Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్షాల రాకతో వ్యవసాయ సీజన్ మొదలవుతుందో లేదో.. అటవీ అధికారులు, పోడు సాగుదారులకు వివాదాలు తలెత్తడం రివాజుగా మారింది. ఆ భూముల్లో పంటలు వేసుకుంటామంటూ పోడు రైతులు.. అది కుదరదని అటవీ శాఖ అధికారులు. తెలంగాణలో పోడు భూముల వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం పోడు భూములకు ఎసరు తెచ్చిపెట్టింది. మొక్కలు నాటేందుకు ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న గిరిజనుల పోడు భూములను అటవీ అధికారులు బలవంతంగా తీసుకోవడంతో పోడుపోరు రాజుకుంటున్నది.
జల్.. జంగిల్.. జమీన్ గిరిజనుల ప్రధాన నినాదం... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షల్లో భూమి కూడా ఒకటి. స్వరాష్ట్రంలో భూచట్టాలు అమలు అవుతాయని, పోడు భూములపై పట్టా హక్కు పొందాలని పోడు సాగుదారులు ఎంతగానో ఎదురుచూశారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై ఏడేండ్లు గడిచినా 'ఎక్కడ వేసిన గొంగడి అక్కడే' అన్న చందంగా ఉంది. పోడు రైతులు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసినా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. కేంద్రంలో యూపీఏ-1 ప్రభుత్వానికి వామపక్షాల మద్దతు కీలకమైన సమయంలోనే అనేక ప్రగతిశీల, ప్రజాప్రయోజనకర చట్టాలు వచ్చాయి. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆ చట్టాలు దేశానికి ఆదర్శం. అనేక ఏండ్ల పోరాటాల ఫలితంగా అటవీ ప్రాంతాల్లో ఉండే గిరిజన, సన్న, చిన్న కారు రైతులు అటవీ భూములను చదును చేసుకుని వ్యవసాయం చేసి పొట్ట పోసుకుంటున్నారు. వారికి చట్టబద్ధమైన హక్కుల కోసం వామపక్షాలు ఎన్నో పోరాటాలు చేశాయి. దాని ఫలితమే అటవీ భూముల హక్కుల చట్టం-2006. దీనితో పోడు రైతులకు జవసత్వాలు వచ్చాయి. తమ బతుకులు మారుతాయని, తమ కాళ్ల మీద తాము నిలబడే స్థాయికి చేరుకుంటామని గిరిజనులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ చట్టం వచ్చి 14ఏండ్లు గడుస్తున్నా అమలుకు నోచుకోకపోవడం సోచనీయం. ఏటా ఈ సమయంలో ఐటీడీఏ చూట్టూ గిరిజనులు, గిరిజనేతరులు రెవెన్యూ పట్టాలు, అటవీ హక్కుపత్రాలతో ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నారు. అయినా ఫలితం శూన్యం. పైగా పోడు రైతులపై అటవీ అధికారుల, పోలీసుల దాడులు రోజురోజూకి వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. 'గోరుచుట్టుపై రోకటిపోటు' లాగా వారి భూములను వారికి ఇవ్వకుండా పీడీ యాక్టులు పెట్టి జైలుకు పంపుతున్నారు. రాష్ట్రంలో 24జిల్లాలో రెండు లక్షల మందికిపైగా గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. వీరంతా 6.96లక్షల ఎకరాల అటవీ భూమిలో పోడు పట్టాల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. మూడున్నర లక్షల ఎకరాలకే పట్టాలు ఇచ్చారు. పోడు రైతులు పెట్టుకున్న అర్జీలలో సగం కూడా పరిష్కరం కాలేదు.
గిరిజనుల హక్కుల కోసం, చట్టాల కోసం అనేక పోరాటాలు చేసి సాధించిన వామపక్షాలు, ఆ చట్టాల అమలుకు అంతకంటే ఎక్కువ పోరాటాలు చేయాల్సిన పరిస్థితి నేడు దాపురించింది. రాష్ట్రంలో అనేక ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, వక్ఫ్, దేవాదాయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఇందులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, నేతల భాగస్వామ్యమే ఎక్కువగా ఉంది. వారిని అదుపు చేయలేని రాష్ట్ర ప్రభుత్వం పేదవాడు పోడు చేసుకుంటే చూడలేకపోతోంది. పెద్దోళ్లను ఏమీ చేయలేని సర్కారు పేదోళ్లపై ప్రతాపం చూపడం దుర్మార్గం.
హరితహారం ఆరు విడతల్లో ప్రతిసారి పోడు రైతులు సాగుకు వెళ్లడం, అటవీ, రెవెన్యూ, పోలీసు అధికారులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు సర్వసాధారణం అయిపోయాయి. తాజాగా ఏడో విడత ప్రారంభంలో కూడా ఇలాంటి ఘటనలే పునరావృతం అవుతున్నాయి. రాష్ట్రంలో పోడు భూముల వ్యవహారంలో గిరిజన రైతుల్లో తీవ్ర అశాంతి నెలకొన్నది. ముఖ్యమంత్రి ఇప్పటికైనా వాస్తవాలు చూడాలని వారు కోరుతున్నారు. అటవీ, రెవెన్యూ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నిజమైన, అసలైన పేద వారిని గుర్తించి దానిపైనే ఆధారపడి పొట్ట పోసుకుంటున్న వారందరికీ పట్టాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలి. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం సర్వే నంబర్ల వారీగా సర్వే చేసి ఆదివాసీలకు న్యాయం చేయడానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. లేకపోతే అటవీ భూముల హక్కుల కోసం మరో ప్రజా ఉద్యమం తప్పదు. 2014లో తొలిసారిగా అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో స్వయంగా సీఎం కేసీఆర్ పోడు సాగుదారులకు పట్టాలు ఇస్తామని ప్రకటించారు. 2018లో రెండోసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బహిరంగ సభల్లో 'కొత్తగూడెం, ఖమ్మం లాంటి జిల్లాల్లో కుర్చీ వేసుకుని కూర్చొని పోడు సాగుదారులకు నేనే స్వయంగా పట్టాలు ఇస్తాన'ని మరోసారి బహిరంగ హామీ ఇచ్చారు. కానీ, ఈ ఏడేండ్లలో ఆ హామీ అమలుకు నోచుకోలేదు. పైగా ఎన్నాళ్ళుగానో పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన రైతుల పంటలను అటవీ శాఖ అధికారులు, పోలీస్ అధికారులు ఎవరికి తోచిన విధంగా వారు ధ్వంసం చేస్తున్నారు. రైతుల పొలాలపై దాడులు చేస్తూ నానా బీభత్సం సృష్టిస్తున్నారు. పేదల పైన జులుం చూపిస్తున్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోంది. రేపో, మాపో 'హరితహారం' కింద ఆక్రమిత భూముల్లో మొక్కలు నాటేందుకు అటవీ అధికారులు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో పోడు వివాదం నివురుగప్పిన నిప్పులా పొంచి ఉంది. కేసీఆర్ సర్కార్ ఈ విషయం గ్రహించడం అవసరం.