Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నర్సులు ప్రేమ, త్యాగం, మానవత్వానికి మారు పేరు, కరోనా విపత్కర పరిస్థితుల్లో రోగులకు చికిత్స అందించే సమయంలో తల్లుల మాదిరిగా ఎంతో సహనంతో స్వాంతన చేకూరుస్తున్నారు...' ఈ మాటలు అన్నది ఎవరో కాదు, స్వయాన మన గౌరవ ముఖ్యమంత్రివర్యులు. సరిగ్గా 60రోజుల కింద జరిగిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతలోనే రాత్రికి రాత్రి వారిని ఉద్యోగంలో నుంచి తీసేస్తూ ఆయన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని అందుకున్న అధికారులు తెల్లారి డ్యూటీలకు వచ్చిన నర్సులను వెనక్కి పంపించారు. ఇన్నాళ్లు తమ సేవలను ఉపయోగించచుకుని, ఇలా రాత్రికి రాత్రే ఉద్యోగం తీసేస్తే ఏమైపోవాలంటూ, న్యాయం చేయండి మహాప్రభో అంటూ నర్సులు ప్రగతి భవన్కు పోతే కర్కశంగా పోలీసులతో గెంటేయించారు. ఇదేక్కెడి న్యాయమంటూ ఆ సేవామూర్తులు ఇప్పుడు గుండె పగిలిరోదిస్తున్నారు.
గతేడాది మార్చిలో ప్రభుత్వం 1640 మంది నర్సులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్ చేసింది. కరోనా సమయంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వేల మంది రోగులకు వీరు సేవలు అందించారు. ఈ ఏడాది మార్చి నాటికే వీరి ఉద్యోగ కాలపరిమితి పూర్తయినప్పటికీ, మరో ఏడాది వారి కొనసాగిస్తామని చెప్పి మూడు నెలలలోనే వారిని తొలగించారు. అతి భయంకరమైన పరిస్థితుల్లో ప్రాణాపాయాన్ని సైతం ధిక్కరించి పనిచేశారు. ఇప్పటి వరకూ వారి సేవలను ఉపయోగించుకున్న సర్కారు.. కరోనా ఉధృతి తగ్గడంతో 'ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్టు' ఇప్పుడు వారిని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నది. ప్రపంచమంతా మూడో ఉధృతి వచ్చే ప్రమాదముందని ఆందోళన చెందుతుంటే.. ఇంతటితో కరోనా అంతమైందని కేసీఆర్ సర్కార్ భావిస్తుందా అనేది అందరిని వేదిస్తున్న ప్రశ్న. అయిన వారు కూడా ముట్టుకోవటానికి ఇబ్బంది పడిన వేళ.. కరోనా రోగులను కంటికి రెప్పలా కాపాడుతూ వారు సేవలు అందించారు. పల్లె, పట్టణం తేడా లేకుండా అంతటా కరోనా బాధితులను గుర్తించడం, వారికి వైద్య సేవలు అందించి వారు కోలుకునేదాకా అన్నీ తామై వ్యవహరించారు. ఈ క్రమంలో కొందరు కరోనా బారినపడ్డారు, మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. అయినా వైరస్ బారిన పడిన లాక్షలాది మందికి సేవలందించి ద్వారా ప్రజల అభిమానం చూరగొన్నారు. కానీ, ప్రభువుల మెప్పును మాత్రం పొందలేకపోయారు.
