Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫ్రాన్స్‌లో తీగలాగితే ఇక్కడ మోడీ ప్రభుత్వ అవినీతి డొంక కదిలింది. రాఫెల్ యుద్ధ విమానాల వ్యవహారంపై ఫ్రాన్స్‌లో న్యాయ విచారణ ప్రారంభించగా ఇప్పటి వరకు తప్పించుకు తిరుగుతున్న మోడీ ప్రభుత్వం బోనులో చిక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఫ్రెంచ్ విమానాల తయారీ సంస్థ డసాల్ట్ ఏవియేషన్స్, భారత ప్రభుత్వం మధ్య 2016లో కుదిరిన ఒప్పందంలో భారీ అవినీతి, అవకతవకలు, ఆశ్రిత పక్షపాతాలు చోటు చేసుకున్నాయని అప్పట్లోనే మన దేశంలో పెద్ద పెట్టున రాజకీయ దుమారం లేచింది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దర్యాప్తునకు ప్రతిపక్షాలు పట్టుబట్టగా బీజేపీ సర్కారు ససేమిరా అంది. ఆత్మరక్షణలో పడ్డ ప్రభుత్వం బుకాయింపును ఆశ్రయించింది. కొన్ని లొసుగులతో సుప్రీంకోర్టులో విచారణ నుండి తాత్కాలికంగా తప్పించుకుంది. విమానాల తయారీ సంస్థ డసాల్ట్ నిబంధనలకు విరుద్ధంగా భారత్‌కు చెందిన ఒక మధ్యవర్తికి పది లక్షల యూరోలు చెల్లించిందన్న ప్రధాన అభియోగంతో ఏప్రిల్‌లో ఫ్రెంచ్ మీడియాలో పరిశోధనాత్మక కథనం వెలువడింది. మరో వైపు అక్కడి స్వచ్ఛంద సంస్థ 'షేర్పా' రాఫెల్ డీల్‌పై ఫిర్యాదు చేసింది. దానిపై ఫ్రాన్స్ ఫైనాన్షియల్ ప్రాసిక్యూటర్స్ ఆఫీస్ (పీఎన్ఎఫ్) న్యాయ విచారణకు ఆదేశించింది. గత నెల 14న స్వతంత్ర న్యాయమూర్తి నియామకం కూడా జరిగింది. పక్షం రోజులుగా ఇంత జరుగుతున్నా మీడియా బయట పెట్టేంత వరకు మోడీ ప్రభుత్వం తేలు కుట్టిన దొంగలా గమ్మునుంది. తీరా ప్రతిపక్షాలు నిగ్గదీసేసరికి చాలా చిన్న విషయమని తేలిగ్గా కొట్టిపారేస్తూ, తనకు అలవాటైన ఎదురుదాడి అస్త్రానికి దిగజారింది.
రాఫెల్ స్కాంలో బీజేపీ ప్రభుత్వం ఎప్పుడో దొరికిపోయింది. 2015 మార్చి 26న డసాల్ట్ ఏవియేషన్స్‌కు, అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూపునకు మధ్య ఒప్పందం కుదిరింది. దేశీయంగా విమానాలు తయారు చేసే ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్)ను రాఫెల్ డీల్ నుంచి తప్పిస్తూ ప్రధాని మోడీ ప్రకటన చేయడానికి పదిహేను రోజుల ముందు ఈ అగ్రిమెంట్ అయింది. దాంతోనే ప్రభుత్వరంగ సంస్థను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టి విమానాల తయారీలో వీసమెత్తన్నా అనుభవం లేని రిలయన్స్‌కు ఆయాచిత లబ్ది చేకూర్చారని అర్థమైపోయింది. అటు ధరల విషయంలో భారీ వ్యత్యాసం అవినీతి ఏ మేరకు జరిగిందో తెలియజేసింది. యూపీఏ హయాంలో 2013లో జరిపిన చర్చల్లో ఒక్కో విమానం ధర రూ.526 కోట్లుగా పేర్కొనగా, 2016లో మోడీ సర్కారు చేసుకున్న ఒప్పందంలో రూ.1,670 కోట్లకు అమాంతం ధర పెరిగిపోయింది. అప్పుడు అత్యవసర భవిష్యత్తు అవసరాల రీత్యా 126 విమానాలను సేకరించాలనుకోగా మోడీ సర్కారు 36 విమానాలకు తగ్గించింది. సేకరించే విమానాలను తగ్గించేసి ధరను రెండు రెట్లు పెంచడంతోనే ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో తేలిపోయింది. రూ.59 వేల కోట్ల లావాదేవీలకు స్వయంగా ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) కేంద్రంగా మారడం ప్రభుత్వంలో అవినీతి ఊడలు ఏ స్థాయిలో విస్తరించి బలపడ్డాయో అవగతమవుతుంది.
సున్నితమైన రక్షణ రంగంలో ఈ స్థాయి కుంభకోణం చోటు చేసుకోవడం స్వాతంత్య్రం వచ్చాక ఇదే. ఫ్రాన్స్‌లో న్యాయ విచారణ మొదలయ్యాక కూడా బీజేపీ సర్కారు నిజానిజాలు నిగ్గు తేల్చడానికి సిద్ధపడట్లేదని దాని సమర్థనలు చూస్తుంటే అర్థమవుతోంది. రహస్యమైన (కాన్ఫిడెన్షియల్ డొమైన్) రక్షణ రంగంలో ప్రొసీజర్పైనా, విమానాల ధరల్లో నెలకొన్న తేడాలపైనా విచారణ తమ పరిధిలో లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ తరుణంలో మోడీ సర్కారు జేపీసీ విచారణకు ఆదేశించాలి. ప్రధానితో సహా ఎవరినైనా విచారించే అధికారం జేపీసీకి ఉంటుంది. సుప్రీంకోర్టుకు, కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు సైతం అందుబాటులోలేని ఫైళ్లను సైతం జేపీసీ పరిశీలించగలుగుతుంది. రాఫెల్ డీల్‌లో అవినీతి వెల్లడి కావాలంటే జేపీసీ దర్యాప్తు ఎంతైనా అవసరం. ఇప్పుడు కూడా అందుకు బీజేపీ ప్రభుత్వం వెనుకాడుతోంది. తమది అవినీతి రహిత ప్రభుత్వమంటూ బీజేపీ వేసే రంకెలు కేవలం బుకాయింపులు మాత్రమేనని ఈ రాఫెల్ డీల్ రుజువుచేస్తోంది.