Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఉత్పత్తిలో ప్రయివేటు భాగస్వామ్యమే జాతి ప్రయోజనాలను కాపాడుతుందని కార్పొరేట్ రాజ్యం భావిస్తుంది'' - 'ఫాసిజం అండ్ సోషల్ రివల్యూషన్' గ్రంథంలో రజనీ పామీదత్
చాలా సందర్భాల్లో నడుస్తున్న చరిత్ర కూడా భవిష్యత్ పరిణామాలకు ముఖద్వారంలా నిలుస్తుంది. 1974 నాటి రైల్వే సమ్మెను, దాన్ని ఇందిరమ్మ అణిచివేసిన తీరును సరిగ్గా అర్థం చేసుకున్న వ్యక్తులు, పార్టీలు ఆ తర్వాత సంవత్సరానికి జరగబోయే పరిణామాలను కరెక్టుగా అంచనా వేయగలిగారు. అంత పెద్ద దేశవ్యాపిత సమ్మెను, అన్ని లక్షల మంది కార్మికుల ఉసురు తీసిన ప్రభుత్వం భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలి తీసుకుంటుందని సీపీఐ(ఎం) వేసిన అంచనా ఎమర్జెన్సీతో నిజమై నిలిచింది. నాడు రైల్వే... నేడు డిఫెన్స్... అప్పుడు సమ్మె ప్రారంమైన తర్వాత దాడి, అణిచివేత... నేడు జులై 26 నుంచి దేశవ్యాప్త సమ్మెకు డిఫెన్స్ కార్మికులు ఇంకా వార్మ్అప్ అవుతుండగానే, అంటే గోచీలు బిగించుకోకముందే దాడి షురూ! మోడియా? మజాకా? రైల్వే సమ్మెలో 8 గంటల పనిదినం, అవసరాల ప్రాతిపదికపై కనీస వేతనం వంటి డిమాండ్లు కీలకం. నేడు ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ (ఒఎఫ్‌బి)ని ఏడు ముక్కలు చేయొద్దని, ఆ రకంగా ప్రయివేటీకరణకు దారులు పరవద్దన్న డిమాండే కీలకం. నాడు వందకిపైగా ఉన్న క్యాటగిరీ సంఘాలు రైల్వేరంగంలో ఎన్సీసీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఐక్యమై పోరాడారు. నేడు ఓఎఫ్బీలోని 56 గుర్తింపు సంఘాలు కాన్ఫెడరేషన్ ఆఫ్ డిఫెన్స్ రికగ్నైజ్డ్ అసోసియేషన్స్ (సీడీఆర్ఏ) పేరున ఐక్యంగా పోరు జెండాలెత్తారు. దాంతో మోడీ సర్కార్‌కి గంగ వెర్రులెత్తింది. ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ ఆర్డినెన్స్ 2021 జారీ చేసింది. సిటు నేత, సీపీఐ(ఎం) పార్లమెంట్ సభ్యుడు ఎలమరం కరీమ్ అన్నది అక్షరాల నిజం. స్వతంత్ర భారత చరిత్రలో ఇంత దుర్మార్గమైన ఆర్డినెన్స్లేదు. దేశంలో ఎక్కడైనా ఎస్.ఐ. స్థాయి అధికారి వారెంటు లేకుండానే డిఫెన్స్ ఉద్యోగులను అరెస్ట్ చేయొచ్చు. సమ్మెకు రెచ్చగొట్టారన్న నేరానికి రెండేండ్లు జైలు శిక్ష లేదా రూ.15వేల జరిమాన లేదా రెండూ కలిపి విధించవచ్చు.
దేశంలో 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, యుద్ధ ట్యాంకులు, తుపాకుల నుంచి పారాచూట్ల వరకు జాతి రక్షణకు అవసరమైన అన్ని యుద్ధ పరికరాలు తయారు చేస్తాయి. 78వేల మంది ఉద్యోగులు. వీటిని ఏడు కార్పొరేషన్లుగా విడగొడతామని ప్రభుత్వ ప్రతిపాదన. ఇది ప్రయివేటీకరించేందుకే అని కార్మిక సంఘాల వాదన.. ఎందుకంటే డీ.ఓ.టీ. అనుభవం మన కండ్లెదురుగా ఉంది కదా. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుండి ముందు విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (వి.ఎస్.ఎన్.ఎల్)ను విడగొట్టి కారుచౌకగా టాటాలకు కట్టబెట్టారు. ముంబారు, ఢిల్లీలను మహానగర్ టెలిఫోన్ నిగమ్ (ఎంటిఎన్ఎల్) చేశారు. నేడది అంపశయ్యపై ఉంది. జియో దెబ్బకి బీఎస్ఎన్ఎల్ విలవిల్లాడుతోంది. ఈ చరిత్ర తెలియని అమాయకులా ఓఎఫ్‌బి ఉద్యోగులు?!
