Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కళాకారుడు మానవ హృదయ నిర్మాత కావాలి' అంటాడు ఓ మహానాయకుడు. మానవ హృదయం నిర్మించడం అంత తేలికయినదేంకాదు. కానీ కళ ఆ లక్ష్యంతో ముందుకు పోవాలి. అప్పుడే సార్థకత. కళలో కల్పన ఉంటుంది. అయితే వాస్తవికతను ఆధారం చేసుకున్న కళే మనిషిని కదిలిస్తుంది. మరి అలాంటి కళా సృజన ఎక్కడ వెల్లివిరిస్తుంది అంటే... ఎక్కడ స్వేచ్ఛా వాతావరణం తొణికిసలాడుతుందో అక్కడ సృజన కొత్త పుంతలు తొక్కుతుంది. స్వేచ్ఛ లేనిచోట కళ వెలవెలబోతుంది. కళకు సరిహద్దులుండవు. రసానుభూతి సార్వత్రికమైనది. సృజన ప్రాంతాల గీతలకు మతాల గోడలకు అతీతమైనది. ఒక రకంగా చెప్పాలంటే సృజనకు ఇవి అడ్డుగోడలు. మత మౌఢ్యమైతే కళకు శత్రువులాంటిది. భారతీయ కళారంగం ఇప్పుడీ విపత్తును ఎదుర్కొంటోంది. భారతీయ సంస్కృతికి వ్యతిరేకమయిన ఆలోచనలు ముసురుకొంటున్నాయి. విచ్ఛిన్నత విద్వేషం చొరబడుతోంది.
''సాతీ హాత్ బడానా సాతీ హాత్ బడానా! ఏక్ అకేలా థక్ జాయేగా!'' అనే 'నయాదౌర్' సినిమాలో దిలీప్‌కుమార్ బృందంపై చిత్రించిన గీతం ఇప్పటికీ ఉత్సాహాన్ని నింపుతుంది. ఇది 1957లో వచ్చిన పాట. దిలీప్‌కుమార్ తన తొంభైఎనిమిదేండ్ల వయస్సులో ఇటీవల మన నుండి సెలవుతీసుకుని వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో పాటలు, పాత్రలు హీరోల గుణగణాలుగానే భావించేవాళ్ళం. ఒక సామూహిక చైతన్యానికి ప్రతీకగా ఉంటుందా గీతం. అప్పటి సినిమా నాయికలు, నాయకులూ కూడా ఉదాత్త భావాలు కలిగి కళాసేవలో నిబద్ధులుగా పాటుబడ్డారు. ఇప్పుడు 'సాతీహాత్ బడానా' తిరగబడుతోంది. నువ్వు నా మతం కాకుంటే, నా ప్రాంతం కాకుంటే, చేయి కలిపేది లేదనే కాలుష్య వాతావరణం కమ్ముకున్నది. ఇది కళాసృజనకు పెద్ద ప్రతిబంధకం. సినిమా రంగంలోకి ఈ రకమైన ఆలోచనలు, ఆంక్షలు విస్తరిస్తున్న తరుణంలో మననుండి నిష్క్రమించిన మహానటుడు దిలీప్‌కుమార్‌ను తలుచుకోవటం సముచితంగా ఉంటుంది.
భారతీయత అంటే హిందూ సంస్కృతే అని వక్రీకరించి చెబుతున్న మతతత్వవాదులకు సరైన సమాధానంగా నిలుస్తారు దిలీప్‌కుమార్. కేవలం ఒక సినిమా హీరోగానే చూడటం కాదు. మన భారతీయ ఉమ్మడి సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం ఆయన. మతాలకు ప్రాంతాలకు అతీతంగా నిలిచిన కళాత్మకతకు ప్రతీక అతను. భారతీయ లౌకిక జీవనంలో ఐదు దశాబ్దాల సినీ కళారంగంలో అత్యున్నతంగా ఎదిగిన కళాకారుడు. భారతీయ సినీ జగత్తుకు ప్రపంచ వ్యాపితంగానే కీర్తిని సంపాదించిపెట్టిన నటుడు. గాయకుడుగా కూడా ప్రసిద్ధుడు. 'మొగల్-ఏ-అజమ్' సినిమాలో సలీమ్‌గా ప్రేమను పండించిన నటశేఖరుడు.
