Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఏం కొనేటట్టులేదు, ఏం తినేటట్టులేదు, నాగులో నాగన్న, ధరలిట్టా పెరగబట్టె నాగులో నాగన్న! ధరల మీద మనుబొయ్య నాగులో నాగన్న!' అంటూ ఒకప్పుడు పెరిగిన ధరలపై పాటలు కట్టి పాడుకునేవాళ్ళం. ఆ పాటలు కూడా ప్రజా బాహుళ్యంలోకి వెళ్ళి బహుళ ప్రచారాన్నీ పొందాయి. ఆరోజుల్లోని ధరలను గమనిస్తే ఇప్పుడు నవ్వొస్తుంది. ఇప్పటి ధరలతో పోల్చితే అవి చాలా తక్కువ. పెరగటం కూడా పైసల్లో పెరిగేవి. ఇప్పుడో! పదులూ వందల్లో పెరుగుతూ పోతూనే ఉన్నాయి. దాదాపు నలభైయేండ్ల క్రితమనుకుంటా 'వేయి చేతులు కలపండీ' అనే నాటికలో తెర తీయగానే వైకుంఠం అనే పాత్ర పైకి చూస్తూ వెతుకుతుంటాడు. కైలాసానికి ఏమీ అర్థంకాక ''ఏమిటీ అక్కడేమున్నాయి?'' అని ప్రశ్నిస్తాడు. 'అదుగో సరుకుల ధరలు ఆ చుక్కల్లో కనపడుతున్నాయా!' అని వివరిస్తాడు. ఇప్పుడు ఆ చుక్కలను దాటి పోటీపడుతున్నాయి. ''ధరలు పెరగక తరుగుతాయా!'' అని తిరుగు ప్రశ్నవేసేవారూ ఉంటారు.
సాధారణంగా ధరలు పెరగటం జరిగినప్పుడు ప్రజాందోళన జరిగితే పెరిగిన ధరలో కొంత తగ్గించేవి అప్పటి ప్రభుత్వాలు. ఇప్పుడా పరిస్థితి లేదు. వాస్తవంగా అశేష సామాన్య ప్రజల గుండెలపై మంటలు ఈ ధరలు. పేదోడి వెన్నంటిన కడుపులపై దిగుతున్న కత్తులు ఈ ధరలు. చితికిన బతుకులపై బండరాళ్ళ బరువులు ధరలు. స్వల్పాదాయ కుటుంబాలపై విరుచుకుపడే శత్రుసైన్యాలు ధరలు. దిగువ మధ్య తరగతిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించేవి ధరలు. ధరల సెగలకు తల్లడిల్లే ప్రజల జీవితాలను చూసిన వాడికీ, అనుభవించిన వాడికే అది అర్థం అవుతుంది. ధనికులకు ధరల గురించిన ప్రభావాలేమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ధరల పెరుగుదలతో ఒనగూడే ప్రయోజనాలు పొందేది వారే కదా!
'ఆకాశం అంటుకునే ధరలొకవైపు, అంతులేని నిరుద్యోగమింకోవైపు. అవినీతి, బంధుప్రీతి చీకటి బజారు, అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు' అని ఆవేదన చెందాడు మహాకవి. నిజంగానే ధరలు పెరుగుతున్న విధంగా ఆదాయాలు పెరుగుతున్నాయా! లేదు. ఆదాయాలు పెరగకపోగా ఉన్న ఆదాయ మార్గాలూ మూతపడుతున్నాయి. నిరుద్యోగం ఉపాధిలేమితనం విపరీతంగా పెరుగుతోంది. ఇది మన దేశంలో అమలవుతున్న ఆర్థిక విధానాల ఫలితం. ఇప్పుడున్న ప్రభుత్వమైనా అంతకుముందున్నప్రభుత్వాలైనా అవలంభిస్తున్నవి అవే విధానాలు. కనుక ఫలితాలు ఇలాకాక మరోవిధంగా ఉండజాలవు.
