Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజల జీవితంలో సినిమా ఒక విడదీయలేని భాగంగా మారిపోయి చాలాకాలమే అయింది. అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానం సినిమాను రోజు రోజుకూ కొత్తపుంతలు తొక్కిస్తూ ప్రజలకు మరింత చేరువ చేసింది. దశాబ్దాల ఈ పరిణామ క్రమంలో సినిమా వ్యాపారమయమైపోయినప్పటికీ అది ఒక కళాత్మకమైన, సృజనాత్మకమైన మాద్యమం అనడంలో సందేహం లేదు. అయితే సమస్త సృజనల మీద, ఆలోచనల మీద ఆంక్షల వల విసురుతున్న కేంద్ర సర్కారు ఇప్పుడు సినిమాను కూడా ఆ వలలో బంధించ పూనుకుందా? ఇప్పటికే సామాజిక మాధ్యమాల నియంత్రణ కోసం ప్రజాస్వామ్య విరుద్దమైన ఆంక్షలకు తెగబడుతున్న బీజేపీ ప్రభుత్వం సినిమాకు కూడా సంకెళ్లు వేయజూస్తోందా? సెన్సార్ బోర్డును ఉత్సవ విగ్రహంగా మార్చి తానే సూపర్ సెన్సార్ పవర్‌గా అవతరించాలనుకుంటుందా? సినిమాటోగ్రఫీ చట్టానికి కేంద్రం ప్రతిపాదిస్తున్న సవరణలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది.
ఇప్పటి వరకూ కేంద్రం నియమించిన ''సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ)'' సినిమాలను సెన్సార్ చేసి విడుదలకు అనుమతులిస్తోంది. ఒకసారి సెన్సార్‌బోర్డు అనుమతి పొందిన తరువాత ఆ సినిమా ప్రదర్శనలో ఎవరు ఎలాంటి జోక్యం చేసుకున్నా అది చట్టవిరుద్దమే. చివరికి ప్రభుత్వ జోక్యం కూడా తగదని పలు కోర్టు తీర్పులూ స్పష్టం చేస్తున్నాయి. కానీ తమకు అభ్యంతరమనుకుంటే ఏకపక్షంగా, నేరుగా జోక్యం చేసుకునే హక్కును తనకు దఖలు పరుచుకుంటూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన తాజా సవరణలు పౌరుల ప్రాథమిక స్వేచ్ఛనే సవాలు చేస్తున్నాయి. ఈ సవరణల్లో మొదటిది ''వయసు ఆధారిత సర్టిఫికేషన్''. ప్రస్తుత ఏ, యు, యు/ఏ సర్టిఫికేషన్‌లో యు/ఏ7+, యు/ఏ13+, యు/ఏ16+ కేటగిరీలను చేర్చాలన్నది ఈ సవరణ ఉద్దేశం. రెండవది ''పైరసీ నిరోధం''. ఈ సవరణ ప్రకారం పైరసీకి పాల్పడేవారికి మూడు నెలల నుంచి మూడేండ్ల వరకు జైలు, మూడు లక్షల నుంచి సినిమా నిర్మాణంలో 5శాతం వరకు జరిమానా విధించాలి. మూడవది ''ఎటర్నల్ సర్టిఫికెట్''. ప్రస్తుతం సీబీఎఫ్సీ ఇస్తున్న సర్టిఫికెట్ కాలపరిమితి పదేండ్లు. కానీ ఈ సవరణ దానిని శాశ్వతం చేస్తుంది. ఇక చివరిదీ, అత్యంత కీలకమైనదీ ''రివిజన్ ఆఫ్ సర్టిఫికేషన్''. సీబీఎఫ్సీ అనుమతి పొంది సినిమా విడుదలయినా సరే, కేంద్రానికి అభ్యంతరమనిపిస్తే దానిని పున:పరిశీలనకు ఆదేశించే హక్కును కల్పిస్తోంది ఈ ప్రతిపాదన. పై మూడు సవరణలతో ఎవరికీ ఏ ఇబ్బందులూ లేవు గానీ, ఈ ''రివిజన్ ఆఫ్ సర్టిఫికేషన్'' అనే చివరి సవరణే ప్రమాదకరం. ఇది భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు. సినీ మాధ్యమంపై కేంద్రానికి తిరుగులేని పెత్తనాన్ని కట్టబెట్టే ప్రతిపాదన.
