Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికా, కెనడాలో ఎన్నడూలేని విధంగా రికార్డుస్థాయిలో గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. గతవారంలో 49.6డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదు అయింది. కెనడాలో 45 డిగ్రీలు ఎన్నడూ దాటలేదు. బ్రిటిష్ కొలంబియాలో ఒక వారంలోనే ఉష్ణోగ్రతలు పెరగడం వలన 486మంది చనిపోయారు. ఎక్కువ మంది వృద్ధులు మృతిచెందుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత శీతల దేశాల్లో కెనడా ఒకటి. అక్కడ మంచు తుఫాన్లు తరచూ వస్తుంటాయి. ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా రికార్డుస్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పర్యావరణ మార్పులే దీనికి ప్రధాన కారణం.
వేడిని తట్టుకోలేక చాలామంది హాస్పటల్స్‌లో చేరుతున్నారు. కొన్ని చోట్ల అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. జూలై 4న అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో బాణాసంచా పేల్చకుండా పోర్టులెండ్లో నిషేధం విధించారు. దీనిని బట్టి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వేసవి కాలం ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటే రానున్న రోజులలో మరింత తీవ్రంగా పెరిగే అవకాశం స్పష్టంగా కనబడుతున్నది. అమెరికాలోని ఓరోగాన్ ప్రాంతంలో గత నాలుగు సంవత్సరాలలో వడగాల్పుల వలన 12 మంది చనిపోతే, ఈ సంవత్సరం ఇప్పటికే 64మంది చనిపోయారు. పోర్టులాండ్‌లో వారం రోజులలో 45మంది చనిపోయారు.
భగభగ మండుతున్న ఎండలు, వడగాల్పుల నుండి ఉపశమనం పొందడానికి ప్రజలు బీచ్‌లు, నదీ తీరాల దగ్గర గుమికూడి ఈత కొలనులను ఆశ్రయిస్తున్నారు. నగరాలలో నీళ్ళు జల్లే కేంద్రాలు వెలుస్తున్నాయి. చాలా చోట్ల కూలింగ్ సెంటర్లు తెరుచుకున్నాయి. ఫసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలలో తేడాల వల్ల ఏర్పడే హీట్‌డోమ్ ఈ ఉష్ణోగ్రతలు పెరుగుదలకు ముఖ్యకారణం అని నిపుణులు అంచనా వేస్తున్నారు.
భూమిని ఉష్ణోగ్రతల నుండి కాపాడే కవచాలు హిమనదాలు. వీటిలో అద్దంలా పరుచుకున్న తెల్లని మంచు వలన సూర్యకిరణాలు అంతరిక్షంలోకి పరివర్తనం చెందడం ద్వారా భూఉష్ణోగ్రత పెరగకుండా ఆగుతుంది. హిమనదాలు లేకుంటే సూర్యకిరణాలు నేరుగా భూ ఉపరితలాన్ని తాకుతాయి. వాటి వేడిని ఉపరితలం ఇముడ్చుకుని వాతావరణం వేడెక్కడానికి దోహదం చేస్తుంది. ఆర్కిటిక్, అంటార్కిటికాలతో పాటు హిమలయాల్లోనూ మంచు వేగంగా కరిగిపోయి దక్షిణాసియా దేశాలకు నీటి కొరతను తెచ్చిపెట్టనుంది. గంగ, బ్రహ్మపుత్ర నదులకు హిమాలయాలే మూలం. వాతావరణ మార్పుల వల్ల రుతువుల్లోను మార్పులు వచ్చే ప్రమాదం పెరుగుతున్నది.
ఆస్ట్రేలియా సముద్ర ప్రాంతంలోని పగడపు కొండల రంగు అతివేగంగా వెలిసిపోతున్నది. పగడపు కొండల వలన సముద్రంలోని జీవరాసుల మనుగడ సాగుతుంది. సముద్రంలో సమతుల్యత కూడా ఏర్పడుతుంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం వాతావరణ మార్పులను అరికట్టడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించకపోవడంతో వాటికి ప్రమాదం ఏర్పడిందని గతనెల యునెస్కో ఒక నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం ప్రపంచ హెరిటేజ్ లిస్టులో ప్రమాదంలో ఉన్న ప్రదేశాల జాబితాలో చేర్చాలని పేర్కొన్నది.
వాతావరణంలో కర్బన్ ఉద్గారాలు పెరగకుండా అరికట్టడానికి పారిస్ ఒప్పందంలో చేసిన సూచనలను అన్ని దేశాలు విధిగా పాటించి తమ వంతు తగ్గుదలకు కృషి చేయాలి. అమెరికా ట్రంప్ హయాంలో పారిస్ ఒప్పందం నుండి వైదొలగింది. బైడెన్ తిరిగి చేరుతున్నట్టు ప్రకటించారు. అన్ని దేశాలు కలిసికట్టుగా వాతావరణంలో ఉష్ణోగ్రత మరో 1.5 డిగ్రీలు 2100 సంవత్సరం వరకు దాటకుండా చూడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటి నుండీ దశలవారీగా ఆయా దేశాలు కృషి చేస్తేనే అది సాధ్యం. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడంతో ఉపయోగం ఉండదు.
ఇప్పటికే చైనా ఈ కృషిలో ముందు ఉన్నది. సౌరవిద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలోని ప్రతి మూడు పలకలకు ఒక పలక చైనాలో వాడుతున్నారు. మూడు సంవత్సరాల నుండి కొత్తగా బొగ్గు బావులు తెరవలేదు. విద్యుత్ వాహనాలు పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. నగరాలలో చెట్లు నాటడం, అపార్టుమెంట్లలో మొక్కలు పెంచడం, అడవులను విస్తరించడం జరుగుతున్నది. నగరాలలో నీటిని వృధా కాకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకుంటున్నారు. వాటిని స్పాంచ్ సిటీస్ అంటున్నారు. ఈ చర్యల వలన వాతావరణంలో కొంత మార్పులు జరుగుతున్నాయి. జీవన ప్రమాణాలలో కూడా మెరుగుదల కనపడుతున్నది.
అమెరికా, బ్రిటన్ లాంటి సామ్రాజ్యవాద దేశాలు లాభాలకు పెద్దపీట వేసి కర్బన్ ఉద్గారాల తగ్గుదలకు చేపట్టాల్సిన చర్యలకు ఖర్చుపెట్టడానికి సిద్ధం కావడంలేదు. దానికి భిన్నంగా సోషలిస్టు దేశాలు కర్బన కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నాయి.
వాతావరణ విధ్వంసం భూగోళం మనుగడకే ప్రమాదం అవుతున్నది. ఆ విధ్వంసాన్ని నివారించడానికి ప్రభుత్వాలు ఇప్పటి నుంచే కదలాలి. వాతావరణానికి హాని చేసే కర్బన్ ఉద్గారాలకు తావులేని పారిశ్రామిక, ఆర్థిక విధానాన్ని నిర్మించుకోవాలి. ఇది జరగాలంటే శిలాజ ఇంధనాలు బొగ్గు, పెట్రోల్, డీజిల్‌లకు స్వస్తిచెప్పి పునరుత్పాదక ఇంధన వనరులకు మారడం ఎంతో అవసరం. వాతావరణాన్ని సంరక్షించుకుంటూనే అభివృద్ధిని సాధించడంపై కేంద్రీకరించాలి. పవన్, సౌర విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులకు వినియోగించాలి. పర్యావరణాన్ని కాపాడుకుంటేనే భూగోళంపై మానవ మనుగడ సాధ్యం.