదగాలనే లక్ష్యం పెట్టుకున్నారు. అంటే సంపన్నమైన, బలమైన, ప్రజాస్వామ్య, సాంస్కృతికంగా అభివృద్ధి అయిన సుందర దేశంగా ఎదగాలి. అప్పటికి కమ్యూనిస్టుపార్టీ ప్రభుత్వం ఏర్పడి 100సంవత్సరాలు పూర్తవుతుంది. వీటిని రెండు శతజయంతి లక్ష్యాలు అని అంటున్నారు. ఒకటి ఇప్పటికే సాధించారు. రెండోది కూడా సాధిస్తారని ఆశిద్దాం.