కరోనా కష్ట కాలంలో వారిని దేవతలంటూ పొగిడిన ముఖ్యమంత్రి ఇప్పుడేమో ఉద్యోగాల నుంచి తొలగించి బలవంతంగా వెళ్లగొడుతున్నారు. మరి దేవతలకిచ్చే గౌరవమిదేనా? కరోనా వారియర్లంటూ చప్పట్లు కొట్టి, పూలవర్షం కురిపించి ఇప్పుడు రోడ్డున పడేశారు. కరోనా సమయంలో సేవలందించేందుకు ముందుకు వచ్చిన వారి సేవలను గుర్తిస్తామని నమ్మబలికి అవసరం తీరాక నట్టేట ముంచేశారు. ఎప్పుడో నలభై ఏండ్ల కింద బెడ్ల సంఖ్యను బట్టి నిర్ణయించిన నర్సుల సంఖ్యను ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నారు. పెరిగిన రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్య సిబ్బందిని పెంచకపోవడం అన్యాయం కదా! తమకు న్యాయం చేయాలని కోరేందుకు సీఎం వద్దకు వస్తే కలవకుండా పోలీసులతో అడ్డుకున్నారు. నిన్న గాక మొన్న గాంధీ, వరంగల్ ఎంజిఎంలకు వచ్చినప్పుడు.. వీళ్లను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ సారు, ఇప్పుడు ఉన్న ఉద్యోగమే ఊడకొట్టారు. రాష్ట్రంలో ఇప్పటికీ 7,647 నర్సుల పోస్టులు ఖాళీగా ఉంటే.. అందులో 2,200 మందిని మాత్రమే రిక్రూట్ చేశారు. ఇంకో 5,450 పోస్టులు ఖాళీగా ఉన్నా సిబ్బందిని తీసేస్తున్నారు. అవసరమైనప్పుడు వారి సేవలను ఉపయోగించుకొని.. వెట్టిచాకిరీ చేయించుకొని.. ఇప్పుడు అవసరం తీరాక వీధుల పాలుజేయడం వీరికి మాత్రమే చెల్లిన న్యాయం! రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆస్పత్రులలో ఖాళీగా ఉన్న నర్సుల పోస్టులను వీరితో నింపవచ్చు. ఇలా చేయడం వల్ల రాష్ట్రాన్ని కలవరపెడుతున్న నిరుద్యోగ సమస్య కొంతైనా తీరుతుంది. కానీ, అందుకు సర్కారు సిద్ధంగా లేదు.
ఉత్పాతాలు, ఉపద్రవాలూ ముంచెత్తిన తరుణంలో ప్రభుత్వాలు మరింత మానవీయంగా స్పందించాలి. కేవలం ఆర్భాటాలూ, అధిక ప్రసంగాలతోనే సరిపుచ్చి, చేతలలో ద్వంద వైఖరితో వ్యవహరిస్తే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా ప్రమాదాన్ని నిలువరించే కర్తవ్యంలో ముందుపీఠాన నిలిచిన యోధులకు నైతిక స్థైర్యం కల్గించాలి. కోవిడ్ మహమ్మారి విచ్చలవిడిగా చెలరేగు తున్నప్పుడు పాలకులు అనుసరిస్తున్న తీరు విస్తుగొల్పుతున్నది! ప్రభుత్వాలు ఎంత హంగామా చేసినా.. క్షేత్రస్థాయిలో నిర్దేశిత లక్ష్యాలను సాధించాల్సిందీ ఆపత్కాలంలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేయాల్సిందీ వైద్యులు, నర్సులే. వారికి ప్రభుత్వం నుంచి భద్రతతో కూడిన భరోసా, సమాజం నుంచి గౌరవంతో కూడిన ప్రతిస్పందన అవసరం. శక్తికి మించి సేవలందించటానికీ, 'సొంత లాభం మానుకొని సమాజం కోసం పాటుపడటానికీ' ఇటువంటి మానవీయ బాసట ఎంతగానో ప్రేరణ కలిగిస్తుంది. కానీ, ఇప్పుడేం జరుగుతోంది? పాలకులు ప్రజల ప్రాణాలను కోవిడ్ గాలికి వదిలేసినట్టే ఈ సమరంలో ముందు వరసలో నిలబడి అహర్నిశలూ పోరాడుతున్న నర్సులనూ నిర్లక్ష్యం చేస్తున్నారు. రెండో దశ ముగియకుండానే, మూడో ఉపద్రవం పొంచి ఉన్న తరుణాన.. ప్రభుత్వానికి ఇలాంటి చర్యలు తగునా? నర్సుల విలువైన త్యాగాలకు లభిస్తున్న గౌరవం ఇదేనా?