ఈ41 ఫ్యాక్టరీలు ఒకదానిపై మరొకటి ఆధారపడే ఉంటాయి. ఉదాహరణకు శతఘ్ని గన్ తయారీకి అవసరమైన స్టీలు ఒక ఫ్యాక్టరీలో, బ్యారెల్ ఇంకోచోట, దాన్ని పరీక్షించేది మరోచోట జరుగుతుంది. ఈ పరస్పరాధారాన్ని ఏ విధంగా విధ్వంసం చేస్తారో అని ఆర్డినెన్స్ ఉద్యోగుల ఆందోళన. ఈ కార్పొరెటైజేషన్ వెనకున్న కథేమిటో ప్రభుత్వంలో నంబర్ వన్‌కి, నంబర్ టుకి తప్ప రక్షణమంత్రికి కూడా తెలియదంటే ఆశ్చర్యమేం లేదు.
స్వాతంత్య్రానంతరం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు అద్భుత ప్రగతి సాధించాయి. 1961లో జరిగిన చైనా యుద్ధం నుంచి తాజాగా కార్గిల్ యుద్ధం వరకు, మొన్న లడాఖ్‌లో జరిగిన ఘర్షణ వరకు ఓ.ఎఫ్.బీ.ల ప్రగతి అసామాన్యం. మిగిలిన అనేక డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ కంపెనీల కంటే ఓ.ఎఫ్.బీ.ల్లో దేశంలో తయారయిన విడిభాగాలే అత్యధికం. అంటే ''ఆత్మనిర్భర్ భారత్''కు ప్రతీకలు. స్వయం సమృద్ధికి అసలు సిసలైన ఆనవాళ్ళు. మోడీ సర్కార్ చూపు వేరే వైపుంది. టాటా, ఎల్ అండ్ టీ, మహేంద్రా, అనిల్ అంబానీ వంటి సంస్థలు ఇప్పటికే వివిధ డిఫెన్స్ ఉత్పత్తులు చేస్తున్నాయి. సుమారు 275మందికి డిఫెన్స్ ఉత్పత్తుల కోసం అదనంగా లైసెన్స్లిచ్చిందీ ప్రభుత్వం. చిన్న ముక్కలుగా నరికేది వారి నోళ్ళలో పెట్టేందుకే అని ఈ ప్రభుత్వం నడక చూసిన వారికి ఇట్టే అర్థమవుతుంది.
ప్రభుత్వం ఎంత తొందర పడుతోందంటే పారిశ్రామిక వివాదాల చట్టాన్ని నిస్సిగ్గుగా అతిక్రమించింది. వివాదం సి.ఎల్.సి. వద్ద ఉండగానే ఒక పక్క చర్చలు చేస్తూ పాఠశాలలు, ఆసుపత్రులు, క్వాలిటీ కంట్రోల్ (డి.జి.క్యూ.సి) వంటి వాటిని విడగొట్టేందుకు, సుమారు 66వేల ఎకరాల భూముల విలువ నిర్ణయించేందుకు సిద్ధమైపోయింది. కె.పి.ఎమ్.జి. వంటి కన్సల్టెన్సీని నియమించేసింది. ఆ కె.పి.ఎమ్.జి. దాని పని అది చకచకా చేసుకుపోతోంది. అస్మదీయులకు అంటకాగడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టు అర్థమవుతూనే ఉంది. ఇది కృతయుగమో, త్రేతాయుగమో కాదు, పొద్దు వాలంగానే ఎక్కుపెట్టిన బాణాలను సైతం దించి అంబులపొదిలో పెట్టుకోడానికి. నక్కజిత్తుల కార్పొరేట్ల కాలం. అంబానీలు, అదానీల్లా0ంటి మసలే తోడేళ్ల కాలం. ఘనత వహించిన ప్రభువు మమ్మల్ని అడగాలి కదా? మాతో చెప్పాలి కదా? అనే మాటలకు కాలం చెల్లి చాలా కాలం అయింది. త్రైపాక్షిక, ద్వైపాక్షిక చర్చలకు ఏనాడో మంగళం పాడేసింది మోడీ సర్కార్.
మనిషికో మాట.. గొడ్డుకో దెబ్బ అన్న మాట నాలుగు లక్షల మంది డిఫెన్స్ సివిలియన్ ఉద్యోగులే కాదు, యావన్మంది కార్మికులూ గుర్తెరిగి మసలాలె!