ఒకవైపు కరోనాతో ఆదాయాలు, ఉపాధి కోల్పోయిన కష్టకాలంలో ఈ ధరాఘాతాలు ప్రజల్ని తీవ్ర బాధలకు గురిచేస్తున్నవి. దేశంలో సామాన్యుల ఆహార వినియోగం తగ్గిపోయింది. చాలా మంది పేదలు ఒక్కపూట భోజనంతో, సగం కడుపుతో జీవనం కొనసాగిస్తున్నారు. భావి భారత పౌరులుగా చెప్పుకునే పిల్లలకు పౌష్టికాహారం అటుంచి కనీస ఆహారమూ దొరకడం కష్టంగా మారింది. ధరల పెరుగుదలతో కుటుంబాలలో ఎక్కువగా వొత్తిడికి, వేదనకు, ఆహారలేమికి గురవుతున్నది మహిళలు. గత నాలుగు నెలల్లో వంటగ్యాసు నూటాయాభై రూపాయలు పెరిగింది. ఇది ఇంటి ఇల్లాలుకు కష్టాలు పెంచింది. పెట్రోలు, డీజిలు ధరలు రోజూ పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు సగానికంటే మిన్నగా తగ్గినా మనకు పెట్రోలు, డీజిలు ధరలు మాత్రం పైపైకే. దీనివల్ల సరుకులన్నీటి ధరలూ పెరిగాయి. ఆఖరికి కూరగాయల ధరలూ విపరీతమయ్యాయి. పప్పులు, నూనెలు, ఉల్లిగడ్డలు అన్నీ నన్నందు కోగలవా! అని సవాళ్ళు విసురుతున్నాయి. అవి పండించేవాడు ఆకలితో ఉన్నాడు. కొని నిల్వచేసి అమ్ముకునే వ్యాపారి లాభాలు గడిస్తున్నాడు. నిత్యావసరాలే కాదు, ప్రాణావసర మందుల ధరలు కూడా పెంచేశారు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ మందుల కోసం ప్రజలు ఖర్చుచేసారని అధ్యయనాలు చెబుతున్నవి.
ఈనాడు ప్రభుత్వంలో ఉన్న రాజకీయపార్టీలు, నాయకులు ఒకప్పుడు ఏమాత్రం ధరలు పెరిగినా గగ్గోలు పెట్టి విమర్శలు ఎక్కుపెట్టిన వాళ్ళే. ఇప్పుడు మాత్రం వాళ్ళు ధరల గురించి మాట్లాడకపోగా, ధరలు పెరగటం సహజమైనట్టు, ప్రకృతి ధర్మమైనట్టు వాక్కులను నొక్కుతున్నారు. 'వాడు పోయి వీడెక్కె, వీడుపోయి వాడెక్కె, ధరల మీద ధరలెక్కె' అని మనం ఇప్పుడు కూడా పాడుకోవాల్సిందేనేమో! ఒక్క ఉల్లిగడ్డ ధరలు పెరిగినందుకు ప్రభుత్వాలనే ఓడించిన ప్రజల చైతన్యం ఇప్పుడేది? ప్రజా చైతన్యాన్ని పక్కదారులు పట్టించే ప్రయత్నాలు నాయకగణం చాలా చాకచక్యంగా చేస్తూ ఉంది. దీన్ని గుర్తెరిగి వాతలు పెట్టాల్సిన సమయం వచ్చింది.
'ధరలు దించండి! లేదంటే మీరైనా దిగిపోండి' అని నినదించాల్సిన అవసరం ఉంది. సామాన్యుల, సాధారణ ప్రజల జీవిక సమస్యను పరిష్కరించకుండా, దీని గురించి మాట్లాడకుండా అసంగతాలను, అనవసర విషయాలను చర్చలోకి తెచ్చి మభ్యపెట్టే కుయుక్తుల పనిపట్టాలి! ఈ కరోనా కాలంలో కూడా ధరల భారాలను జనులపై మోపడం దారుణమైన విషయం. అందుకే ధరాధిపతుల గుండెలదిరేలా ప్రజాగళాలు గర్జించాలి. ప్రజా సమూహాలు ఉద్యమించాలి! ఆకాశ మార్గాన విహరించే ధరలను భూమార్గం పట్టించాలి.