ఇప్పటికే తమకు అభ్యంతరకరమైతే చాలు, సినిమా షూటింగ్‌లు మొదలు ప్రదర్శనల వరకు అడుగడుగునా దాడులూ దౌర్జన్యాలకు తెగబడుతున్న మూకలను కోకొల్లలుగా చూస్తున్నాం. ప్రత్యేకించి బీజేపీ అధికారం చేపట్టాక ఈ అప్రజాస్వామిక దాడులు విపరీతంగా పెరిగాయి. ''వాటర్'' నుంచి ''పద్మావతీ'' దాకా ఇందుకు అనేక ఉదాహరణలు మన కండ్లముందున్నాయి. ఇకపై ఈ దురాగతాలను చట్టబద్దం చేయడమే ఈ సవరణ ఉద్దేశమన్నది బహిరంగ రహస్యమే. భారత రాజ్యాంగం ప్రకారం పౌరుల ప్రాథమిక స్వేచ్ఛలో అత్యంత కీలకమైన భావప్రకటనకు ఇది అతిపెద్ద విఘాతం. అందుకే దేశవ్యాపితంగా ఈ సవరణకు నిరసన వెల్లువెత్తుతోంది. ప్రగతిశీలురైన మేథావులూ, న్యాయ కోవిదులూ దీనిని ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. అనేక మంది సినీ ప్రముఖులు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దర్శక దిగ్గజం శ్యామ్ బెనగల్, నందితాదాస్, అనురాగ్ కశ్యప్, ఫర్హాన్ అక్తర్ వంటి ప్రముఖులతో పాటు కమలహాసన్, సూర్య, కార్తి, గౌతమ్ మీనన్, ప్రకాశ్‌రాజ్, విశాల్ వంటి ఉత్తర, దక్షిణ చలన చిత్రరంగ ప్రముఖులు మూడు వేల మందికి పైగా తమ సంతకాలతో నిరసన లేఖను ప్రభుత్వానికి అందజేశారు. కానీ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖమైన తెలుగు సినీరంగం నుండి మాత్రం ఏ స్పందనా లేకపోవడం వైచిత్రి! ఇది వారి అచేతనత్వానికి ప్రతీక అనుకోవాలో లేక భావదారిద్య్రమని సరిపెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఇది సృజనాత్మక స్వేచ్ఛనే కాక, వ్యాపార స్వేచ్ఛనూ అనిశ్చితిలో పడేస్తుందనే కనీస స్పృహ తెలుగు సినిమా ప్రముఖులకు లేకపోవడం విచారకరం.
ఎవరి స్పందన ఏమిటనేది అటుంచితే, ఈ సవరణతో సర్కారువారు ఏం చేయదలచుకున్నారన్నది అంతుబట్టని విషయమేమీ కాదు. ప్రభుత్వ విధానాలనూ నిరంకుశత్వాన్నీ ప్రశ్నించేలా సినిమా సృజన ఉన్నట్టయితే, ఆ సినిమాను ఈ పేరుతో నిషేధిస్తారు. సినిమా ఎంతగా వ్యాపారమైపోయినప్పటికీ, వాణిజ్య చిత్రాలదే అగ్రభాగమైనప్పటికీ గొప్ప సినిమాలూ మనకు తక్కువేమీ లేవు. సమాజంలో మౌలికమైన మార్పులు కావాలనే, విప్లవాలు రావాలనే ప్రత్యామ్నాయ సినిమాలు అనేకం వచ్చాయి. అవి ప్రజలకు గొప్ప భావాజాలాన్నీ, చైతన్యాన్నీ అందించాయి. ఇకపై అలాంటి సినిమాలు రాకుండా అడ్డుకోవడమే ఈ సవరణల అసలు లక్ష్యం. భావజాల రంగంలో పురోగమనాన్ని నియంత్రించడం రాజ్యానికేమీ కొత్తకాదు. ప్రభువులు నిరంకుశులైనప్పుడు ఏ రంగంలోనైనా ప్రజాస్వామ్యానికి ప్రమాద ఘంటికలే ఎదురవుతాయి. అందుకే ''బతుకును నడిపించునట్టి పాటలు చెరజిక్కెనే - చుక్కలాంటి చెలి గళాన స్మిత బల్లెము నాటెనే'' అంటూ ఆవేదన చెందాడు మగ్దూం మొహియుద్దీన్. అంతే కాదు, ''న్యాయ సుగంథానిలాలు నింపుము ఈ లోకంలో..'' అంటూ బలమైన ఆకాంక్షను వెలిబుచ్చాడు. ఆ మహాకవి ఆకాంక్ష, నేడు మన అందరి కర్తవ్యం కావాలి.