దిలీప్‌కుమార్ అసలు పేరు యూసఫ్ ఖాన్. భారత పాకిస్థాన్‌లు విడిపోయినప్పుడు పాకిస్థాన్‌లోని పెషావర్ ప్రాంతంలో జన్మించిన దిలీప్, విడిపోయిన తర్వాత భారతదేశాన్ని ఎంచుకుని బాలీవుడ్లో స్థిరపడ్డాడు. హిందీ సినిమా రంగంలో విషాద నాయకుడుగా తన విలక్షణమైన నటనతో ఇరుదేశాలలోనూ అశేష జనుల అభిమానాన్ని, ప్రేమనూ చూరగొన్నాడు. తాను కూడా ప్రజల పట్ల ప్రేమను కనబరిచారు. 1993లో ముంబయిలో అల్లర్లు జరిగినప్పుడు బాధితులకు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నాడు. ఇది మత దురహంకారులకు ఆగ్రహం కలిగించింది. ఎందుకంటే మత ఉన్మాదానికీ ప్రేమకూ పొంతన కుదరుకదా! కానీ కళలకు, కళల్లో జీవితం నిండిపోయిన మనుషులకు మూలకందమైనది ప్రేమ. కళ అనేది ప్రేమ నుండే ఉత్పన్నమవుతుంది. కళాకారుడూ ప్రేమమయిగా మారినప్పుడే సజీవ వ్యక్తీకరణ సాధ్యమవుతుంది.
దిలీప్‌కుమార్ ప్రతిభను గుర్తించిన పాకిస్థాన్ ఆయనకు ఆ దేశ అత్యున్నత అవార్డు 'నిషాన్ ఎ ఇంతియాజ్'ను ప్రధానం చేసింది. దీనిని మనదేశంలో కొందరు వివాదంగా మార్చారు. అభ్యంతరాలు లేవనెత్తారు. పాకిస్థాన్ ప్రధానం చేసిన అవార్డును తిరిగి ఇచ్చేయాలని డిమాండు చేస్తూ ఒత్తిడి పెంచారు. అయితే దిలీప్‌కుమార్ దేశభక్తిని సందేహించాల్సిన అవసరంలేదని ఆనాటి ప్రధాని అటల్‌బిహారి వాజ్‌పేయి అండగా నిలబడటంతో ఆ వివాదానికి తెరపడింది. ఎవరో ఒకరు వాళ్ళే సర్టిఫై చేస్తేతప్ప ఏ సందర్భాన్నయినా విభజనకు, విద్వేషానికి అవకాశంగా తీసుకుంటూనే ఉంటారు. ఇదే కళారంగంలో గొప్ప నటుడుగానే కాక వారసత్వంగా కొనసాగుతున్న రాజ్‌కపూర్ పుట్టింది కూడా పాకిస్థాన్ ప్రాంతమే. కానీ వాళ్ళకు ఈ ఇబ్బందులు లేవు. వీళ్ళేకాదు సాక్షాత్తు ఎల్కే అద్వానీ కూడా నేటి పాకిస్థాన్ ప్రాంతంలోనే జన్మించారు.
ఎక్కడ పుట్టుక, ప్రదేశం, మతం ఆధారంగా మనుషుల్ని హీన ఉన్నత వర్గాలుగా విభజన చేస్తారో అక్కడ మానవీయతకు మహా గాయం అయినట్టే. స్వేచ్ఛగా విచ్చుకోవాల్సిన సృజనాత్మకరంగంలోకి విద్వేషపు ఆలోచనలు ప్రవేశిస్తే పురోగమనం శిథిలమవుతుంది. నిజమైన భారతీయ సంస్కృతికీ సృజనాత్మకతకూ ఆనవాలుగా నిలిచి నిష్క్రమిం చిన దిలీప్‌కుమార్ జ్ఞాపకాలు మన దారులకు దీపం పడతాయి.